Skip to main content

సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి?

tenthclass భూమిపై సముద్రాలు 3,62,000,000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. అంటే అవి భూ ఉపరితలంపై 71 శాతం విస్తీర్ణంలో పరుచుకొని ఉన్నాయి. సముద్రాల సరాసరి లోతు 3.7 కిలోమీటర్లు.

సముద్రాలు విశ్వంలో భూమి ఏర్పడిన తొలి రోజుల్లోనే ఏర్పడ్డాయి. భూమి ఏర్పడిన తొలి రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రత గల అగ్నిగోళంలా ఉండేది. అందులో అంతర్భాగం, ఆవరణ, పైపొర అనే ప్రధాన భాగాలు ఉండేవి. ఆ దశలో, భూమి అంతర్భాగం నుంచి నీటి ఆవిరి, వివిధ పదార్థాల భాష్పవాయువులు లావా రూపంలో భూమి ఉపరి తలానికి తన్నుకు వచ్చాయి. భూ ఉపరితలానికి వచ్చిన లావాలోని నీటి ఆవిరి నీటితో కూడిన మేఘాలుగా మారి భూమి నుంచి ఎత్తుగా వెళ్లాయి. తర్వాత కాలంలో ఆ మేఘాలు చల్లబడి నీటి రూపంలో భూమిపై వర్షించాయి. ఆ నీరే సముద్రాల రూపం సంతరించుకుంది.

అలా ఏర్పడిన అపారమైన నీటిని నిలువ చేయడానికి అవసరమైన అగాథాలు ఎలా ఏర్పడ్డాయి?
భూమి తొలిదశలో ఇప్పటిలాగా విడివిడిగా వేర్వేరు ఖండాలుగా కాకుండా మొత్తం ఒకటిగానే ఉండేది. కాలంగడిచే కొలది, భూపై భాగం సుమారు ఆరు పెద్ద ఫలకాలుగా, మరికొన్ని చిన్న ఫలకాలుగా విడిపోయింది. భూమిలోపలి అత్యంత ఉష్ణోగ్రత వల్ల ద్రవరూపంలో ఉన్న రాళ్లు, శిలల కదలికల వల్ల ఈ ఫలకాలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా కదలి, ఈనాటి మన ఖండాలుగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు, దక్షిణ అమెరికాను, ఆఫ్రికా ఖండపు వంపులోకి వచ్చేటట్లు అమరిస్తే, అవి ఏ మాత్రం ఖాళీ లేకుండా కలుసుకుంటాయి. అంటే, ఈ ఖండాలు భూమి ఏర్పడిన తొలిరోజుల్లో కలిసి ఉండేవన్నమాట. ఈ భూమి ఖండాలు ఫలకాలుగా దూరదూరంగా విడివడిన అగాథాల్లో సముద్రాలు ఏర్పడ్డాయి.
- లక్ష్మి .... ఈమని
Published date : 19 Aug 2013 12:40PM

Photo Stories