Skip to main content

ఈ పిల్లలుకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు.. టెక్నాలజీ..

నీటి కొలనులో నుంచి పైకి ఉద్భవిస్తున్నట్లున్న నిండు చంద్రుడి పెయింటింగ్‌ పౌర్ణమిని డ్రాయింగ్‌ రూమ్‌లోకి తెచ్చినట్లుంది. ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్న రాధాకృష్ణుల చిత్రం... ఎన్నెన్నో ప్రశ్నలతో మనసును ఊపిరాడనివ్వదు. జుట్టు ముడిచుట్టిన ఆదివాసీ మహిళ చిత్రం... ఆధునికత ఫ్యాషన్‌ రీతులను ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. వీటితోపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఆ ఇంటి గోడల మీద వచ్చి వాలాయి. అడవిలో ఎగురుతున్న జింక ఈ ఇంట్లోకి తొంగి చూడడానికి వచ్చినట్లుంది ఓ చిత్రం. వీటి పక్కనే ఒక హృదయాకారంలో ‘ఐ లవ్‌ యూ అమ్మా’ అనే అక్షరాలు ఆ పెయింటింగ్‌ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి.

హైదరాబాద్, ఈసీఐఎల్‌ సమీపంలోని సాయినాథపురంలోని ప్రశంస, అభిజ్ఞల ఇల్లు ఇది. ఈ బొమ్మలు వేసిన పిల్లలు అచ్చంగా పిల్లల్లాగా, స్వచ్ఛతకు ప్రతీకల్లా ఉన్నారు. ప్రశంస తొమ్మిదవ తరగతి, అభిజ్ఞ ఏడవ తరగతి. వీళ్లకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు టెక్నాలజీ. నిజమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రపంచాన్ని స్తంభింపచేస్తే ఈ పిల్లలిద్దరూ ఆ విరామాన్ని పెయింటింగ్‌ శిక్షణకు ఉపయోగించుకున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి భయపడే కోవిడ్‌ కాలంలో వాళ్లకు బొమ్మలు వేయడం నేర్పించడానికి ఏ గురువు కూడా ఇంటికి వచ్చే సాహసం చేయలేరు. ఏ గురువు కూడా తమ ఇంటికి శిష్యులను స్వాగతించే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు యూ ట్యూబ్‌ చూస్తూ పెయింటింగ్‌ వేయడం నేర్చుకున్నారు. రోజుకొక పెయింటింగ్‌ వీడియో చూస్తూ సొంతంగా ప్రాక్టీస్‌ చేస్తూ పూర్తి స్థాయి చిత్రకారులైపోయారు. ఏ చిత్రానికి ఏ తరహా రంగులు వాడాలో, ఎంత మోతాదులో మిశ్రమాలను కలుపుకోవాలో కూడా నేర్చుకున్నారు. లాక్‌డౌన్‌ కాలం పిల్లల బాల్యాన్ని హరించిందని, స్తబ్దుగా మార్చేసిందని ఆందోళన పడుతుంటాం. కానీ కాలం అందరికీ సమానమే. ఎవరికైనా రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయోగపెట్టుకునే వాళ్లు, నిరర్ధకంగా గడిపేసే వాళ్లూ ఉన్నట్లే... ఈ అక్కాచెల్లెళ్లు లాక్‌డౌన్‌ కాలంలో చిత్రకారిణులుగా నైపుణ్యం సాధించారు. తోటి పిల్లలకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్‌ డే.

Paintinings

ఫోన్‌ చేతికి వచ్చింది!

‘‘నేను పదవ సంవత్సరం నుంచి బొమ్మలేస్తున్నాను. స్కూల్‌లో డ్రాయింగ్‌ కాంపిటీషన్‌లలో పాల్గొన్నాను కూడా. లాక్‌డౌన్‌లో రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లం. బోర్‌ కొట్టేది. ఆన్‌లైన్‌ క్లాసుల కోసమని అమ్మానాన్న వాళ్ల స్మార్ట్‌ ఫోన్‌లు నాకు చెల్లికి ఇచ్చేశారు. క్లాస్‌లు అయిపోయిన తర్వాత నేను యూ ట్యూబ్‌ సెర్చ్‌ చేస్తూంటే పెయింటింగ్‌ క్లాసుల వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి రోజూ వీడియోలు చూస్తూ నోట్స్‌ రాసుకునేదాన్ని. అక్రిలిక్‌ కలర్స్, వాటర్‌ కలర్స్, ఆయిల్‌ పెయింటింగ్స్‌లో ఏ పెయింటింగ్‌కి ఏది వాడాలో వచ్చేసింది. ఈ ఏడాది కాలంగా నేను వందకు పైగా బొమ్మలు వేశాను. మధుబని, రంగోలి ఆర్ట్‌లు, రవీంద్రనాథ్‌ టాగూర్, స్వామి వివేకానంద పోట్రయిట్‌లు వేశాను. పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా లక్ష్యం. టెన్త్‌ క్లాస్‌ తర్వాత పెయింటింగ్‌ కోసం ఎక్కువ టైమ్‌ ప్రాక్టీస్‌ చేస్తాను’’.
– ప్రశంస, బాల చిత్రకారిణి

చదవండి: 

Covid 19: పిల్లల చదువులపై కోవిడ్‌ ప్రభావం ఎంత?

చిన్నారులకు సీఎం శుభాకాంక్షలు

Published date : 15 Nov 2021 03:21PM

Photo Stories