Skip to main content

Study Abroad: విదేశీ విద్య మ‌రింత బారం... భారీగా పేరుకుపోతున్న రుణాలు.. ఉద్యోగం రాకుంటే ఘోరంగా ప‌రిస్థితులు

విదేశీ విద్య భారత విద్యార్థులకు భారమవుతోంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
Study Abroad

మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 
నాలుగో వంతు మందికి మాత్రమే...
చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. 

Study abroad


ఏటా 4 లక్షల మంది....
మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. 
కరోనా తగ్గుముఖం పట్టాక..
కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. కరోనాతో 2020లో ఆ సంఖ్య సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
బ్యాంకుల నుంచే అధిక రుణాలు
కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 2022లో ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు కాగా, ఇందులో దాదాపు సగం మేర రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే.

Published date : 02 Mar 2023 04:02PM

Photo Stories