Skip to main content

ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యావకాశాలు...

యూరోపియన్ దేశాల్లోకెల్లా సుందర ప్రాంతం..నిత్యం పర్యాటకులతో కళకళలాడే ప్రదేశం..ఫ్యాషన్‌కు పుట్టిల్లు.. ఫ్రాన్స్! ఇప్పుడు విదేశీ విద్యార్థులనూ ఆహ్వానిస్తోంది..! ఇందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఏటా సెప్టెంబర్ నెలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యావకాశాలపై విశ్లేషణ..!
ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్.. విద్యా వేదికగానూ మారుతోంది. ఇటీవలి కాలంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఈ దేశం వెళ్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. 2016 నాటికి పలు దేశాలకు చెందిన 3.10 లక్షల మంది ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతుండటం విశేషం.
 
భారత్ నుంచి క్రమేణా పెరుగుతున్న సంఖ్య...
2012లో 2,600 మంది.. 2017 జూన్ నాటికి 4,500.. ఫ్రాన్స్‌కు ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత్ విద్యార్థుల సంఖ్య ఇది. ఇతర దేశాలకు వెళ్తున్న వారితో పోల్చితే తక్కువైనప్పటికీ.. ఫ్రాన్స్ వైపు కూడా మన విద్యార్థులు దృష్టిసారిస్తున్నారనడానికి దీనిని ఉదాహరణగా పేర్కొనవచ్చు.
 
10,000 : 2020..
2020 నాటికి భారత విద్యార్థుల సంఖ్యను పదివేలకు పెంచేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఔత్సాహికులకు ఈ మేరకు పలు విధాల తోడ్పాటునందిస్తోంది. ఇక్కడి విద్యావకాశాలలో ఆర్ట్స్, లిబరల్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, టూరిజం, లగ్జరీ మేనేజ్‌మెంట్‌లు ముందువరుసలో నిలుస్తున్నాయి. మన విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల వైపే దృష్టి సారిస్తున్నారు. 
 
నాలుగు వేలపైగా ఇన్‌స్టిట్యూట్‌లు...
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నాలుగు వేలకు పైగా ఉన్నత విద్యా సంస్థలున్నాయి. స్థానిక విద్యా విధానం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు అభ్యసించే వీలుంది. ఫీజులు కూడా కొంత నామమాత్రంగానే ఉంటాయని చెప్పొచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వార్షిక ఫీజు ఇంజనీరింగ్ కోర్సులకు 620 యూరోలు, మేనేజ్‌మెంట్ కోర్సులకు 4,500 యూరోల నుంచి 7 వేల యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. హ్యుమానిటీస్, ఆర్ట్స్ తదితర సంప్రదాయ కోర్సులకు సగటున ఏడాదికి 270 యూరోలు వ్యయమవుతుంది.ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రం ఈ ఫీజులు రెట్టింపుగా ఉంటాయి.
 
నివాస ఖర్చులు అందుబాటులోనే..
సాధారణ జీవనశైలికి  నివాస ఖర్చులు నెలకు 500 నుంచి 600 యూరోలు అవుతాయి. ఈ మొత్తంలోనే వసతి, రవాణా, ఇతర వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవచ్చు. ద్వితీయ శ్రేణి నగరాల్లో వ్యయం 400 యూరోల నుంచి 500 యూరోల మధ్య ఖర్చవుతుంది.
 
స్కాలర్‌షిప్ సదుపాయాలు కూడా..
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు ప్రభుత్వ పరిధిలో, యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు స్కాలర్‌షిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భారత్- ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక ఒప్పందం ఫలితంగా అండర్ గ్రాడ్యుయేట్ (బ్యాచిలర్ డిగ్రీ), మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ వరకు ఈ స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి.
అవి..
చర్పక్ ఏఎంఈ స్కాలర్‌షిప్ (మాస్టర్స్ ప్రోగ్రామ్):
రెండేళ్ల మాస్టర్ ప్రోగ్రామ్‌లో ఒక విద్యా సంవత్సరం(పది నెలల వ్యవధి)కి గాను ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు, 615 యూరోల నివాస వ్యయం లభిస్తాయి.
 ఫ్రాన్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశం పొందిన అభ్యర్థులకు భారత శాస్త్ర సాంకేతిక శాఖ, ఫ్రాన్స్ ఎంబసీలు సంయుక్తంగా రామన్ చర్పక్-పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనిప్రకారం గరిష్టంగా ఆరు నెలల వరకు ఫ్రాన్స్‌లో ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా రీసెర్చ్ యాక్టివిటీస్ చేయొచ్చు.
 
ఆరు నెలల ముందుగా..
ఫ్రాన్స్‌లోని అన్ని వర్సిటీల్లో రెండేళ్ల వ్యవధిలో ఉండే మాస్టర్ ప్రోగ్రామ్స్‌కు సెప్టెంబర్ నెలలో తరగతులు ప్రారంభమవుతాయి. ఔత్సాహిక విద్యార్థులు కనీసం ఆరు నెలల ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. తర్వాత అకడమిక్ సెషన్ ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందు దరఖాస్తు చేస్తే.. వీసా పొందేందుకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది.
 
వీసా ప్రక్రియ సులువు...
భారత్- ఫ్రాన్స్ ద్వైపాక్షిక ఒప్పందాల ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు వీసా ప్రక్రియ సులభమైంది. యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులు ‘క్యాంపస్ ఫ్రాన్స్’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు సంతృప్తికరంగా ఉంటే తర్వాత దశలో క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫ్రాన్స్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణాలను తెలుసుకునే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉంటుంది.
 
వర్క్ ఎట్ స్టడీ..
ఫ్రాన్స్‌లో చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటలు మించకుండా పార్ట్‌ైటైమ్ ఉద్యోగం చేసుకోవచ్చు. సాధారణంగా యూనివర్సిటీల్లో రీసెర్చ్ ఫ్యాకల్టీ వద్ద రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాన్-సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, టూరిజం ఏజెన్సీల్లో పని దొరుకుతుంది. వారానికి కనీసం 60 యూరోల ఆదాయం పొందొచ్చు.
 
ఎలైట్ వర్సిటీల్లో చేరితే.. ఈయూలో స్వేచ్ఛగా :
ఫ్రాన్స్‌లో గ్రాండ్స్ ఎకోల్స్‌గా పిలిచే ఎలైట్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు యూరోపియన్ యూనియన్‌లో 26 దేశాల్లో (ఫ్రాన్స్ సహా) ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది దీనికోసం ఎలాంటి ప్రత్యేక వీసాలు పొందక్కర్లేదు. ఉదాహరణకు ఫ్రాన్స్‌లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన విద్యార్థికి.. అకడమిక్ కోర్సులో భాగంగా జర్మనీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది.
 
పోస్ట్ స్టడీ వర్క్.. ప్రోత్సాహకర విధానాలు :
భారత విద్యార్థులకు కలిసొచ్చే మరో ముఖ్యాంశం.. పోస్ట్ స్టడీ వర్క్. రెండేళ్ల మాస్టర్స్ కోర్సు పూర్తయిన విద్యార్థులు రెండేళ్ల పాటు అక్కడే కొనసాగి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే ఎంప్లాయర్ అందించే స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా వర్క్ పర్మిట్ పొందొచ్చు. తొలుత రెండేళ్ల వ్యవధికి ఇచ్చే ఈ వర్క్ పర్మిట్‌ను తర్వాత పొడిగించుకునే అవకాశం ఉంది.
 
ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ తప్పనిసరి :
ఫ్రాన్స్ వెళ్లాలనుకునేవారికి కాసింత ఇబ్బందికరంగా నిలుస్తున్న అంశం.. విదేశీ విద్యార్థులు ఫ్రెంచ్ భాషలో బేసిక్ సర్టిఫికేషన్ పొందాలనే నిబంధన. అయితే.. ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ అంతర్జాతీయంగా ఉన్న తన ఎంబసీల ద్వారా ఫ్రెంచ్ భాష శిక్షణ సదుపాయాలను కల్పిస్తోంది కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని దేశాల్లో నేరుగా, మరికొన్ని దేశాల్లో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం ఆధారంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఫ్రెంచ్‌తో పాటు విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు పొందాల్సి ఉంటుంది.
 - వీటితోపాటు ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఔత్సాహికులు జీఆర్‌ఈ స్కోర్లు సాధించాలి.
 - మేనేజ్‌మెంట్ ఔత్సాహికులకు జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి.
 
ఆధునికం.. ఆహ్లాదకరం..
ఫ్రాన్స్ ఓవైపు ఘన సంస్కృతి, సంప్రదాయలు..మరోవైపు పురాతన నిర్మాణాలు, చారిత్రాత్మక కట్టడాల నెలవు. ఫ్యాషన్, ఆధునిక జీవన శైలి ఆహ్లాదపరుస్తుంటాయి. భిన్న దేశాల వారున్నప్పటికీ.. విదేశీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యాంపస్ వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. స్థానిక, విదేశీ విద్యార్థుల కలయికగా స్టూడెంట్స్ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా తమ సంస్కృతికి త్వరగా అలవాటుపడేలా చూస్తున్నాయి. ఫ్రెంచ్ భాషలో మాట్లాడగలిగే నేర్పు ఉంటే క్యాంపస్ బయటి వాతావరణంలోనూ సులువుగా కలిసిపోవచ్చు.
 
అవసరమైన డాక్యుమెంట్స్
 1.  అకడమిక్ సర్టిఫికెట్స్
 2.  అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్
 3.  లెటర్ ఆఫ్ రికమండేషన్
 4.  స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
 5.  ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్
 6.  స్పాన్సర్‌షిప్ లెటర్
 7.  స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్
 8.  పాస్‌పోర్ట్
 
ఉత్తమ విశ్వవిద్యాలయాలివే..
 1.  ఎకోల్ నార్మల్ సుపీరియర్
 2.  ఎకోల్ పాలిటెక్నిక్
 3.  యూనివర్సిటీ పియెర్రె ఎట్ మేరీ క్యూరీ
 4.  సెంట్రల్ సుపీలెక్
 5.  ఎకోల్ నార్మల్ సుపీరియర్ డె లియన్
 6.  యూనివర్సిటీ గ్రెనోబల్
 7.  ప్యారిస్ యూనివర్సిటీ
 8.  యూనివర్సిటీ డి స్ట్రాస్‌బర్గ్
 9.  ప్యారిస్ యూనివర్సిటీ డిడెరట్
 10.  యూనివర్సిటీ డి మాంట్‌పెల్లెర్
 
ఉపయోగపడే వెబ్‌సైట్స్..
 www.inde.campusfrance.org
 www.diplomatie.gouv.fr
 www.vfs-france.co.in
 
అందుబాటులోని ఇతర స్కాలర్‌షిప్‌లు...
 1.  EIFFEL స్కాలర్‌షిప్
 2.  ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్
 3.  చర్పక్ ఏఎంఈ స్కాలర్‌షిప్
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.inde.campusfrance.org
Published date : 28 Aug 2017 02:06PM

Photo Stories