కదలిక (చలనం) - దాని కథ
Sakshi Education
భూమిపై ప్రతి వస్తువు స్థిరంగాకాని, చలనంలో కాని ఉంటుంది. ప్రాణులు, వాహనాలు చలనంలో ఉంటాయి. చెట్లు, కొండలు స్థిరంగా ఉంటాయి. నిజానికి అవి కూడా చలనంలో ఉన్నట్లే. ఎందుకంటే అవి భూమితోపాటే కదలికలో ఉన్నాయి. ఆ విధఃగా విశ్వంలో ఏ వస్తువు నిశ్చల (స్థిర) స్థితిలో లేదు. పదార్థం అంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలే కాదు వాటిలో ఉండే అణువులు, పరమాణువులూ చలిస్తూనే ఉంటాయి.
స్థిరస్థితిలో ఎప్పటికీ ఉండడమంటే, మరణావస్థలో ఉన్నట్లే. చలనంలో ఉంటే జీవంలో ఉన్నట్లు. విశ్వం మరణావస్థలో ఉన్నది అనడం కన్నా జీవంతో తొణికిసలాడుతున్నది అనడమే సబబు.
పరిసరాలతో పోలిస్తే, కాలంతోపాటు ఒక వస్తువు స్థానంలో మార్పు లేకపోతే, అది స్థిర స్థితిలో ఉందని అంటాం.
పరిసరాలతో పోలిస్తే కాలంలోపాటు ఒక వస్తువు స్థానంలో మార్పు ఉంటే, అది చలనంలో ఉందని అంటాం.
రకరకాల చలనాలు (కదలికలు)
స్థిరస్థితిలో ఎప్పటికీ ఉండడమంటే, మరణావస్థలో ఉన్నట్లే. చలనంలో ఉంటే జీవంలో ఉన్నట్లు. విశ్వం మరణావస్థలో ఉన్నది అనడం కన్నా జీవంతో తొణికిసలాడుతున్నది అనడమే సబబు.
పరిసరాలతో పోలిస్తే, కాలంతోపాటు ఒక వస్తువు స్థానంలో మార్పు లేకపోతే, అది స్థిర స్థితిలో ఉందని అంటాం.
పరిసరాలతో పోలిస్తే కాలంలోపాటు ఒక వస్తువు స్థానంలో మార్పు ఉంటే, అది చలనంలో ఉందని అంటాం.
రకరకాల చలనాలు (కదలికలు)
- స్థానాంతర చలనం
ప్రాణులు, వాహనాలు చలనంలో ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అంటే అవి వివిధ కాలాల్లో, వివిధ స్థానాలను ఆక్రమిస్తూ ఉంటాయి. ఈ స్థానాలన్నిటినీ కలిపే రేఖను ‘మార్గం’ (పథం) అంటారు. ఈ చలనాన్ని ‘స్థానాంతర చలనం’ అంటారు.
ఒక వస్తువు (లేక కణం) మార్గం సరళంగానో (నేరుగా) లేక వక్రంగానో ఉండవచ్చు.
చలనంలో చాలా వరకు మార్గాలు వక్రంగానే ఉంటాయి. దారిలో అడ్డంకులు ఎదురు వస్తే సరళ మార్గంలోనే పయనించలేం కదా!
సరళ మార్గం తక్కువ దూరమేమో కానీ, వక్రమార్గం అనుకూలమైన మార్గం. అందుకేనేమో గ్రహాలు, ఎలక్ట్రాన్లు వక్రమార్గాన్ని అనుసరిస్తాయి.
- వృత్తాకార చలనం
దారం చివరన చిన్న రాయిని కట్టి దాన్ని క్షితిజ సమాంతరంగా వృత్తాకార కక్ష్యలో తిప్పితే, ఆ చలనం వృత్తాకార చలనం.
ఇక్కడ రాయివేగం సమంగా ఉండడంతో ఈ చలనాన్ని సమవృత్తాకార చలనం అంటారు.
అదే, రాయిని నిలువుగా ఉండే వృత్తాకార కక్ష్యలో తిప్పితే, దానివేగం సమంగా ఉండదు. రాయి వేగం వృత్తాకారమార్గం అతి కింది స్థానంలో గరిష్టంగా (ఎక్కువగా) ఉంటే, వృత్తాకార మార్గ ఉచ్ఛస్థానంలో కనిష్టంగా (తక్కువగా) ఉంటుంది.
సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, పరమాణువులో కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్ష్యల్లోనే తిరుగుతాయి. నిజానికి అవి తిరిగే మార్గాలు కొంచెం సాగదీసిన వృత్తాలు -దీర్ఘ వృత్తాకార మార్గాలు.
- భ్రమణ చలనం
ఒక వస్తువు దాని అక్షం దాని కేంద్రంలో ఉండేటట్లు తనచుట్టూ తాను తిరుగుతుంటే (బొంగరంలాగ) ఆ వస్తువు భ్రమణ చలనంలో ఉందని అంటాం.
ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి ఒక సంవత్సర కాలం పడితే, తనచుట్టూ తాను ఒక భ్రమణం చేయడానికి ఒక రోజు పడుతుంది.
ఇప్పుడు మీ వయసు 15 సంవత్సరాలైతే, మీరు ఇప్పటికి సూర్యుని చుట్టూ 15 ప్రదక్షిణాలు చేశారన్న మాట.
ఎలక్ట్రాన్లు పరమాణువు కేంద్రకం చుట్టూ తిరుగుతూనే, వాటి చుట్టూ అవి తిరుగుతుంటాయి.
ఆ విధంగా గ్రహాలకు ఎలక్ట్రాన్లకు స్థానాంతర భ్రమణ చలనాలు రెండూ ఉంటాయి.
అంతెందుకు బస్సు, లారీ, కారు, సైకిలు చక్రాలకు (ఆ వాహనాలు చలనంలో ఉన్నప్పుడు) స్థానాంతర, భ్రమణ చలనాలు రెండూ ఉంటాయి.
లక్ష్మీ ఈమని
Published date : 20 Jul 2013 04:42PM