Skip to main content

Space Start-Up: దిగ్విజయ దిగంతర... ఐఐఎస్‌సీ నుంచి 15 లక్షల గ్రాంట్‌

Digantara Space Start-up
Digantara Space Start-up

వీరు ఆకాశానికి నిచ్చెనలు వేయలేదు గానీ... ఆకాశమంత కల కన్నారు. తమ ప్రతిభతో బంగారంలాంటి అవకాశాలను సృష్టించుకున్నారు. ‘దిగంతర’ స్పేస్‌ స్టార్టప్‌తో తిరుగులేని విజయం సాధించారు....

చెత్త సమస్య భూలోకంలోనే కాదు అంతరిక్షంలోనూ ఉంది. దాన్ని స్పేస్‌ జంక్‌ అని పిలుస్తారు. వేలాది సంఖ్యలో ఉండే ఈ వ్యర్థాలు భూగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటి సంఖ్య పెరిగిపోవడం అనేది ఉపగ్రహాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటి భద్రతకు ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యర్థాల తొలగింపుపై ఇస్రో దృష్టిపెట్టింది. మరోవైపు సెల్ఫ్‌ ఈటింగ్‌ రాకెట్లు, వానిషింగ్‌ శాటిలైట్ల రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అంతరిక్ష చెత్త గురించి సీరియస్‌గా చర్చ మొదలైన పరిస్థితులలో బెంగళూరు కేంద్రంగా మొదలైన ‘దిగంతర’ అనే అంకురసంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

‘స్టార్టప్‌’ స్టార్ట్‌ చేయడం ఎంత సవాలో, ‘యస్‌. మేము చేయగలం’ అని ఇన్వెస్టర్‌లలో నమ్మకాన్ని కలిగించడం అంతకంటే పెద్ద సవాలు. అలాంటి సవాలే ఈ ముగ్గురు కుర్రాళ్లకి ఎదురైంది. అనిరు«ద్‌ శర్మ, రాహుల్‌ రావత్, తన్వీర్‌ అహ్మద్‌లు ‘దిగంతర’ పేరుతో స్పేస్‌ టెక్‌  స్టార్టప్‌కు శ్రీకారం చుట్టినప్పుడు పెద్దగా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.

‘అప్పుడే ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకొని వచ్చిన యువకులు స్పేస్‌ స్టార్టప్‌ గురించి చెబితే నమ్మడం కష్టమే. అందుకే ఇన్వెస్టర్‌ కమ్యూనిటీలో నమ్మకం కలిగించడమే మా తొలి లక్ష్యం అయింది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు అనిరుథ్‌. ‘దిగంతర’ అనేది అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుక్కునే స్టార్టప్‌. ‘అంతరిక్షంలో ఉన్న చెత్తతో వ్యాపారమా? ఇది ఎలా సాధ్యం’ అనే ఆశ్చర్యాలు బారులు తీరాయి. ఎందుకంటే ఇలాంటి అంకుర సంస్థ గురించి వినడం వారికి ఇదే మొదటిసారి.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...
అనిరుథ్‌ శర్మ పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ(ఎల్‌పీయూ)లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌. అయితే ఇతడికి ఏరోస్పేస్, ఏరోనాటిక్స్‌ అంటే చాలా ఇష్టం. శర్మ మిత్రుడు తన్వీర్‌ అహ్మద్‌ బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేస్తున్నాడు. ఇస్రో మార్గదర్శకాలతో తమ కాలేజీలో ‘స్టూడెంట్‌ శాటిలైట్‌ టీమ్‌’ ప్రారంభించాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న శర్మ తమ యూనివర్శిటీలో కూడా అలాంటి టీమ్‌ను ప్రారంభించాడు. ఇస్రో ఆధ్వర్యంలో చండీగఢ్‌లో జరిగిన ఒక సదస్సులో ఈ టీమ్‌ ఒక పేపర్‌ సమర్పించి అవార్డ్‌ సొంతం చేసుకుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జర్మనీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన తరువాత ‘స్పేస్‌ సస్టెయినబిలిటీ’ అనేది ఎంత పెద్ద సవాలో లోతుగా తెలుసుకోగలిగారు.
ఒక లాటిన్‌ అమెరికా స్పేస్‌ కంపెనీ కోసం శాటిలైట్‌ విడిభాగాలను తయారుచేసి శబ్భాష్‌ అనిపించుకున్నారు. అలా ‘దిగంతర’కు అంకురార్పణ జరిగింది. ఈ కంపెనీకి అనిరుథ్‌ శర్మ సీయివో, తన్వీర్‌ అహ్మద్‌ సీటివో(చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌), రాహుల్‌ రావత్‌ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌)

Also read: ​​​​​​​Inspiring Story: రూ.80 వేల వ‌చ్చే ఉద్యోగాన్ని వ‌దిలి.. ఊరి బాట ప‌ట్టా.. ఎందుకంటే..?

 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నుంచి 15 లక్షల గ్రాంట్‌ పొందడం దిగంతర సాధించిన తొలివిజయం.
స్పేస్‌ క్లైమెట్‌ అండ్‌ ఆబ్జెక్ట్‌ ట్రాకర్‌ (ఎస్‌సీవోటి), ఆర్బిటల్‌ ఇంజన్, స్పేస్‌–ఎడాప్ట్‌...అనే మూడు విభాగాల్లో ‘దిగంతర’ పనిచేస్తుంది. హార్డ్‌వేర్,సాఫ్ట్‌వేర్‌లతో మిళితమైన ‘ఇన్‌–ఆర్బిట్‌ స్పేస్‌ డెబ్రీస్‌ మానిటర్‌’ 1 సెం.మీ నుంచి 20 సెం.మీ పరిమాణంలో ఉన్న అంతరిక్ష వ్యర్థాలను ట్రాక్‌ చేస్తుంది. ఆ తరువాత విజువలైజేషన్‌ మోడల్‌ రూపొందించి కేటలాగ్‌ తయారుచేస్తారు.

Also read: Success Story: ఉన్న‌త ఉద్యోగాలకు టాటా చెప్పి.. పల్లెకు హాయ్ చెప్పిన యువజంట..ఎందుకంటే..?

​​​​​​​

 ‘మేము ఇచ్చే డాటా ద్వారా కస్టమర్‌ల మిషన్‌ ఆపరేషన్‌ ఖర్చు చాలా తగ్గుతుంది’ అంటుంది దిగంతర. మన ప్రభుత్వం స్పేస్‌ సెక్టార్‌లో ప్రైవెట్‌ కంపెనీలకు పచ్చజెండా ఊపిన తరువాత ‘దిగంతర’లాంటి కంపెనీలకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఇటలీకి చెందిన ప్రసిద్ధ స్పేస్‌ ఫ్లైట్‌ సర్వీసెస్‌ కంపెనీ ‘టెలిస్పాజియో’ కెనడియన్‌ స్పేస్‌స్టార్టప్‌ ‘నార్త్‌స్టార్‌ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌’లో వాటా తీసుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ ‘దిగంతర’పై కూడా ఆసక్తి చూపుతుంది.

Also read: ​​​​​​​Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

​​​​​​​​​​​​​​

‘వీరి గురించి గొప్పగా చెప్పుకోవడానికి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి... స్టూడెంట్స్‌గానే ఎన్నో సాధించారు. రెండు... వృత్తినిబద్ధత. టెక్నాలజి విషయాలు మాత్రమే కాకుండా మార్కెట్‌ సంబంధిత అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది’ అని ప్రశంసిస్తున్నారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెల్‌ చైర్మన్‌(సొసైటీ ఫర్‌ ఇన్నోవేషన్‌ డెవలప్‌మెంట్‌..బెంగళూరు) సీవి మురళీ. భవిష్యత్‌లో ‘దిగంతర’ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. 

Published date : 29 Apr 2022 06:20PM

Photo Stories