Teacher Jobs: 523 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం తర్వాత ఆచార్యుల నియామకానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలు చేపడుతోంది. దీనిలో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకే దఫాలో 523 బోధన ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అక్టోబర్ 31 మంగళవారం ఉద్యోగాలు నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రతి విభాగంలో పూర్తిస్థాయిలో ఆచార్యుల నియామకం జరగనుంది. దీంతో విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో మరింత పటిష్టం అవడానికి మార్గం సుగమం అవుతుంది.
కళాశాలల వారీగా పరిశీలిస్తే ఆర్ట్స్ కళాశాల పరిధిలో ప్రొఫెసర్ 26, అసోసియేట్ 45, అసిస్టెంట్ 86, సైన్స్ కళాశాల పరిధిలో ప్రొఫెసర్ 31, అసోసియేట్ 50, అసిస్టెంట్ 87, న్యాయ కళాశాలలో ప్రొఫెసర్ 4, అసోసియేట్ 7, అసిస్టెంట్ 8, ఫార్మశీ కళాశాలలో ప్రొఫెసర్ 6, అసోసియేట్ 7, అసిస్టెంట్ 17, ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ప్రొఫెసర్ 18, అసోసియేట్ 30, అసిస్టెంట్ 101 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఆర్స్ కళాశాలలో మెత్తం 157, సైన్స్ కళాశాలలో 168, న్యాయ కళాశాలలో 19, ఫార్మశీ కళాశాలలో 30, ఇంజినీరింగ్ కళాశాలలో 149 ఖాళీలు చొప్పున భర్తీ కానున్నాయి. వర్సిటీలో మెత్తం 523 ఖాళీల భర్తీకి జరగనుంది.
చదవండి: Lecturer posts: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నాడు తండ్రి.. నేడు తనయుడు
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006, 2008లో రెండు పర్యాయాలు ఆచార్యుల పోస్టుల ను భర్తీ చేశారు. నాటి నుంచి నేటి వరకు విశ్వవిద్యాలయాల్లో బోధన ఉద్యోగాల భర్తీ సాధ్యపడలేదు. అదే సమయంలో విశ్వవిద్యాలయంలో సీనియర్ ఆచార్యుల పదవీ విరమణలు పెరగడంతో అనేక విభాగాల్లో కేవలం ఒకరు ఇద్దరు చొప్పున ఆచార్యులు మాత్రమే మిగిలారు. ఇటువంటి సమయంలో విశ్వవిద్యాలయాలు నిర్వహణ ఎంతో సంక్లిష్టంగా మారింది. వీటన్నింటిని అధ్యయనం చేసి పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించడంతోపాటు నోటిఫికేషన్ జారీ చేస్తోంది. గతంలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆచార్యుల ఉద్యోగాలు భర్తీ కాగా నేడు ఆయన తనయుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హయాంలో పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ దఫా జరుగుతున్న నియామకాల ఫలితంగా విశ్వవిద్యాలయం ఆచార్యులతో పరిపుష్టి అవుతుందని అధికారులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో శతాబ్ది వేడుకలకు సిద్ధమవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఈ ఉద్యోగ నియామక ప్రకటన మరింత బలాన్నిస్తోంది.