Skip to main content

Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

నివాసం ఉన్న ఇంటిని అమ్మడం అంటే అన్ని ఆస్తులు హరించుకుపోయాయి అనే సంకేతం బంధుమిత్రులతోపాటు మన చుట్టూ ఉన్నవారికి చేరిపోతుంది. దీప్తి అవస్తి శర్మ విషయంలో అదే జరిగింది.
Successful Business Woman Story
Deepti Awasthi Sharma

వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చటానికి ఇల్లు అమ్మాల్సి వచ్చింది. అన్ని నిందలు భరిస్తూ 50 వేల రూపాయలతో చేసిన ఒక ప్రయత్నం ఆమెను రూ.20 కోట్ల వ్యాపారవేత్తగా మార్చింది. 

Motivational Story: ఇద్దరు మిత్రులు.. ఓ ఆసక్తికర స్టోరీ.. !

ఈ కార‌ణంతో మా ఇంటిని అమ్మి.. అద్దె ఇంట్లో.. 
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేసిన దీప్తి సిఎ కోసం సన్నాహాలు చేసుకుంది. కాని చదువు, ఉద్యోగం మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో, సి.ఎ చివరి సంవత్సరంలో ఈవెంట్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. అప్పుడు దీప్తి వయసు 24 ఏళ్లు. వేరొకరి భాగస్వామ్యంతో ఈ ఈవెంట్‌ వ్యాపారంలో చేరింది. 31 డిసెంబర్‌ 2014 న ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఈవెంట్‌ బాధ్యత దీప్తి కంపెనీకే లభించింది. ‘ఆ ఈవెంట్‌కి చాలామంది ప్రముఖులు హాజరు కావలసి ఉంది. కాని ఈ కార్యక్రమం జరగడానికి ముందు స్పాన్సర్లు చేతులు ఎత్తేసారు. దీంతో ఈవెంట్‌ భాగస్వామి కూడా వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితిలో ఈవెంట్‌కి టిక్కెట్లు పెద్దగా అమ్ముడు పోలేదు. ఆ సమయంలో చనిపోవడమా, పారిపోవడమా లాంటి పరిస్థితి. పారిపోయే బదులుగా నా సొంత డబ్బును పెట్టుబడి పెట్టి ఏదో ఒకవిధంగా ఈవెంట్‌ను నిర్వహించాను. దాదాపు 40 లక్షల రూపాయల నష్టం. దానిని పూడ్చటానికి మా ఇంటిని అమ్మాల్సి వచ్చింది. కొన్నేళ్లు అద్దె ఇంట్లో ఉన్నాం.

అమితమైన నిరాశతో..

Deepti Awasthi Sharma


ఇరుగుపొరుగు వారు, బంధువులు తిట్టడం ప్రారంభించారు. ‘కూతురును నెత్తికెత్తుకున్న ఫలితం ఇది’ అని అమ్మానాన్నలను అన్నారు అంతా. వ్యాపారం కోల్పోవడం, ఇల్లు అమ్మిన బాధ, బంధువుల నిందలు నన్ను కలవరపరిచాయి. అమితమైన నిరాశకు గురయ్యాను. అయినప్పటికీ నా తల్లి, తండ్రి నాతో కలిసే ఉన్నారు. అందరూ అనే మాటలు మాత్రం నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇది జరిగిన మూడు నెలల తరువాత అమ్మానాన్నలు చెప్పినట్టు పెళ్లి చేసుకున్నాను. నాతో కలిసి నడవటానికి నా భర్త వికాస్‌ తన కెరీర్, కలలతో రాజీ పడ్డాడు. నా కలల గురించి తెలుసుకుని, నన్ను మళ్ళీ వ్యాపారం చేయమని ప్రోత్సహించాడు. అక్కడ నుంచి జీవితం లో యూటర్న్‌ వచ్చింది. డిజిటల్‌ హోర్డింగ్స్‌ వ్యాపారాన్ని ప్రారంభించాను’ అని ప్రారంభ వ్యాపారాన్ని నష్టాలబాట ఎలా కుదిపేసిందో తెలిపింది దీప్తి.

50 వేల రూపాయలతో..

Family


పెట్టుబడి, లావాదేవీల గురించి దీప్తి మాట్లాడుతూ, ‘2016లో డిజిటల్‌ హోర్డింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించాను. ముందు దీనిపై చాలా పరిశోధన చేశాను. ఎక్కడా స్పష్టత లేదు. వికాస్‌ ఢిల్లీలోని ఒక టెక్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వ్యాపారం ప్రారంభించడంలో వారి నుండి సాంకేతిక సహాయం పొందాను. మార్కెటింగ్, అకౌంటింగ్‌లో నాకున్న పరిజ్ఞానం దీనికి తోడయ్యింది. ఫలితంగా వ్యాపారం విజయాల బాటలో నడించింది. కేవలం రెండేళ్ళలో మా సంస్థ 12 కోట్ల టర్నోవర్‌ సాధించింది ఇది ప్రతీ యేటా పెరుగుతూ వచ్చింది’ అని తెలిపిన దీప్తి  కంపెనీ టర్నోవర్‌ నేడు రూ .20 కోట్లకు చేరింది.  

విజయానికి సత్వరమార్గం లేదు.. ఇందుకు..

Success Story


దీప్తి చెప్పిన దాని ప్రకారం.. ‘కస్టమర్‌ మొదట మా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. తరువాత, ఎక్కడ హోర్డింగ్‌ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని సెలక్ట్‌ చేయాలి. స్థానం ఎంచుకున్న తర్వాత మ్యాచ్‌ ఆప్షన్‌ వస్తుంది. ఆ తరువాత సైట్, స్థానం లభ్యత, నిర్ధారణ.. ఇవన్నీ మా వెబ్‌సైట్‌ నుంచి మెయిల్‌కు వచ్చేస్తాయి. అప్పుడు ఆర్డర్‌ చేయచ్చు. దీని తరువాత, లొకేషన్‌ సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వారికి ఒక ఐడి, పాస్‌వర్డ్‌ ఇస్తాం. కస్టమర్‌ హోర్డింగ్‌ ప్రస్తుత స్థితిని ప్రత్యక్షంగా ట్రాక్‌ చేయవచ్చు. ఒక నెల టైమ్‌కి హోర్డింగ్‌ పొందాలంటే సుమారు లక్ష రూపాయలు అవుతుంది. అయితే, హోర్డింగ్‌ ధర వివిధ రాష్ట్రాలు, లొకేషన్‌ వారీగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి దాని వెనక గల పూర్తి నేపథ్యాన్ని తెలుసుకోవాలి. దానిపై పరిశోధనలు చేయాలి. విజయానికి సత్వరమార్గం లేదు. ఇందుకు చాలా కష్టపడాలి’ అని నవ్వుతూ వివరించింది దీప్తి.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ టాప్ స‌క్సెస్‌ సీక్రెట్స్ ఇవే..

Published date : 25 Feb 2022 05:45PM

Photo Stories