Tenth Public Exams 2025 : ఏపీ, తెలంగాణలో 2025 మార్చిలో పరీక్షలకు అవకాశం.. సిలబస్‌పై పట్టు, ప్రాక్టీస్‌తో బెస్ట్ స్కోరు!
ఇంతటి కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు, సబ్జెక్టుల వారీగా.. ఉత్తమ స్కోర్ సాధించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు..
పదో తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు అందుకోవడానికి వీలుగా టెన్త్ బోర్డు పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించేలా కృషి చేయాలి. పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని విద్యార్థులు తరగతి బోధనతోపాటు పరీక్షల ప్రిపరేషన్‌కు సమాంతరంగా వినియోగించుకుంటే ఉత్తమ స్కోర్ సాధించొచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
మార్చిలో బోర్డు పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో గతేడాది(2024) మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సారి కూడా దాదాపు అదే సమయంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్చి(2025) రెండు/మూడో వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సబ్జెక్టుల వారీగా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాలని నిపుణులు, సబ్జెక్ట్ టీచర్స్ సూచిస్తున్నారు.
తెలుగు
తెలుగు మాతృ భాష అనే ఆలోచనతో విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌ను కొంత తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇందులో మంచి మార్కులు, తద్వారా మంచి గ్రేడ్ పాయింట్లు పొందాలంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే. అందుకోసం పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరి పెట్టకుండా..సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. తెలుగు సబ్జెక్ట్‌లో వ్యాకరణం కూడా ముఖ్యమే. ఈ వ్యాకరణంలో మెరుగ్గా రాణించాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. ఇప్పటి నుంచి ప్రతి రోజు క్లాస్ రూంలో బోధించే అంశాలను, అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్థులు జనవరి మొదటి వారం నుంచి పునశ్చరణకు సమయం కేటాయించే విధంగా తమ అభ్యసన సమయాన్ని రూపొందించుకోవాలి.
☛ Follow our Instagram Page (Click Here)
ఇంగ్లిష్
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఆందోళన చెందే సబ్జెక్ట్ ఇంగ్లిష్. కానీ.. ఇందులోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా ఇంగ్లిష్ పదజాలం, వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. వెర్బల్, నాన్–వెర్బల్ అంశాలు బాగా చదవాలి. ఉదాహరణకు టేబుల్స్, బార్ డయాగ్రమ్స్, పై చార్ట్స్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. అదే విధంగా వాటిని తాము సొంతంగా విశ్లేషించేలా నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాల సమాధానాలను పరిశీలించడం మేలు చేస్తుంది. విద్యార్థులు ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి.
Faculty Jobs: ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే..
పోయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. చదవడంతోపాటు ప్రాక్టీస్ చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా..రీడింగ్ కాంప్రహెన్షన్ పెరిగే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. అన్ నోన్ ప్యాసేజ్ కింద ఇచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఆ ప్యాసేజ్ సారాంశాన్ని గుర్తించే విధంగా చదవాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
మ్యాథమెటిక్స్
భవిష్యత్తులో ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలకు ఎంతో కీలకంగా నిలుస్తున్న సబ్జెక్ట్‌గా మ్యాథమెటిక్స్‌ను పేర్కొనొచ్చు. ఈ సబ్జెక్టుకు సంబంధించి ప్రతి చాప్టర్‌ను పూర్తిగా అధ్యయనం చేయడంతోపాటు వాటికి సంబంధించిన ప్రశ్నల(ప్రాబ్లమ్స్)ను ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం,పేపర్–2లో రేఖా గణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సా«ధించాలి. విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలోనే సమస్య సాధనతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్ బుక్‌లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేస్తే సులభంగా 60 శాతం మార్కులు సొంతం చేసుకోవచ్చు.
☛ Join our WhatsApp Channel (Click Here)
ఫిజికల్ సైన్స్ (పీఎస్)
రెండు భాగాలుగా ఉండే సైన్స్‌లో.. ఫిజికల్ సైన్స్ ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఫిజిక్స్ నుంచి ఏడు, కెమిస్ట్రీ నుంచి ఏడు మొత్తం 14 చాప్టర్లు చదవాల్సి ఉంటుంది. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం–పరికల్పన చేయడం; ప్రయోగాలు–క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు–ప్రాజెక్ట్ పనులు; పటాలు–వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం,రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధతో చదవాలి. అదే విధంగా..మూలకాల ధర్మాలు–వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే సన్నద్ధత లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సామర్థ్యం పెరిగి మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
Telangana Group 3 Exam Schedule: బ్రేకింగ్ న్యూస్... గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
నేచురల్ సైన్సెస్ (ఎన్‌ఎస్)
సైన్స్‌లో రెండో పేపర్‌గా ఉన్న జీవశాస్త్రం సబ్జెక్ట్‌లోనూ అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రయోగాలకు సంబంధించి ప్రయోగం ఫలితంతోపాటు.. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
☛ Join our Telegram Channel (Click Here)
సోషల్ స్టడీస్
ఇటీవల కాలంలో ముఖ్యంగా సీసీఈ, సమ్మేటివ్, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ నేపథ్యంలో.. సోషల్ స్టడీస్‌లో అడిగే ప్రశ్నల తీరులో మార్పు వచ్చింది. సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. పాఠ్యపుస్తకంలో ఒక అంశం గురించి ఉంటే.. దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం ఎంతో లాభిస్తుంది. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సా«ధన చేయాలి. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం–భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి–ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భా రత జాతీయోద్యమ చరిత్రపై ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగాల నుంచి సంగ్రహించారో తెలుసుకోవాలి. డయాగ్రమ్/రేఖాచిత్ర, పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి.
Telangana High Court : తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సమయ పాలన
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. బెస్ట్ స్కోర్ కోసం ఇప్పటి నుంచే నిర్దిష్ట సమయ పాలనతో అడుగులు వేయాలి. దీనికి అనుగుణంగా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి. జనవరి నుంచి అధిక సమయం పునశ్చరణకు కేటాయించాలి. జనవరి చివరి నాటికి ప్రిపరేషన్, రివిజన్ రెండింటినీ పూర్తి చేసుకోవాలి. ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు ప్రీ–ఫైనల్స్‌కు హాజరవ్వాలి.
ఈ నైపుణ్యాలు తప్పనిసరి
పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశాన్ని సొంతగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి అంశంపై కచ్చితమైన అభిప్రాయం ఏర్పరచుకునేలా వ్యవహరించాలి. ఫలితంగా ప్రశంస/ విమర్శలకు సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు సులువుగా రాయొచ్చు.
BEL Recruitments : బెల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్–1 పోస్టులు
పదో తరగతి పరీక్షలు.. ముఖ్య సూచనలు
● సబ్జెక్ట్‌ల వారీగా అత్యధిక వెయిటేజీ ఉండే అంశాలపై దృష్టి పెట్టాలి.
● ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
● అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు సాధించేలా కృషి చేయాలి.
● అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి.
● మ్యాథమెటిక్స్,సైన్స్‌లకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను బాగా అధ్యయనం చేయాలి.
● ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
Tags
- tenth public exams
- preparation tips and strategy
- Tenth Students
- subject wise preparations
- march 2025
- Subject Teachers
- ap and ts tenth board exams
- tenth board exams 2025
- higher opportunities
- Students Future
- subjects preparation planning
- Education News
- Sakshi Education News
- 10thClassExams
- exampreparation
- RevisionTips
- HealthyStudyHabits
- AndhraPradeshEducation
- TelanganaEducation
- TimeManagement