Skip to main content

Study Abroad: ఫ్రాన్స్‌లో పోస్ట్‌ స్టడీ వర్క్‌ అయిదేళ్లకు పెంపు... కొత్తగా షెన్‌జెన్‌ వీసాలు

ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది! ఆ దేశంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరిన భారత విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక అయిదేళ్లపాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని పేర్కొంది. అంటే.. పోస్ట్‌ స్టడీ వర్క్‌ గడువును అయిదేళ్లకు పెంచింది. దీంతోపాటు తాజాగా భారత విద్యార్థులకు ఐదేళ్ల కాలపరిమితితో షెన్‌జెన్‌ వీసాలను జారీ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య, పోస్ట్‌ స్టడీ వర్క్‌ తాజా నిబంధనలు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..
Five years post study work opportunity in France
  • ఫ్రాన్స్‌లో అయిదేళ్లు పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశం
  • చదువు పూర్తి చేసుకుంటూనే కొలువుకు దరఖాస్తు 
  • అయిదేళ్ల తర్వాత పర్మనెంట్‌ రెసిడెన్సీకి మార్గం
  • ఐదేళ్ల షెన్‌జెన్‌ వీసాలు ఇవ్వనున్నట్లు వెల్లడి

ఫ్రాన్స్‌.. మన దేశ స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు టాప్‌-10 దేశాల జాబితాలో నిలుస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం-2019లో పది వేల మంది భారత విద్యార్థులు ఆ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో చేరారు. కోవిడ్‌ కారణంగా 2020, 2021లలో మాత్రం ఆ సంఖ్య ఎనిమిది వేలు చొప్పున ఉంది.

ఐదేళ్ల షెన్‌జెన్‌ వీసా
ఇటీవల కాలంలో భారత విద్యార్థులను ఆకట్టుకునేలా ఫ్రాన్స్‌ ప్రభుత్వం పలు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా 2030 నాటికి కనీసం 30 వేల మంది భారత విద్యార్థులను ఆకర్షించేలా నిబంధనలను సరళీకృతం చేస్తోంది. అందుకోసం ఇప్పటికే ఐదేళ్ల పోస్ట్‌ స్టడీ వర్క్‌ను ప్రకటించిన ఆ దేశం.. తాజాగా ఐదేళ్ల కాల పరిమితితో షెన్‌జెన్‌ వీసాలను జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో కనీసం ఒక సెమిస్టర్‌ చదివి ఉండి.. భారత్, ఫ్రాన్స్‌ లేదా మరే దేశంలోనైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సులు పూర్తిచేసిన భారతీయులు ఈ వీసా పొందేందుకు అర్హులని ఫ్రా­న్స్‌ ఎంబసీ అధికారక ప్రకటనలో వెల్లడించింది.

 

Study Abroad: ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలు.. 

పోస్ట్‌ స్టడీ వర్క్‌
భారత విద్యార్థులను ఆకట్టుకునే చర్యల్లో భాగంగా ఫ్రాన్స్‌ పోస్ట్‌ స్టడీ వర్క్‌ గడువును అయిదేళ్లకు పెంచింది. ప్రస్తుతం ఈ గడువు రెండేళ్లుగా ఉంది. ఈ ఏడాది నుంచి దీన్ని అయిదేళ్లకు పెంచుతూ కొద్దిరోజుల క్రితమే ప్రకటన విడుదలైంది. ఫ్రాన్స్‌­లో పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశాలు కోరుకునే విద్యార్థులు ఏపీఎస్‌ పేరిట జారీ చేసే టెంపరరీ రెసిడెంట్‌ పర్మిట్‌(తాత్కాలిక నివాస అనుమతి)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతి పొందిన వారు తమ కోర్సు పూర్తయ్యాక ఏడాది కాలం ఫ్రా­న్స్‌లోనే ఉండి.. ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ సమయంలో వారు వారానికి 20 గంటలు, ఏడాదికి గరిష్టంగా 964 గంటలు పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ శాశ్వత కొలువు కోసం అన్వేషణ సాగించొచ్చు.

టెంపరరీ ఎంప్లాయీ పర్మిట్‌
పోస్ట్‌ స్టడీ వర్క్‌ విధానంలో భాగంగా ముందుగా టెంపరరీ ఎంప్లాయీ లేదా టెంపరరీ వర్కర్‌ రెసిడెంట్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు కనీస వేతన నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. టెంపరరీ రెసిడెంట్‌ ఎంప్లాయి పర్మిట్‌ పూర్తయ్యాక లేదా ఉద్యోగ గడువు ముగిశాక.. పూర్తి స్థాయి రెసిడెంట్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడే శాశ్వత నివాసం ఉంటూ ఉద్యోగం కొనసాగించొచ్చు.

ఈ రంగాల్లో డిమాండ్‌
ఫ్రాన్స్‌లో మాన్యుఫ్యాక్చరింగ్, మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, హాస్పిటాలిటీ, టూరిజం సెక్టార్స్‌ ఉద్యోగాలు కల్పించడంలో ముందంజలో నిలుస్తున్నాయి. వీటిలో.. ఇంజనీర్స్, మేనేజర్స్, ప్రోగ్రామర్స్, అగ్రికల్చరల్‌ ఇంజనీర్స్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. టూరిజం సెక్టార్‌లోనూ ప్లానర్స్, హోటల్‌ మేనేజర్స్‌ వంటి కొలువులు దక్కించుకోవచ్చు.

Study Abroad‌: ఎంక్యాట్‌తో.. విదేశీ వైద్య పీజీ

వేతనాలు ఆకర్షణీయం
ఫ్రాన్స్‌లోని పలు రంగాలకు చెందిన సంస్థలు ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం-సగటు వేతనం నెలకు రూ.3,085 యూరోలుగా ఉంది. కనీస వేతనం నెలకు రూ.1,708 యూరోలు ఉండాలనే నిబంధనను ఫ్రాన్స్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇంగ్లిష్, ఫ్రెంచ్‌
ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారత విద్యార్థులకు ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ నైపుణ్యాలు దోహదపడతాయి. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ. అంతర్జాతీయంగా ఉన్న తన ఎంబసీల ద్వారా ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ సదుపాయాలను కల్పిస్తోంది. కొన్ని దేశాల్లో నేరుగా, మరికొన్ని దేశాల్లో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం ఆధారంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటే.. ఫ్రెంచ్‌లో నైపుణ్యాన్ని పెంచుకుని అక్కడి కంపెనీల్లో కొలువుదీరే అవకాశం పొందొచ్చు.

స్పాన్సర్‌షిప్‌ లెటర్‌
పోస్ట్‌ స్టడీ వర్క్‌లో భాగంగా టెంపరరీ ఎంప్లాయి పర్మిట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. తప్పనిసరిగా ఎంప్లాయర్‌ ఇచ్చే స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ కలిగుండాలి. దీని ఆధారంగానే టెంపరరీ ఎంప్లాయీ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సదరు కంపెనీ ఫ్రాన్స్‌ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అయి ఉండాలనే నిబంధన కూడా ఉంది.

ప్రముఖ వర్సిటీలకు కేరాఫ్‌
ఫ్రాన్స్‌ పలు ప్రముఖ యూనివర్సిటీలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఎకోల్‌ నార్మల్‌ సుపీరియర్‌; ఎకోల్‌ పాలిటెక్నిక్‌; యూనివర్సిటీ పియెర్రె ఎట్‌ మేరీ క్యూరీ; సెంట్రల్‌ సుపీలెక్‌; ఎకోల్‌ నార్మల్‌ సుపీరియర్‌ డె లియన్‌; యూనివర్సిటీ గ్రెనోబల్‌; ప్యారిస్‌ యూనివర్సిటీ; యూనివర్సిటీ డి స్ట్రాస్‌బర్గ్‌; ప్యారిస్‌ యూనివర్సిటీ డిడెరట్‌; యూనివర్సిటీ డి మాంట్‌పెల్లెర్‌ వంటి పలు ప్రముఖ యూ­నివర్సిటీలు ఉన్నాయి. పీఎస్‌ఎల్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ, సార్‌బోన్‌ యూనివర్సిటీలకు క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లోనూ చోటు లభిస్తోంది.

ఫీజులు
ఫ్రాన్స్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫీజులు తక్కువగానే ఉంటాయి. ప్రభు­త్వ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల వార్షిక ఫీజు 620 యూరోలుగా; మేనేజ్‌మెంట్‌ కోర్సుల ఫీజు 4,500 యూరోల నుంచి ఏడు వేల యూరోల వరకు ఉంటుంది. హ్యుమానిటీస్,ఆర్ట్స్‌ తదితర ట్రెడిషనల్‌ కోర్సులకు సగటున ఏడాదికి 270 యూరోలుగా ఉంటోంది. ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌­లో మాత్రం ఈ ఫీజులు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.

నివాస ఖర్చులు
ఆ దేశంలో నివాస ఖర్చులు విద్యార్థులకు అందుబాటులోనే ఉంటాయి. సాధారణ జీవనశైలికి నెలకు 500 నుంచి 600ల యూరోల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలోనే వసతి, ట్రాన్స్‌పోర్ట్, ఇతర వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ వ్యయం 400ల యూరో ల నుంచి 500 యూరోల మధ్యలో ఉంటోంది.

Study in USA: అమెరికా కల సాకారం చేసుకోవచ్చు ఇలా.. కాలేజ్‌ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్‌ టెస్టులు తదితర వివరాలు...

స్కాలర్‌షిప్‌ 

  • ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్‌ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ప్రత్యేకంగా ఉన్న  ఒప్పందం ఫలితంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌(బ్యాచిలర్‌ డిగ్రీ), మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ వరకు పలు స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి. అవి..
  • చర్పక్‌ ఏఎంఈ స్కాలర్‌షిప్‌(మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌): ఈ పథకం ప్రకారం-రెండేళ్ల మాస్టర్‌ ప్రో­గ్రామ్‌లో ఒక విద్యా సంవత్సరానికి(పది నెలల వ్యవధి) గాను ట్యూషన్‌ ఫీజు నుంచి మినహాయింపు, 615 యూరోల నివాస వ్యయ మొత్తం లభిస్తాయి. n పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు భారత శాస్త్ర సాంకేతిక శాఖ, ఫ్రాన్స్‌ ఎంబసీలు సంయుక్తంగా రామన్‌ చర్పక్‌-పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం-గరిష్టంగా ఆరు నెలల వరకు ఫ్రాన్స్‌లో ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా పరిశోధనలు కొనసాగించొచ్చు.
  • వీటితోపాటు ఈఐఎఫ్‌ఎఫ్‌ఈఎల్‌ స్కాలర్‌షిప్‌; ఎరాస్‌మస్‌ ముండస్‌ స్కాలర్‌షిప్‌; చర్పక్‌ ఏఎంఈ స్కాలర్‌షిప్‌ వంటి కూడా ఉన్నాయి.

పార్ట్‌ టైమ్‌ వర్క్‌
ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన విద్యార్థులు.. స్టడీ ఎట్‌ వర్క్‌ విధానంలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. వారానికి 20 గంటలు మించకుండా ఏదైనా పార్ట్‌ౖటైమ్‌ కొలువు చేయొచ్చు. యూనివర్సిటీల్లో రీసెర్చ్‌ ఫ్యాకల్టీ వద్ద రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా చేరొచ్చు. నాన్‌-సైన్స్, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సూపర్‌ మార్కెట్స్, హాస్పిటల్స్, టూరిజం ఏజెన్సీల్లో పనిచేసే అవకాశం లభిస్తోంది. వారానికి కనీసం 60 యూరోలు ఆదా­యం పొందే వీలుంది. దీని ద్వారా నివాస ఖర్చుల భారం నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు.

ఇంటర్న్‌షిప్‌ 
ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన భారత విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఆ దేశంలో గ్రాండ్స్‌ ఎకోల్స్‌గా పిలిచే ఎలైట్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు.. యూరోపియన్‌ యూనియన్‌లో స్కెంజెన్‌ దేశాలుగా పిలిచే 26 దేశాల్లో(ఫ్రాన్స్‌ సహా) ఇంటర్న్‌షిప్‌ చేయొచ్చు. ఈ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి వీసాలు పొందక్కర్లేదు. అంటే.. ఫ్రాన్స్‌లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన విద్యార్థికి తమ అకడమిక్‌ కోర్సులో భాగంగా జర్మనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభిస్తుంది. దీనిద్వారా విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపి.. అదే సంస్థలో శాశ్వత కొలువు పొందొచ్చు.

లాంగ్‌ స్టే వీసా
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య కోసం అడుగుపెట్టే విద్యార్థులు లాంగ్‌ స్టే వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌ ఇమిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం-ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధిలో ఉండే కోర్సుల్లో చదివే వారు తప్పనిసరిగా లాంగ్‌ స్టే వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్, పాస్‌ పోర్ట్, ఎల్‌ఓర్, ఎస్‌ఓపీ, ఫైనాన్షియల్‌ ప్రూఫ్స్, అకడమిక్‌ సర్టిఫికెట్స్‌ జత చేస్తూ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

Published date : 11 Aug 2023 10:19AM

Photo Stories