Skip to main content

Universities: ఏడాది వ్యవధిలోనే పీజీ పూర్తి చేసుకోవ‌చ్చు.. స్కాలర్‌షిప్స్ అందుకోవ‌చ్చు..

Study Abroad: Master Degree In United Kingdom(UK) with Scholarship
Study Abroad: Master Degree In United Kingdom(UK) with Scholarship
  • ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నిలయం బ్రిటన్‌
  • ఏడాది కాల వ్యవధితోనే పీజీ పూర్తి చేసుకోవచ్చు

విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకోవడం దేశంలోని ఎంతోమంది విద్యార్థుల స్వప్నం. కరోనా సద్దుమణిగాక ఇప్పుడు మరింత ఎక్కువ మంది వివిధ దేశాల్లో తమకు నచ్చిన కోర్సుల్లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2020లో 2లక్షల 60వేల మందికి పైగా స్టడీ అబ్రాడ్‌కు వెళ్లారు. 2021లో ఇప్పటికే దాదాపు 72వేల మంది విదేశీ యూనివర్సిటీల్లో చేరినట్లు విదేశాంగశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 

యూకేలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉంటారు. మన విద్యార్థులు యూకేలో ఉన్నత విద్యపై ఆసక్తి చూపడానికి అక్కడి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, విద్యాప్రమాణాలు ముఖ్యకారణాలుగా చెప్పొచ్చు. దీంతోపాటు అక్కడ మాస్టర్స్‌ డిగ్రీ(పీజీ)ని ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసుకునే అవకాశం ఉండటం భారతీయ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అంతేకాకుండా యూకేలోని ఏడాది మాస్టర్స్‌ కోర్సులను భారత్‌లోని రెండేళ్ల పీజీ కోర్సులకు తత్సమాన అర్హతగా గుర్తిస్తున్నారు. అదేవిధంగా బ్రిటన్‌ యూనివర్సిటీల్లో చేరిన భారతీయ విద్యార్థులు.. కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్స్, గ్రేట్‌ స్కాలర్‌షిప్స్‌ వంటి ఎన్నో ఉపకార వేతనాలు అందుకునే అవకాశం ఉంది.

ఈ కోర్సుల వైపు మొగ్గు
యూకేలో డిగ్రీల కోర్సుల కాల వ్యవధి మూడేళ్లు, పీజీ కోర్సుల వ్యవధి ఏడాదిగా ఉంది. అక్కడి వర్సిటీల్లో ప్రవేశ ప్రక్రియ ప్రతి ఏటా సెప్టెంబర్‌/అక్టోబర్‌ల్లో ప్రారంభమై..మార్చిలో ముగుస్తుంది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం జూన్‌ వర కూ కూడా దరఖాస్తులను పొడిగిస్తారు. యూకేలో మన విద్యార్థులు ఎక్కువగా బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, కంప్యూటర్‌ కోర్సుల్లో చేరుతున్నారు. 

పేరున్న యూనివర్సిటీలు
యూకేలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రపంచ పురాతన, ప్రతిష్టాత్మక  యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్, ద యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్, ద యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్, కింగ్స్‌ కాలేజ్‌ లండన్, ద లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌(ఎల్‌ఎస్‌ఈ), ద యూనివర్సిటీ ఆఫ్‌ వర్విక్, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ వంటి విశ్వవిద్యాలయాలకు మంచి పేరుంది. ఆయా వర్సిటీల్లో అద్భుతమైన క్యాంపస్, ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. 

వీసా విధానాలు

  • ప్రస్తుతం తాజాగా అమల్లోకి తెచ్చిన గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాతో పాటు ఇప్పటికే పలు రకాల వీసాలు యూకేలో అందుబాటులో ఉన్నాయి. వీటిని టైర్‌–1 నుంచి టైర్‌–6గా వర్గీకరించారు. 
  • విదేశీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఇచ్చే టైర్‌–4 వీసాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 
  • యూకేలో ఉద్యోగం విషయంలో టైర్‌–2 వీసాలను మంజూరు చేస్తున్నారు. దీనికోసం ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మద్దతుగా సదరు కంపెనీ స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. అక్కడే చదువు పూర్తిచేసుకొని.. పోస్ట్‌ స్టడీ వర్క్‌ గడువులో ఉద్యోగాన్వేషణ సాగిస్తూ.. కొలువు సొంతం చేసుకున్న వారు తమ టైర్‌–2 వీసాను టైర్‌–4 వీసాగా మార్చుకునే అవకాశం కూడా ఉంది.

టైర్‌–5.. టెంపరరీ వర్క్‌ వీసా
యూకే అందిస్తున్న మరో ముఖ్యమైన వీసా.. టైర్‌–5 టెంపరరీ వర్క్‌ వీసా. అంటే.. వేరే దేశంలో ప్రధాన కార్యాలయం ఉండి.. యూకేలో క్లయింట్లను కలిగి ఉన్న సంస్థలు, యూకేలోని ఆ క్లయింట్ల కార్యాలయంలో కొద్దికాలం పాటు పని చేసే అవకాశం కల్పిస్తూ.. టైర్‌–5 వీసా మంజూరు చేస్తారు.

టైర్‌–4 పాయింట్లు

  • విదేశీ విద్యార్థులకు ఇచ్చే టైర్‌–4 వీసాను మంజూరు చేసే క్రమంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని.. 40 పాయింట్లను కేటాయిస్తారు. విద్యార్థులు పొందిన పాయింట్ల ఆధారంగా వీసా మంజూరు చేస్తారు. సీఏఎస్‌(కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సప్టెన్స్‌ ఫర్‌ స్టడీస్‌)–30 పాయింట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలకు–10 పాయింట్లు ఉంటాయి. 

టైర్‌–2 వర్క్‌ వీసా అంశాలు
టైర్‌–2 జనరల్‌ వర్క్‌ వీసాకు మొత్తం నాలుగు అంశాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఆ పాయింట్లు పొందిన వారికే వీసాల మంజూరులో ప్రాధాన్యం ఉంటుంది. అవి.. సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌షిప్‌–30 పాయింట్లు, వేతన శ్రేణి–20 పాయింట్లు, నిర్వహణ–10 పాయింట్లు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌–10 పాయింట్లు.
 

Published date : 17 Nov 2021 06:54PM

Photo Stories