‘ఏకలవ్య’ గురుకులాలకు మహర్దశ!
మెజార్టీ పాఠశాలలకు అత్యాధునిక స్థాయిలో మౌలిక వసతులు క ల్పిం చినప్పటికీ కీలకమైన బోధన, బోధనేతర సిబ్బంది అంతా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. తాజాగా ఈ పాఠశాలల్లో బోధనా కొలువులను పూర్తిస్థాయిలో భర్తీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా ప్రవేశపెట్టిన 2023–24 వార్షిక బడ్జెట్‌లో కొలువుల భర్తీ అంశాన్ని ప్రస్తావిస్తూ స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో అన్ని రకాల సామర్థ్యాలున్న బోధకులు అతి త్వరలో అందుబాటులోకి రానున్నారు. 2023–24 వార్షిక సంవత్సరంలోనే నిర్దేశించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడడం, ఆ తర్వాత భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు.. ఏకలవ్య
రాష్ట్రంలో 23 ఈఎంఆర్‌ఎస్‌లు....
తెలంగాణ వ్యాప్తంగా 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇవన్నీ ఉట్నూరు ఐటీడీఏ, ఏటూరు నాగారం ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏల పరిధిలో ఉన్నాయి. ఒక్కో పాఠశాల పరిధిలో 29 మంది బోధన, 20 బోధనేతర, 10 క్లాస్ ఫోర్ ఉద్యోగులుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో మెజార్టీ సంఖ్యలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు లేరు. దీంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రతి సంవత్సరం నియమించుకోవడంతో బోధన, బోధనేతర కార్యక్రమాల నిర్వహణ ఇబ్బందికరంగా ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఈఎంఆర్‌ఎస్‌లకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదువందలకు పైబడి బోధనా సిబ్బందిని భర్తీ చేసే అవకాశం ఉంది.
చదవండి: EMRS: గుణాత్మక విద్య అందించేందుకే.. ఏకలవ్య మోడల్ స్కూళ్లు
నిబంధనలు సడలిస్తే....
ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త ఈఎంఆర్‌ఎస్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ పాఠశాలలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తారు. కొత్త పాఠశాలల కోసం కేంద్రం ఇదివరకే రాష్ట్రాలకు సూచనలు చేసింది. నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే కేంద్రం నిర్దేశించిన నిబంధనలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక మండలంలో ఎస్టీ జనాభా 50 శాతం ఉండాలనేది ప్రధాన నిబంధన. మండలంలో ఎస్సీ జనాభా 20 వేలకు పైబడి ఉండాలనేది మరో నిబంధన. ఈ రెండు నిబంధనలు ఇబ్బందికరమని, వీటిలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రెండింటిలో ఒక అంశాన్ని పరిగణించినా రాష్ట్రానికి కొత్తగా ఏడు పాఠశాలలు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.