Skip to main content

10th Exams: ఆరు పేపర్లలోనే పదో తరగతి పరీక్షలు.. సిలబస్‌ కుదింపు..

Preperation Tips for Good/Top Score in Telangana SSC/10th Class Exams
Preperation Tips for Good/Top Score in Telangana SSC/10th Class Exams

పదో తరగతి.. భవిష్యత్తు అవకాశాలకు అత్యంత కీలకమైన దశ! ఉన్నత విద్యలో ఏ కోర్సులో అడుగు పెట్టాలనే స్పష్టతకు సాధనం.. పదో తరగతి మార్కులు!! అంతేకాదు ఈ తరగతిలో చూపిన ప్రతిభ, వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం(2021–22).. ఆరు పేపర్లలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సిలబస్‌ను సైతం కుదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో తాజా మార్పులు.. వార్షిక పరీక్షల్లో టాప్‌ స్కోర్‌ సాధించేందుకు సబ్జెక్టు నిపుణుల సలహాలు, సూచనలు..

  • టీఎస్‌ పదో తరగతిలో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు 
  • 70 శాతం సిలబస్‌తో పరీక్షల నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లలో నిర్వహించనున్నారు. వాస్తవానికి పదో తరగతి పరీక్షల్లో హిందీ మినహా మిగతా సబ్జెక్ట్‌లలో(తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌)..ప్రతి సబ్జెక్ట్‌లోనూ పేపర్‌–1,పేపర్‌–2 ఉంటాయి. అలా మొత్తం పదకొండు పేపర్లలో పరీక్షలు జరిగేవి. కానీ.. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆరు పేపర్లలోనే నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం సిలబస్‌లో 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు జరుగనున్నాయి. 

వంద మార్కులు

పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లు... ప్రతి పేపర్‌కు వంద మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి సబ్జెక్ట్‌లో 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులను విద్యార్థులు తమ ఇంటర్నల్‌ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. పదో తరగతి పరీక్షల సమయాన్ని 3గంటల పదిహేను నిమిషాలుగా నిర్ణయించారు. గతంలో ఇది 2 గంటల 45 నిమిషాలుగా ఉండేది. 

సైన్స్‌.. రెండు ఆన్సర్‌ షీట్లు

గతంలో సైన్స్‌కు సంబంధించి ఫిజికల్‌ సైన్సెస్‌(పీఎస్‌)ను పేపర్‌–1గా 50 మార్కులకు, నేచురల్‌ సైన్స్‌(ఎన్‌ఎస్‌)ను పేపర్‌–2గా మరో 50 మార్కులకు మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఈ రెండు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా 80 మార్కులకు వార్షిక పరీక్షలు జరుగుతాయి. కాని పరీక్ష సమయంలో పీఎస్, ఎన్‌ఎస్‌లకు వేర్వేరు సమాధాన పత్రాలు ఇవ్వనున్నారు.
 

ఆబ్జెక్టివ్స్‌కు అగ్రపీఠం

  • పదో తరగతి పరీక్షల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 80 మార్కులకు నిర్వహించే వార్షిక పరీక్షల్లో.. 20 మార్కులకు ఆబ్జెక్టివ్‌(బహుళైచ్ఛిక) ప్రశ్నలను అడగనున్నారు. పరీక్ష పేపర్‌లో పార్ట్‌–ఎ, పార్ట్‌–బిగా ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌–బిలోనే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
  • అవగాహన, ప్రతిస్పందన: పరీక్షల స్వరూపాన్ని, ప్రశ్నలకు ఇవ్వనున్న వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌లోనూ అవగాహన, ప్రతిస్పందన,సృజనాత్మకత అంశాలపై ప్రత్యేకదృష్టితో సాధన చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. మొత్తం 60 మార్కుల డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలలో..28 మార్కులు వీటికే కేటాయించడం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. 

యాక్టివిటీ బేస్డ్‌కు ప్రాధాన్యం

పాఠ్యాంశాల అభ్యసనంలో భాగంగా విద్యార్థులు యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సబ్జెక్ట్‌లలో పట్టు లభించడమే కాకుండా.. పరీక్షల్లోనూ మెరుగైన మార్కులు పొందొచ్చు. దీనికి సంబంధించి గత ఏడాది పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన నమూనాను పరిశీలించి..ఏఏ అంశాల్లో యాక్టివిటీ/ప్రాజెక్ట్‌ బేస్డ్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా అభ్యసనం కొనసాగించాలి. 


చ‌ద‌వండి: TS 10th Class TM Study Material

ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేకంగా
తెలుగు

ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా పేర్కొనే తెలుగు పేపర్‌లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు.. ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను చదవాలి. పాఠాల సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకుంటూ అభ్యసనం సాగించాలి. అపరిచిత గద్యం విషయంలో సొంతంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ఇందులో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. వ్యాకరణంలో ప్రతిభ చూపాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. 
–జి.వెంకట రమణ, సబ్జెక్ట్‌ నిపుణులు

ఇంగ్లిష్‌

ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో సొంతంగా విశ్లేషించేలా నైపుణ్యం పెంచుకోవాలి. ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సివ్‌ ప్రశ్నలను సాధన చేయాలి. అదే విధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి.. సొంతంగా రాసే అలవాటు చేసుకోవాలి. పొయెట్రీ ప్రశ్నల్లో సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, యాక్టివ్‌ వాయిస్, ప్యాసివ్‌ వాయిస్, ఫ్రేజల్‌ వెర్బ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. చదవడంతోపాటు ప్రాక్టీస్‌ కూడా చేస్తే వార్షిక పరీక్షలో మెరుగైన మార్కులు పొందొచ్చు. అదే విధంగా అపరిచిత గద్యం(అన్‌నోన్‌ ప్యాసేజెస్‌) సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. లెటర్‌ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్‌ ది లెటర్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
–భాగ్యశేఖర్, ఎస్‌ఏ–ఇంగ్లిష్‌

మ్యాథమెటిక్స్‌

సంఖ్యా వ్యవస్థ; బీజగణితం; నిరూపక రేఖాగణితం; రేఖాగణితం; క్షేత్రమితి; త్రికోణమితి; సంభావ్యత; సాంఖ్యకశాస్త్రం అధ్యాయాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ప్రాక్టీస్‌ చేసే సమయంలోనే సమస్య సాధనతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేసుకుంటే.. సదరు అంశంలో లోతైన అవగాహన వస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్‌ రూపంలో రాసుకుంటే..వార్షిక పరీక్షల సమయంలో పునశ్చరణకు ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్‌ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్‌ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి. 
–వై.వనంరాజు, సబ్జెక్ట్‌ నిపుణులు

ఫిజికల్‌ సైన్స్‌

ఫిజికల్‌ సైన్స్‌ను అన్వయ దృక్పథంతో చదవడం మేలు చేస్తుంది. ఆయా అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రశ్నించడం–పరికల్పన; ప్రయోగాలు–క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు–ప్రాజెక్ట్‌ పనులు; పటాలు–వాటిద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం,కాంతి వక్రీభవనం, విద్యుత్‌ ప్రవా హం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్‌ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు–వర్గీకరణ, రసాయన సమీకరణాలను ప్రాక్టీస్‌ చేయాలి. దీనివల్ల పరీక్షల్లో అడిగే లఘు, అతిస్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది.
–ఎ.నాగరాజశేఖర్, ఎస్‌ఏ–ఫిజిక్స్‌

నేచురల్‌ సైన్సెస్‌

జీవశాస్త్రం సబ్జెక్ట్‌లోనూ అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్‌ డయాగ్రమ్స్‌లను రూపొందించుకుంటూ.. అభ్యసనం సాగించాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా అంశాలకు సంబంధించి ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్‌ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. 
–పి.నీలకంఠం, సబ్జెక్ట్‌ నిపుణులు

సోషల్‌ స్టడీస్‌

సోషల్‌ స్టడీస్‌లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. పాఠ్యపుస్తకంలోని అంశాన్ని, నిజ జీవిత సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం లాభిస్తుంది. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సా«ధన చేయాలి. అవగాహనకు సం బంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్‌కు సంబంధించి భారతదేశం–భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి–ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో.. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగల నుంచి సంగ్రహించారు వంటి కోణాల్లో చదవాలి.
–బి.శ్రీనివాస్, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Syllabus

టీఎస్‌ పదో తరగతి.. ఎగ్జామ్‌ టిప్స్‌

  • ఆయా సబ్జెక్ట్‌ల్లో ముఖ్యమైన చాప్టర్లను వెయిటేజీ ఆధారంగా వర్గీకరించుకోవాలి.
  • ముందుగా అత్యధిక వెయిటేజీ ఉండే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
  • అభ్యసనం చేసేటప్పుడే ప్రాక్టీస్‌ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.
  • అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి.
  • మ్యాథమెటిక్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్‌ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను అధ్యయనం చేయాలి. 
  • ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.

చ‌ద‌వండి: Model papers

పదో తరగతి పరీక్షలు.. మార్పులు–ముఖ్యాంశాలు

  • ఆరు పేపర్లలోనే తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు.
  • ప్రతి పేపర్‌కు మొత్తం వంద మార్కులకు పరీక్ష
  • 30 శాతం సిలబస్‌ కుదింపు, 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు.
  • వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్‌కు 80 మార్కులు, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు.
  • వార్షిక పరీక్షల్లోని 80 మార్కుల్లో 20 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
Published date : 02 Nov 2021 06:10PM

Photo Stories