Skip to main content

ప్రాచీనం నుంచి ఆధునికం వరకు..విద్యా విధానాలు!

విద్యా దృక్పథాలు.. మొత్తం 20 ప్రశ్నలు, 10 మార్కులతో డీఎస్సీ ఎస్‌జీటీలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించే విభాగమిది! ఈ సబ్జెక్టును తొలిసారిగా డీఎస్సీ-2012లో ప్రవేశపెట్టారు. గత డీఎస్సీలో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే అన్ని పాఠ్యాంశాలకూ సమాన ప్రాతినిధ్యం కల్పించినట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పాఠ్యాంశాలు, ముఖ్యమైన అంశాలు, మాదిరి ప్రశ్నలపై ఫోకస్...

విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించే కోణంలో.. విద్యా దృక్పథాలు సబ్జెక్టును డీఎస్సీ ఔత్సాహికులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా, తేలిగ్గా సమాధానాలు రాయవచ్చు. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)-2009 ప్రకారం విద్యా దృక్పథాలు సిలబస్‌లో వివిధ అంశాలను పొందుపరిచారు.

Bavitha పాఠ్యాంశాలు:
  1. భారతదేశంలో విద్యా చరిత్ర, లక్ష్యాలు, కమిటీలు.
  2. ఉపాధ్యాయ సాధికారత లేదా ఉపాధ్యాయ వికాస అభివృద్ధి.
  3. భారతదేశంలో వర్తమాన విద్యా సంబంధిత అంశాలు.
  4. చట్టాలు-హక్కులు (2009-10), బాలల మానవ హక్కులు.
  5. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005.
భారతదేశంలో విద్యా చరిత్ర, లక్ష్యాలు, కమిటీలు
భారతీయ సమాజంలో మొదట్లో గురువు గృహమే పాఠశాల. తర్వాత ఆశ్రమాలు, ఆ తర్వాత పాఠశాలలు ఆవిర్భవించి విద్యా విధానం ఆసక్తికరంగా మారింది. ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉండే అంశాలు.. ప్రాచీన కాలంలో విద్యా విధానం, మధ్యయుగంలో విద్యా విధానం, ఆధునిక కాలంలో విద్యా విధానం. వీటితో పాటు భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం-1904 ప్రధానమైంది.
  • స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్; మొదలియార్ కమిషన్; కొఠారి కమిషన్; ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ; 1986 జాతీయ విద్యా విధానం; ఆచార్య రామమూర్తి కమిటీ; ఎన్.జనార్దన్‌రెడ్డి కమిటీ; యశ్‌పాల్ కమిటీ వంటి వివిధ కమిటీల విద్యా విధాన అంశాలను పరిశీలించి, అవగాహన పెంపొందించుకోవాలి.
  • విద్య-అర్థం, ధ్యేయం; విద్యకు రాజ్యాంగం కల్పించే సదుపాయాలు; యూనివర్సల్ ఎలిమెంటరీ విద్య వంటి అంశాలపైనా దృష్టిసారించాలి.
ఉదాహరణలు:
  • ‘గురుకుల విద్య’ను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు? (2)
    1) 12 ఏళ్లు
    2) ఐదేళ్లు
    3) ఎనిమిదేళ్లు
    4) 14 ఏళ్లు
  • ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది? (1)
    1) జ్ఞానమీమాంస
    2) మూర్తిమత్వ సాధన
    3) స్వావలంబన
    4) పైవన్నీ
  • భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహడు ఎవరు? (2)
    1) మైఖేల్ గ్రాంట్
    2) చార్లెస్ గ్రాంట్
    3) ఆబ్బెర్ట్ ఫోర్స్
    4) విల్‌బల్ ఫోర్స్
  • ఉడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించిన సంవత్సరం? (3)
    1) 1867
    2) 1884
    3) 1854
    4) 1889
ఉపాధ్యాయ సాధికారత
గురువు అంటే అంధకారం నుంచి వెలుగులోకి దారిచూపే దీపం అని అర్థం. ఉపాధ్యాయుడికి విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, సమాజంతో ఉన్న పరస్పర సంబంధాల వల్ల సాధికారత లభిస్తుంది. ఉపాధ్యాయుల సాధికారత.. ఉపాధ్యాయుని, పాఠశాల స్థాయిపై ఆధారపడి ఉంటుంది.
  • ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉపాధ్యాయుల రూప చిత్రం, వారి లక్షణాంశాలు, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపరమైన శిక్షణ, విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల ఉపలబ్ధి-మూల్యాంకనం తదితర అంశాలను చదవాలి. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళి (1977) చాలా ముఖ్యమైన అంశం.
  • ఉపాధ్యాయ విద్యకు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ); రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ); విద్యా సాంకేతిక సంస్థ (ఎస్‌ఐఈటీ); జిల్లా విద్య, శిక్షణ సంస్థ (డైట్), కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ (సీఐఈటీ) తదితర సంస్థల సిఫార్సులను అధ్యయనం చేయాలి.
  • ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైంది? (2)
    1) పాఠశాల
    2) పాఠ్యపుస్తకాలు
    3) ఉపాధ్యాయుని రూపచిత్రం
    4) ఉపాధ్యాయుని ప్రవర్తన
  • దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ? (2)
    1) సీసీఆర్‌టీ
    2) ఎన్‌సీటీఈ
    3) ఎన్‌సీఈఆర్‌టీ
    4) ఎస్‌సీఈఆర్‌టీ
  • ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ ఉంది? (3)
    1) హైదరాబాద్
    2) చెన్నై
    3) మైసూర్
    4) ముంబై
వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు
పాఠ్యాంశాలన్నింటిలోనూ ‘వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు’ పాఠ్యాంశం చాలా ముఖ్యమైంది. దీన్నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయి.
ముఖ్య అంశాలు: పర్యావరణ విద్య, ప్రజాస్వామ్యం, ఆర్థికశాస్త్రంలో విద్యా విధానం,సాక్షరతా భారత్, జనాభా నియం త్రణ కార్యక్రమంపై విద్య ప్రభావం, కుటుంబ జీవన విద్య, విపత్తు నిర్వహణ, సమ్మిళిత విద్య, ప్రపంచీకరణ-విద్య ప్రభావం, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ విధానం తదితర అంశాలను అవగాహన చేసుకొని, అభ్యసించాలి. వీటికి సంబంధించిన వర్తమాన అంశాలను తప్పనిసరిగా చదివితే ఈ విభాగంలో ఎక్కువ మార్కుల సాధనకు వీలవుతుంది.
  • సంచార విజ్ఞాన కేంద్రాల్లో ఇవి ఉంటాయి? (4)
    1) సినిమా ప్రొజెక్టర్
    2) టేప్ రికార్డర్
    3) రేడియో, కంప్యూటర్
    4) పైవన్నీ
  • ఆటిజం అనేది ఒక... (1)
    1) శారీరక వైకల్యం
    2) మానసిక వైకల్యం
    3) భౌతిక వైకల్యం
    4) భాష వైకల్యం.
  • తివారీ కమిటీ దేనికి సంబంధించింది? (3)
    1) కౌమార విద్య
    2) నైతిక విద్య
    3) పర్యావరణం
    4) వ్యర్థ భూముల విద్య
  • పర్యావరణం అనేది ఏ పదం నుంచి వచ్చింది? (2)
    1) ఎన్వార్
    2) ఎన్విరాన్
    3) ఎన్వైర్
    4) ఏదీకాదు
  • ‘కుటుంబం’ అనేది సామాజీకరణకు అత్యంత ముఖ్యమైన కారకం అని అన్నది? (1)
    1) లిండే
    2) విలియమ్స్
    3) మార్షల్
    4) అరిస్టాటిల్
చట్టాలు- హక్కులు, బాలల మానవ హక్కులు
ఇందులో ప్రధానంగా విద్యా హక్కు చట్టం-2009; బాలల హక్కుల విద్య; మానవ హక్కులు; సమాచార హక్కు చట్టం-2005 అంశాలున్నాయి.
ముఖ్య అంశాలు: 6-14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడంలో సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతలు; పాఠ్య ప్రణాళిక; ప్రాథమిక విద్యను పూర్తిచేయడం; బాలల హక్కుల సంరక్షణ తదితర అంశాలు ముఖ్యమైనవి.
  • బాలల హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో కల్పిం చే సదుపాయాలతో పాటు ప్రభుత్వ గనుల చట్టం (1952),ఫ్యాక్టరీ చట్టం(1982), ప్లాంటేషన్ కార్మిక చట్టం(1951)తదితర చట్టాల్లోని అంశాలను చదవాలి.
  • మానవ హక్కులకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు; సమాచార హక్కు చట్టం (2005); అధికార యంత్రాంగాల విధులు; కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్‌లు-అధికారాలు, విధులు, అప్పీళ్లు, జరిమానాలు వంటి అంశాలు ప్రధానమైనవి.
  • ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం-2009 వర్తించని రాష్ట్రం? (2)
    1) కేరళ
    2) జమ్మూకాశ్మీర్
    3) తమిళనాడు
    4) అరుణాచల్‌ప్రదేశ్
జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం (2005)
పాఠ్యప్రణాళికా చట్రాన్ని పునఃసమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005ను రూపొందించారు.
ముఖ్యమైన అంశాలు: పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానరాశిని అన్వయించడం; కంఠస్థ పద్ధతులకు స్వస్తిపలకడం, శిశు కేంద్రంగా రూపొందించడం, సరళమైన మూల్యాంకన విధానాలను రూపొందించడం తదితర అంశాలు ప్రధానమైనవి.
  • జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-2005లో దృక్పథం, అభ్యసనం-జ్ఞానం, పాఠ్యాంశాలు-పాఠశాల స్థాయిలు-మూల్యాంకనం, పాఠశాల, తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి.
  • జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం రూపకల్పనకు కృషి చేసినది? (4)
    1) ఎన్‌సీఎఫ్
    2) ఆర్‌టీఈ
    3) ఎన్‌సీఈఆర్‌టీ
    4) 1, 3
  • జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం ముఖ్యంగా ఎవరికి సూచనలిస్తుంది? (3)
    1) ప్రభుత్వానికి
    2) శాస్త్రవేత్తలకు
    3) ఉపాధ్యాయులకు
    4) తల్లిదండ్రులకు
  • ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన కమిషన్? (3)
    1) యశ్‌పాల్ కమిటీ
    2) రాధాకృష్ణన్ కమిటీ
    3) చటోపాధ్యాయ కమిషన్
    4) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
  • ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురించిన వారు? (2)
    1) ఎస్‌సీఈఆర్‌టీ
    2) యునెస్కో
    3) ఎన్‌సీఈఆర్‌టీ
    4) యునిసెఫ్
Published date : 22 Aug 2014 01:44PM

Photo Stories