TS Job Aspirants Local Issue: బోనఫైడ్‌లకు బదులుగా పెద్దసంఖ్యలో రెసిడెన్షియల్ సర్టిఫికెట్ల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకు, 5% మాత్రం ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తూ నియామక సంస్థలు భర్తీ ప్రక్రియ చేపడతాయి.
టీజీపీఎస్సీ ద్వారా ప్రస్తుతం గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
స్థానికత నిర్ధారణ ఇలా...
కొత్త జిల్లాల ఏర్పాటు..ఆపై జోన్లు, మల్టీ జోన్ల విభజన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత స్థానికత పరిగణనలో ప్రభుత్వం కొంతమేర మార్పులు చేసింది.
- ఒక అభ్యర్థి స్థానికతను విద్యాభ్యాసం ఆధారంగా పరిగణిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతిలో ఎక్కువ కాలం(కనీసం నాలుగు సంవత్సరాలు) చదివిన జిల్లాను స్థానికతగా గుర్తిస్తున్నారు. లేదా 4,5,6,7 తరగతులను రాష్ట్రంలో చదివిన విద్యార్థిని తెలంగాణలో స్థానిక అభ్యర్థి కింద లెక్కిస్తారు.
- జిల్లా యూనిట్‌గా తీసుకున్నప్పుడు మాత్రం 1 నుంచి 7వ తరగతిలో కనీసం నాలుగేళ్లు చదివిన జిల్లాను ఆ జిల్లాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు ఆ విద్యార్హత సర్టిఫికెట్లు (బోనఫైడ్) పరిశీలిస్తారు.
తహసీల్దార్ ధ్రువీకరించినవే ఎక్కువగా..
గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీజీపీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన చేపడుతోంది. అయితే చాలామంది అభ్యర్థులు బోనఫైడ్‌లకు బదులుగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు.
- తహసీల్దార్ ద్వారా తీసుకున్న నివాన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తుండడంతో వాటిని అధికారులు ఆన్‌లైన్ ద్వారా నిర్ధారించుకుని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
- రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదవుకున్న బోనఫైడ్‌లు మాత్రం సమర్పించడం లేదని సమాచారం. వారంతా ఏడోతరగతి వరకు బడికి వెళ్లకుండా ప్రైవేట్ పద్ధతిలో చదువుకున్నట్టు చెబుతుండడం గమనార్హం.
ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువగా...
రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థుల్లో అత్యధికంగా మూడు జిల్లాలకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మరో నెలరోజుల పాటు జరగనుంది. ఇప్పటివరకు జరిపిన పరిశీలన ప్రక్రియలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ జిల్లాల పరిధిలో ఉద్యోగాల సంఖ్య కూడా ఎక్కువే. పట్టణ నేపథ్యమ్ను ఈ జిల్లాల్లో స్కూల్‌కు వెళ్లకుండా ప్రైవేట్‌గా చదివే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న పలువురి నుంచి ఉత్పన్నమవుతోంది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి స్థానికత ధ్రువీకరణ పత్రం సంపాదించడంపైనా పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో సరైన విధంగా విచారణ జరపకుండా నియామక పత్రాలు ఇస్తే స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని నియామకాల్లోనూ..
టీజీపీఎస్సీ మాత్రమే కాదు..తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు(టీజీఎస్‌పీఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌అండ్‌హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీజీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా గత ఆర్నెళ్లలో 30వేలకు పైబడి ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఈ ప్రక్రియలోనూ చాలామంది అభ్యర్థులు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించిన వారి వివరాలను బహిర్గతం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగ నియామక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు.