Skip to main content

AP CM YS Jagan : ప్రతి లోక్‌సభ, నియోజకవర్గంలో ఈ కళాశాలలు ఉండాల్సిందే..

సాక్షి, అమరావతి: ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీని పెట్టబోతున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌ యూనివర్శిటీలు రూపొందిస్తాయని వెల్లడించారు. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో బోధన, శిక్షణ ఉంటుందని వివరించారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడంతో వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయని తెలిపారు.

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా...
స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబ‌ర్ 13వ తేదీన‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టండి. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి. తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలతో పాటు కొత్తగా నిర్మించనున్న వైద్య కళాశాలల తరగతి గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలి. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి. 

75శాతం ఉద్యోగాలను వీరికే..
ప్రతి ఐటీఐలోనూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయాలి. దీనివల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదో తరగతిలోపు డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి. కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందిన వారి డేటాను పంపించాలి. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి ప్లాంట్లు, మోటార్లు, సోలార్‌ యూనిట్లు.. ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలావరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో వారికి నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.

పరిజ్ఞానాన్ని పెంచేలా..
‘పారిశుద్ధ్యం కోసం వినియోగిస్తున్న పరికరాలను నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉంది. నైపుణ్యంలేని మానవ వనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు సరిగ్గా నడవడం లేదు. నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదు. ఇలా నిత్య జీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆంగ్లంలో కూడా పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, ఆస్పత్రులను నిర్వహణ కోసం నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి’ అని సీఎం జగన్‌ తెలిపారు.

నియోజకవర్గానికొక ఐటీఐ..
‘నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుంది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైన కూడా దృష్టిపెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్‌ చేయించాలి. ప్రతి కళాశాల, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించేలా అడుగు ముందుకేయాలి. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్‌ స్టాఫ్‌ను పెట్టాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో టీచింగ్‌ సిబ్బందిపై పరిశీలన చేయాలి. 

ప్రతినెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశాం. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందిన వారికి అప్రెంటిస్‌షిప్‌ వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. నిపుణులతో బోధన చేయించేటప్పుడు డిజిటల్‌ పద్ధతిలో పొందుపర్చాలి. మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చు’ అని సీఎం జగన్‌ సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సమావేశానికి ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ లావణ్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అజయ్‌ రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బంగార్రాజు తదితరులు హాజరయ్యారు.

Published date : 13 Sep 2021 04:30PM

Photo Stories