Skip to main content

UPSC CAPF-AC 2022: డిగ్రీ అర్హతతో గ్రూప్‌–ఎ హోదా.. పరీక్ష వివరాలు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

capf ac 2022 notification details and syllabus and preparation tips
capf ac 2022 notification details and syllabus and preparation tips

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌.. సంక్షిప్తంగా.. సీఏపీఎఫ్‌! కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని.. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటివి.. దేశ అంతర్గత, సరిహద్దు భద్రత బాధ్యతలు నిర్వహించే.. కీలక విభాగాలు! ఇంతటి కీలక విభాగాల్లో.. బ్యాచిలర్‌ డిగ్రీతోనే.. కొలువు సాధించే అవకాశం వచ్చింది. అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాలో.. గ్రూప్‌–ఎ కేడర్‌లో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు! దీనికోసం చేయాల్సిందల్లా.. యూపీఎస్సీ నిర్వహించే.. సీఏపీఎఫ్‌–అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియలో విజయం సాధించడమే. ప్రతి ఏటా క్రమం తప్పకుండా.. ఈ పోస్ట్‌లకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. తాజాగా.. 2022 సంవత్సరానికి సంబంధించి సీఏపీఎఫ్‌–2022 ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో.. సీఏపీఎఫ్‌–ఏసీ–2022 నియామక విధానాలు, విభాగాలు, పరీక్ష వివరాలు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ....

  • సాయుధ దళాల్లో ‘భద్రత’నిచ్చే కొలువు
  • డిగ్రీ అర్హతతో గ్రూప్‌–ఎ హోదాతో కెరీర్‌ ప్రారంభం
  • సీఏపీఎఫ్‌–2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వ కొలువులు, అందులోనూ దేశ భద్రతలో పాల్పంచుకునే ఉన్నతస్థాయి ఉద్యోగం. అదే.. సీఏపీఎఫ్‌–అసిస్టెంట్‌ కమాండెంట్‌. యూపీఎస్సీ నిర్వహించే సీఏపీఎఫ్‌–ఏసీ పరీక్షలో ప్రతిభ ద్వారా అసిస్టెంట్‌ కమాండెంట్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు. సీఏపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా కెరీర్‌ ప్రారంభించిన వారు.. భవిష్యత్తులో తాము ఎంపికైన విభాగాల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ లేదా అంతకంటే ఉన్నతమైన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్థాయికి చేరుకోవచ్చు. కెరీర్‌లో అత్యంత ప్రతిభ చూపిన వారు ఆయా దళాల్లో అత్యున్నతమైన అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది.

అయిదు విభాగాలు.. 253 పోస్ట్‌లు

సీఏపీఎఫ్‌–అసిస్టెంట్‌ కమాండెంట్‌ పరీక్ష ద్వారా మొత్తం నాలుగు విభాగాల్లో 253 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. గత ఏడాదికంటే ఈ సంవత్సరం పోస్ట్‌ల సంఖ్య పెరగడం గమనార్హం. గత ఏడాది 159 పోస్ట్‌లకే నియామకాలు చేపట్టగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 253గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పోస్టుల వివరాలు

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) 66
సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) 29
సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) 62
ఇండో–టిబెటిన్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) 14
సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ) 82
మొత్తం 253

అర్హతలు

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయోపరిమితి: ఆగస్ట్‌ 1, 2022 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి(ఆగస్ట్‌ 2, 1997–ఆగస్ట్‌ 1, 2002 మధ్యలో జన్మించి ఉండాలి). గరిష్ట వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
  • వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

మూడు దశల ఎంపిక ప్రక్రియ

యూపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అవి.. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ.

తొలి దశ రాత పరీక్ష

ఎంపిక ప్రక్రియలో మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఈ రాత పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. వివరాలు.. 

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
పేపర్‌–1 జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ 250
పేపర్‌–2 జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ 200
మొత్తం మార్కులు    450
  • పేపర్‌–1కు రెండు గంటలు, పేపర్‌–2కు మూడు గంటల సమయం కేటాయించారు. 
  • పరీక్ష పెన్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది.
  • ఆబ్జెక్టివ్‌ పేపర్‌గా ఉండే పేపర్‌–1లో నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతుంది. –ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులను నెగెటివ్‌ మార్కులుగా నిర్దేశించారు.

ఆబ్జెక్టివ్‌ విధానంలో.. పేపర్‌–1

జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అంశాలతో ఉండే పేపర్‌–1లో సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఈ పేపర్‌లోని ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నల్లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం–జీవ వైవిధ్యం, కరెంట్‌ అఫైర్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

చ‌ద‌వండి: Science & Technology Preparation: సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం...​​​​​​​  

డిస్క్రిప్టివ్‌ విధానంలో పేపర్‌–2

  • పేపర్‌–2ను డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. –పార్ట్‌–ఎ(జనరల్‌ స్టడీస్‌), పార్ట్‌–బి(ఎస్సే అండ్‌ కాంప్రహెన్షన్‌)గా రెండు విభాగాలుగా నిర్వహించే పేపర్‌–2 ఉంటుంది. పార్ట్‌–ఎలో ఎస్సే కొశ్చన్స్‌ అడుగుతారు. 
  • ఈ ఎస్సే రైటింగ్‌ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా.. చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్‌–ఎకు 80 మార్కులు కేటాయించారు.
  • పార్ట్‌–బిలో 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రెసిస్‌ రైటింగ్, రిపోర్ట్‌ రైటింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఉంటాయి.

తదుపరి దశ పీఈటీ

మొదటి దశగా నిర్వహించే రాత పరీక్షలో పేపర్‌–1,2లలో నిర్దేశిత కటాఫ్‌ సొంతం చేసుకున్న అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నాలుగు విభాగాల్లో(వంద మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్, షాట్‌పుట్‌) ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఇందులో పురుషులు, మహిళలకు వేర్వేరు సమయాలు ఉంటాయి. అవి.. 

విభాగం పురుషులు  మహిళలు
వంద మీటర్లు 16సెకండ్లు 18సెకండ్లు
800 మీటర్లు 3ని. 45సెకండ్లు  4ని. 45సెకండ్లు
లాంగ్‌ జంప్‌ 3.5 మీటర్లు 3 మీటర్లు
షాట్‌పుట్‌ (7.26 కిలోలు) 4.5 మీటర్లు ––
  • లాంగ్‌జంప్‌ విభాగంలో గరిష్టంగా మూడుసార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షాట్‌పుట్‌ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది. 

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దేశిత కటాఫ్‌ల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 150 మార్కులకు నిర్వహించే ఈ పర్సనల్‌ ఇంటర్వ్యూలో.. ప్రధానంగా సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించేందుకు అవసరమైన దృక్పథాన్ని పరీక్షిస్తారు. 

గ్రూప్‌–ఎ గెజిటెడ్‌ హోదాతో కొలువు

మూడు దశల ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు తాము పొందిన ర్యాంకు, సర్వీస్‌ ప్రిఫరెన్స్‌ ఆధారంగా శాఖను కేటాయిస్తారు. తర్వాత దశలో సుమారు ఏడాది వ్యవధిలో ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే..గ్రూప్‌–ఎ గెజిటెడ్‌ హోదాలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధుల్లో చేరడమే. 

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

ప్రిపరేషన్‌ ఇలా

  • పేపర్‌–1లో మంచి మార్కులు సాధించాలంటే.. ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకూ.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని అంశాల బేసిక్స్, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. 
  • కరెంట్‌ అఫైర్స్‌ కోసం ఆర్థిక–రాజకీయ పరిణామాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది. దీంతోపాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం.. ఆ పోరాటంలోని ముఖ్య ఘట్టాలు–వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. 
  • ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ–భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మేలు చేస్తుంది. 
  • పేపర్‌–2లో రాణించాలంటే.. అభ్యర్థులకు బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్‌ చేయాలి. 
  • ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్‌ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి. ఈ ఫిజికల్‌ ప్రాక్టీస్‌ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. 
  • ఇలా దరఖాస్తు సమయం నుంచే సన్నద్ధత పొందితే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

60 శాతం మార్కులతో విజేతగా

సీఏపీఎఫ్‌–అసిస్టెంట్‌ కమాండెంట్‌ గత మూడేళ్ల కటాఫ్‌ మార్కులను, తుది విజేతలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం ఆరు వందల మార్కులకు(రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 150 మార్కులు) జరిగే ఎంపిక ప్రక్రియలో 50 శాతం మార్కులు సాధించి నిర్దేశిత ఫిజికల్‌ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధిస్తే.. సర్వీస్‌ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించే దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సీఏపీఎఫ్‌–2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 10, 2022 
  • దరఖాస్తుల ఉపసంహరణ: మే 17 నుంచి మే 23 వరకు;
  • సీఏపీఎఫ్‌ రాత పరీక్ష తేదీ: ఆగస్ట్‌ 7, 2022 (ఉదయం 10 నుంచి 12 వరకు; మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు)
  • తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు వెబ్‌సైట్‌: www.upsconline.nic.in


చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!

Published date : 28 Apr 2022 06:46PM

Photo Stories