Skip to main content

Degree Courses Reforms 2023 : డిగ్రీ కోర్సుల్లో కొత్త‌ సంస్కరణలు ఇవే.. ఈ మార్కుల తెచ్చుకున్న వారికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్లో మార్పులు తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తుంది. సింగిల్‌ సబ్జెక్టు స్పెషల్‌ డిగ్రీ విధానం అమల్లోకి వస్తుంది.
Degree Students Latest news telugu
AP Degree Courses New Education System

ఈ నూతన విధానం వల్ల విద్యార్థికి నచ్చిన సబ్జెక్టుపై సమగ్ర అవగాహన పొందవచ్చు. అదే విధంగా ఇతర సబ్జెక్లులపై కూడా పట్టు సాధించవచ్చు. ఈ విషయంపై ఇప్పటికే కళాశాల స్థాయిలో విద్యార్థులకు ఈ విధానంపై అవగాహన కలిగించామ‌ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(విజయనగరం) ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బలగ సుభ తెలిపారు

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు డిగ్రీ విద్యలో సమూల సంస్కరణలు చేపట్టింది. విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి స్వయం ఉపాధి పొందేలా విద్యలో సంస్కరణలు తెచ్చింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల డిగ్రీని తెచ్చింది.

ఇప్పటి వరకు డిగ్రీలో..
విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) విద్యలో సింగిల్‌ సబ్జెక్టు మేజర్‌గా నూతన విద్యా ప్రణాళిక (కరిక్యూలమ్‌)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు డిగ్రీలో మూడు సబ్జెక్టుల ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండేది. ఇకపై మేజర్‌ సబ్జెక్టుతో ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు విద్యా ప్రణాళికను మార్పు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయిం తీసుకుంది. 

ఏదైనా ఒక సబ్జెక్టులో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా విద్యా ప్రణాళికను అమలులోకి తీసుకువచ్చారు. కళాశాలల కమిటీలు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఆయా కళాశాలకు మేజర్‌, మైనర్‌ సబ్జెక్టు కేటాయింపులు ఇప్పటికే జరిగిపోయాయి. సంబంధిత జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కశాళాలల్లో ఇటీవల ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల అయింది. నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం బుధవారంతో ప్రవేశాల కోసం రిజస్ట్రేషన్‌ గడువు ముగియనుంది.

మూడింట ఒక్కటే..
గ‌తంలో బీఎస్సీలో ఎంపీసీ తీసుకున్న విద్యార్థులకు ప్రధానంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లను తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ మూడు కోర్సుల్లో నుంచి తమకు నచ్చిన ఓ సబ్జెక్టను మేజర్‌గా ఎంపిక చేసుకుంటే చాలు రెండో సెమిస్టర్‌ దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన ఓ మైనర్‌ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ఒక సైన్స్‌ విద్యార్థి మైనర్‌ సబ్జెక్టుగా ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటా సైన్స్‌, మార్కెటింగ్‌.. ఇలా ఇతర ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. 

ఆర్ట్స్‌ విద్యార్థులు మైనర్‌ కోర్సుల్లో భాగంగా ఇంటర్మీడియెట్‌ కోర్సుల ఆధారంగా తమకు నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్‌ డిగ్రీలో అమలు చేయనున్నారు. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజినీరింగ్‌తో సమానంగా మానవ వనరులను తీర్చిదిద్దేంకుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయి. 

2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్‌ వెలువరించారు. కొత్త విధానంపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. ఈ రెండు మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒక దానితో పీజీ విద్య వరకు అభ్యసించేలా మార్పులు చేశారు.

నాలుగేళ్లకు..
దేశంలోనే తొలిసారిగా నూతన జాతీయ విద్యా విధానం–2020 మేరకు విద్యా సంస్కరణలను మన రాష్టంలోనే అమలు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ విద్య పూర్తయింది. ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయింది. యూజీసీ ఫ్రేమ్‌ వర్క్స్‌ ప్రకారం యూజీ విద్యను రెండు విధాలుగా విభజించారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించిన వారు రీసెర్స్‌ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. 

ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా నేరుగా పీహెచ్‌డీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్‌ ఆనర్స్‌ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో రెండో ఏడాదిలో చేరవచ్చు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆనర్స్‌ కోర్సులను అందించేందుకు నిబంధనలు విధించారు. మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్‌ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే ఆనర్స్‌ కోర్సుల బోధనకు అనుమతి మంజూరు చేస్తారు.

మంచి మార్కుల తెచ్చుకున్న వారికి..
నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తెస్తున్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు డిగ్రీ విధానం వల్ల విద్యార్థికి ఉపాధి కల్పన సులువవుతుంది. ఉదాహరణకు జూవాలజీ మేజర్‌ సబ్జెక్టుగా తీసుకున్న విద్యార్థికి ఆ సబ్జెక్టుకు సంబంధించి అనుబంధ జీవనోపాధుల అంశాల్లో నిష్టాతులవుతారు. ఆక్వా ఇండస్ట్రీ, డెయిరీ ఫార్‌మ్స్‌, పౌల్ట్రీ ఫార్మ్‌, కుందేలు పెంపకాలు, తేనె తయారీ విధానం, ఇలా అనేక రకాలుగా ఉపాధి అవకాశాల లభిస్తాయి. మంచి మార్కుల తెచ్చుకున్న వారికి పీహెచ్‌డీ పరిశోధన డిగ్రీలకు నేరుగా వెళ్లవచ్చు.
             –డాక్టర్‌ ఎస్‌.రామకృష్ణ, జూవాలజీ అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజయనగరం

Published date : 18 Jul 2023 03:57PM

Photo Stories