Skip to main content

Priyanka Group-1 Topper : మొదటి ప్రయత్నంలోనే టాప‌ర్‌...నా ల‌క్ష్యం ఇదే

ఆమె చదివింది బీటెక్‌. పైగా ఇంజనీరింగ్‌ విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌లో.. ఎంతోమంది కోరుకునే విదేశీ కంపెనీలో జాబ్‌... అయిదంకెల జీతం..
Priyanka Group-1 Topper
గ్రూప్‌ 1 మహిళా విభాగం టాపర్‌ ప్రియాంక

అయినాసరే కెరీర్లో ఏదో వెలితి. ఏదో తెలీనీ లోటు.. ఇంకా ఏదో చేయాలనే తపన...అంతే కలల కొలువు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వద్దనుకుంది... ఇంకేం చేయాలి... సమాజసేవకు, క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వీలున్న అత్యున్నత కెరీర్‌ సివిల్స్‌ అనిపించింది. అంతే.. వెనక్కు తిరిగి చూడలేదు. సాఫ్ట్‌వేర్‌ రంగానికి స్వస్తిపలికి తక్షణం పోటీప్రపంచంలోకి అడుగుపెట్టింది. అంతే టార్గెట్‌ గ్రూప్‌-1... లక్షలాదిమంది అభ్యర్థులు ఇందులో విజయం సాధించడంకోసం అహోరాత్రులు ఏళ్లతరబడి చమటోర్చుతున్న ఈ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు... అంతేకాదు మహిళల విభాగంలో స్టేట్‌ టాపర్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమే సీహెచ్‌.ప్రియాంక... తాను గ్రూప్‌ 1లో విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నం, కష్టం వెనుక ఎంతటి కృషి ఉంది? అసలు విజేతగా నిలిచేందుకు ఏం చేశారు? వంటి పలు విషయాలపై సాక్షి ఆమెను ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. వివరాలివే...

 మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏం ప్రశ్నలు అడిగారు?
స్నేహ పూర్వక వాతావరణంలో 15నుంచి 20 నిమిషాలపాటు ఇంటర్వ్యూ జరిగింది. అంతకుముందు నేను సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి రావడంతో ఆ బ్యాగ్రౌండ్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా
➤ క్లౌడ్‌ టెక్నాలజీ అంటే?
➤ మేఘమథనం గురించి మీకేం తెలుసు?
➤ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎవరు? హైదరాబాద్‌తో ఆయనకున్న సంబంధం?
➤ ప్రియాంకచోప్రా ఎవరు? ఆమె మిస్‌ ఇండియా ఎలా అయింది?
➤ సాఫ్ట్‌వేర్‌ రంగం వృద్ధి చెందడం వలన దాని ప్రభావం మన సంస్కృతి పై ఏవిధంగా ఉంది? 
➤ప్రస్తుతం దంపతుల్లో విడాకులు పెరుగుతున్నాయి..కారణం?
➤ నానో టెక్నాలజీ అంటే?
➤ కోడలు దిద్దిన కాపురం సినిమాలో కథానాయకైన కోడలికి ఉన్న క్వాలిటీ?
➤  భిన్నత్వంలో ఏకత్వం అంటే తెలుసా? వంటి ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ అంతా సహృద్భావ వాతావరణంలో జరిగింది.

 
గ్రూప్‌1 మార్కుల్లో మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచారు.. ఏమనిపిస్తోంది?

చాలా సంతోషంగా ఉంది. టాపర్‌గా నిలుస్తానని ఊహించలేదు. సివిల్‌ సర్వీసులో ప్రవేశించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేను.. గ్రూప్‌1 ప్రకటన వెలువడటంతో అంచనాలు లేకుండానే దరఖాస్తు చేశాను. చివరకు ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడినప్పుడు సైతం పాసవుతాననే నమ్మకం కూడా లేదు. అయితే అనుహ్యంగా ప్రిలిమ్స్‌లో కటాఫ్‌ 83 మార్కులకు 88మార్కులు సాధించానని తెలిసిన తర్వాత పట్టుదలపెరిగింది. అంతే...ఆత్మవిశ్వాసంతో మెయిన్స్‌కు సాధన మొదలుపెట్టాను. తీరా గ్రూప్‌1 ఫలితాలు వెల్లడించిన తర్వాత మహిళా విభాగంలో టాపర్‌నని తెలియడంతో ఆనందానికి అవధుల్లేవు. నా జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన ఇది.
 
 గ్రూప్‌-1 ఎందుకు రాయాలనుకున్నారు? ప్రిపరేషన్‌కు ముందు ఏం చేసేవారు?
ఇంటర్‌ తర్వాత వరంగల్‌ ఎన్‌ఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తిచేశాను. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఓ విదేశీ కంపెనీలో ఉద్యోగం లభించింది. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేయాలనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశా. సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి లేకపోవడంతో ఈ రంగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో సమ్మతి లభించడంతో ఈరంగాన్ని వదిలేశాను. అయితే మొదటినుంచీ క్షేత్రస్థాయిలో పనిచేయడం అంటే చాలా ఇష్టం. పబ్లిక్‌ సర్వీస్‌ అంటే ఇంకా ఇష్టం. అందుకే నా ఆలోచనలకు సివిల్‌సర్వీస్‌ రంగం సరిపోతుందని భావించి.. సివిల్స్‌లో విజయం సాధించడంపై దృష్టి సారించాను.
 
కంప్యూటర్‌ రంగం నుంచి వచ్చిన మీరు మొదటిసారి గ్రూప్‌-1 రాయాలనుకున్నప్పుడు విజయం సాధించగలననుకున్నారా?
లేదు. సాఫ్ట్‌వేర్‌ రంగం కంప్యూటర్‌ మీద ఆధారపడి ఉంటుంది. కాని సివిల్స్‌, గ్రూప్‌-1 అలా కాదు. చాలా కష్టపడాలి. నా లాంటి విద్యార్థికైతే మరీ కష్టం. సివిల్స్‌,గ్రూప్‌-1 రాయాలనుకున్నప్పుడు అసలు నేను రాణించగలనా? అనే అపనమ్మకం ఏర్పడింది. పైగా చదివింది వెంటనే గుర్తుండదనే భయం మొదటినుంచీ నన్ను వేధిస్తుండేది. అయినాసరే వీటన్నింటిని అధిగమించగలిగాను. పైగా కంప్యూటర్‌ రంగాన్ని వదిలేసినతర్వాత సివిల్స్‌, గ్రూప్‌1లోకి రావాలనున్నప్పుడు ఓ సారి వీటి సిలబస్‌ను పరిశీలాంచాను. సబ్జెక్టులన్నీ ఆసక్తిగా అనిపించాయి. ఇంతకుముందు వాటిని చదవకపోవడంతో ఓ కాంపిటేటివ్‌ ఎగ్జామ్‌కు ప్రిపరేషన్‌ కోసం కాకుండా కొత్త సబ్జెక్టులు నేర్చుకోవాలన్న తపనతో ఆసక్తి,పట్టుదల పెంచుకున్నాను. ఒకరకంగా ఈ ఆత్మవిశ్వాసమే నన్ను ముందుకు నడిపించింది.
 
 గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎలా ప్రిపరయ్యారు? ఎలాంటి వ్యూహాలు అనుసరించారు?
మొదటిసారి కాంపిటేటివ్‌ పరీక్షలు రాస్తున్న నేను లక్షలమంది పోటీపడే గ్రూప్‌1లో అసలు రాణించగలనా? అనే అనుమానం మొదలయింది. తీరా ప్రిలిమ్స్‌ పరీక్షల్లో అనుకున్నదానికన్నా ఎక్కువ మార్కులు సాధించడంతో భయం ఎగిరిపోయింది. అప్పటివరకు సివిల్స్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో గ్రూప్‌1ను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. తీరా ప్రిలిమ్స్‌లో విజయంతో మెయిన్స్‌ ప్రిపరేషన్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. కష్టమైన 1,4వ పేపర్లకు సబ్జెక్టు నిపుణుల వద్ద కోచింగ్‌ తీసుకున్నా. మిగిలిన వాటికి సొంత నోట్స్‌ తయారు చేసుకున్నా. ఎలాగైనా గ్రూప్‌1 సాధించాలనే పట్టుదలతో ఎక్కడకూ వెళ్లకుండా రోజులో ఎక్కువ సమయం సబ్జెక్టులపైనే దృష్టిసారించా. అసలు గ్రూప్‌1 మెయిన్స్‌లో పేపర్ల వారీగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ప్రశ్నల స్థాయి? అర్థం చేసుకున్నా. దాని ఆధారంగా సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునేదాన్ని. ఇందుకోసం ముఖ్యంగా మూడు సూత్రాలను పాటించా...
1) ఇంపార్టెంట్‌ క్వశ్చన్స్‌
2)జనరల్‌ క్వశ్చన్స్‌
3) ప్రీవియస్‌ ఎగ్జామ్‌లో అడిగిన క్వశ్చన్స్‌ ....ఇలా మూడు రకాలుగా విభజించుకుని ప్రిపరేషన్‌ మొదలుపెట్టా. లెస్సన్స్‌ చదివేటప్పుడు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రోబబుల్‌ క్వశ్చన్స్‌ తయారు చేసుకున్నా. వాటికి కనీసం రెండు పేజీల సమాధానాలు రాసేదాన్ని. ఎందుకంటే మెయిన్స్‌లో అడిగే ఎస్సే క్వశ్చన్స్‌కు సమాధానాలు రాయాలంటే ఒక్కో ప్రశ్నకు 12నిమిషాలు పడుతుంది. అందుకే ఎగ్జామ్‌ టైంలో సమయం వృథాకాకుండా ఉండేందుకు రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేశాను. ఎకానమీ పేపర్‌కు దాదాపు తెలుగు పత్రికలపైనే ఆధారపడ్డాను. వీటిని తరచుగా ఫాలో కావడం ప్లస్‌ అయింది.
 
 మెయిన్స్‌లో రాణించడానికి రోజూ ఎన్ని గంటలు చదివేవారు? టైం మేనేజ్‌మెంట్‌ ఎలా సాధ్యమయింది?
కచ్చితంగా రోజుకు ఇన్ని గంటలు చదవాలనే నియమం పెట్టుకోలేదు. అసలే ఓన్‌ ప్రిపరేషన్‌ కావడంతో రాత్రి,పగలు చదివా. ఒకరకంగా రోజుకు 12 గంటలకుపైగానే చదివేదాన్ని. గ్రూప్‌1లో సక్సెస్‌ కావాలంటే ముందు టైం మేనేజ్‌మెంట్‌ చాలా అవసరమేనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనకు ఎంత సబ్జెక్టు నాలెడ్జ్‌ ఉన్నా..దాన్ని పేపర్‌పై పెట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగని రాస్తూ కూర్చుంటే ఎగ్జామ్‌ సెంటర్లో టైం అయిపోతుంది. అందుకే బాగా ఎక్కువగా రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం కలిసి వచ్చింది.

మీ జీవిత లక్ష్యం?
సివిల్‌ సర్వీస్‌. ఈ రంగంలో విజయం సాధించి అయ్యేఎస్‌ అవాలనేదే లక్ష్యం. అందుకోసం ప్రయత్నిస్తా.
 
గ్రూప్‌-1లో మొత్తం మీ మార్కులు? విద్యా, కుటుంబ నేపథ్యం?
మొత్తం 561.66 మార్కులు వచ్చాయి. మాది పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు. ఫాదర్‌ బ్యాంక్‌ మేనేజర్‌. టెన్త్‌ వరకు నిడదవోలులో చదివాను. ఇంటర్‌ తణుకు, బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ వరంగల్‌ ఎన్‌ఐటీలో పూర్తిచేశాను.

గ్రూప్‌-1కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీ సలహా?

ముందుగా సిలబస్‌ను అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను గుడ్డిగా ప్రిపరేషన్‌ మొదలు పెట్టకూడదు. అసలు పేపర్లవారీగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఓ అంచనాకు రావాలి. ఇది చాలా ముఖ్యం. భవిష్యత్తు ప్రిపరేషన్‌ ఈ ప్రశ్నలస్థాయి ఆధారంగా మొదలుపెట్టాలి. ఎంతబాగా చదివినా దానికి మించి రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. ప్రాక్టీస్‌లో వెనుకబడిపోతే ఎగ్జామ్‌లో టైం సరిపోక ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. మెయిన్స్‌లో అడిగే ప్రశ్నలస్థాయి లోతైనవిగా ఉంటాయి. అందుకే ప్రిపరేషన్‌ సమయంలోనే సబ్జెక్టులవారీగా చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకుంటే ఉపయోగపడతాయి. అన్నింటికి మించి విజయం సాధించగలనన్న నమ్మకంతో ప్రిపరేషన్‌ మొదలుపెడితే విజయం కచ్చితంగా వరిస్తుంది.

Published date : 16 Dec 2021 03:09PM

Photo Stories