EMRS: గుణాత్మక విద్య అందించేందుకే.. ఏకలవ్య మోడల్ స్కూళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీలోని అరకులోయ, పెదబయలు, జి.మాడుగుల ప్రాంతాల్లో రూ.59.76 కోట్లతో నిర్మించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని దేశవ్యాప్త సందేశాన్నిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచే విద్యాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నవోదయ విద్యాలయాల తరహాలో పనిచేస్తాయన్నారు. గిరిజన బాల, బాలికలకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించే లక్ష్యంగా ఈ పాఠశాలలను మంజూరు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశాలకు అనుగుణంగా 14 నెలల గడువులోగా నూతన భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. మూడు ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణాలకు సంబంధించి ప్రధాని వర్చువల్ విధానంలో చేపట్టిన శిలాఫలకాలను ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, జనరల్ మేనేజర్ అరుంధతి భౌమికలు ఇక్కడ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వెంకట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
ఈ పిల్లలుకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు.. టెక్నాలజీ..