Skip to main content

Success Story: ఉన్న‌త ఉద్యోగాలకు టాటా చెప్పి.. పల్లెకు హాయ్ చెప్పిన యువజంట..ఎందుకంటే..?

ఈ యువ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. మంచి జీతం, మహానగరంలో నివాసం.. ఇవేమీ వారికి తృప్తిని ఇవ్వలేదు.
Organic Farming Success
మావురం మల్లికార్జునరెడ్డి, సంధ్య

సహోద్యోగి కుమార్తె సహా బంధు మిత్రులలో కొందరు కేన్సర్‌ మహమ్మారి బారిన పడ్డారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే అందుకు మూల కారణమని గ్రహింపు కలిగింది. పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతి స్ఫూర్తినిచ్చి దారిచూపింది. అలా.. ఉద్యోగాలకు టాటా చెప్పి ఆరోగ్యవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ స్వగ్రామానికి మకాం మార్చారు.  సమీకృత ప్రకృతి వ్యవసాయం చేపెట్టి విజయపథంలో ముందడుగు వేస్తూ జాతీయ స్థాయి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

ఓ మారుమూల గ్రామంకు..
కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లి గ్రామం ఓ మారుమూల పల్లెటూరు. అయిదు వందల జనాభా కూడా లేని ఈ పల్లెటూరు పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మావురం లక్ష్మారెడ్డి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు మల్లికార్జున్‌ రెడ్డి బీటెక్‌ చదివి హైదరాబాద్‌లో స్టాప్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన సంధ్యతో 2010లో వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన సంధ్య కూడా హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు.

ఆ జబ్బులకు మూల కారణం ఇదే.. క‌నుక‌
మల్లికార్జున్‌రెడ్డి సహోద్యోగి కుమార్తెకు కేన్సర్‌ జబ్బుపాలైంది. అదే విధంగా తమ గ్రామానికి చెందిన వారు ముగ్గురికి కేన్సర్‌ వచ్చింది. ఇతరత్రా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారెందరో. తమ సహాయం కోసం ఊరి నుంచి వచ్చిన వారితో పాటు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు.. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారమే ఈ జబ్బులకు మూల కారణం అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. మల్లికార్జున్ రెడ్డి మనసును బాగా కలచివేసిన మరో విషాద ఘటన ఆయన స్నేహితుడి కుమార్తె అకాల మరణం. క్యాన్సర్ కారణంగా మిత్రుడి కుమార్తె మరణించడం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. “నా కుటుంబం కూడా ఇలాంటి విషపు కోరల్లో చిక్కుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఒక మంచి మార్పును ఆశించి నా కొత్త ప్రయాణం ప్రారంభించాను” అని మల్లికార్జున్ రెడ్డి వివరించారు. అదే కాలంలో పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ విధానం కూడా మల్లికార్జున్‌రెడ్డి, సంధ్య దంపతులను ప్రభావితం చేసింది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టారు.

ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో హాయిగా..
మల్లిఖార్జున్‌ రెడ్డి, సంధ్యారెడ్డి  సొంత భూమి 14 ఎకరాల్లో సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించారు. ఇంటికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ రసాయనాలు లేకుండా పండించుకుంటున్నారు. ధాన్యంతో పాటు, నూనెల కోసం పల్లీలు, నువ్వులు, పెసర, కంది పప్పులు, మిర్చి, ఉల్లి, ఎల్లి గడ్డలు, కొత్తిమీర, ఆవాలు, అల్లం వంటి పంటలను తగిన మోతాదులో సాగు చేసుకుంటున్నారు. రసాయనాలు లేని అమృతాహారాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లపాదీ పిల్లా పాపలతో పాటు ఆనందంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యువన (7), ఆద్విక (5). వీరి ఆలనా పాలనా చూస్తూనే, ఇంటి పనితో పాటు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు సంధ్య.

ఎకరానికి రూ.లక్షకు పైగా ఆదాయం..

success story


మల్లికార్జునరెడ్డి నిత్యం స్వయంగా పొలం పనిలో నిమగ్నమై ఉంటారు. వరి నాట్ల కాలంలో రోజుకు 23 కి.మీ. మేర నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇతర కాలాల్లో రోజుకు 7 కి.మీ. మేర నడుస్తూ పొలం పనులు చేస్తుంటారు. వెద పద్ధతిలో వరి విత్తనాన్ని తానే స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తటం, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయటం ద్వారా ఖర్చును ఎకరానికి రూ. 25 వేలకు తగ్గిస్తున్నానని మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. ఇతరులకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం 18 ఎకరాల్లో విత్తన కంపెనీలతో ఒప్పందం (క్వింటా రూ. 2 వేలు) చేసుకొని వరి విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పశువుల ఎరువు, మాగబెట్టిన కోళ్ల ఎరువు, జీవామృతం, జీవన ఎరువులు వాడుతున్నారు. తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని ఏడేళ్లలో 0.5 నుంచి 1.5కి పెంచుకున్నారు. ఎకరానికి ఏటా (2 పంటలు) 60 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందుతున్నారు. వర్షపు నీటిని నేల బావిలోకి ఇంకింపజేస్తూ నీటి భద్రతను సాధించారు.

పంట సాగుతో పాటు..

organic farming


పంటలతో పాటు 3 ఆవులు, 10 పొట్టేళ్లు, 54 నల్ల మేకలు, 50 వనరాజా కోళ్లను సాగు చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఈ యువ దంపతులు. వ్యవసాయ విద్యార్థులకు 6 నెలలు సాగు పనులు నేర్పిస్తున్నారు. మల్లికార్జునరెడ్డి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ–ఢిల్లీ) బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ జాతీయ అవార్డును అందుకున్న తర్వాత రైతు సందర్శకుల తాకిడి పెరగటం విశేషం.

నాడు వద్దన్న వారే.. నేడు..
ఏడేళ్ళ క్రితం గ్రామంలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని వచ్చాం. పట్టణంలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి పల్లెటూరుకు ఏం పోతారు అని చాలా మంది అన్నారు. సమీకృత వ్యవసాయంతో పంటల సాగును లాభాల బాట పట్టించాం. మా ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు పంటల సాగుతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం, నాటు కోళ్ళ పెంపకం పనుల్లో తలమునకలై ఉంటారు. ఇంటికి కావల్సిన పంటలను పండించడం చేస్తున్నాను. జాతీయ స్థాయిలో మాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. అప్పుడు పల్లెటూరుకు వద్దన్న వారే ఇప్పుడు అభినందిస్తున్నారు.

నేను రుజువు చేశా..
సాగు ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చని నేను రుజువు చేశాను. వెద వరి, నీటి ఆదా తదితర పద్ధతులతోపాటు విత్తన వరి ఒప్పంద సేద్యం ద్వారా ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం పొందుతున్నాను. వరి విస్తీర్ణాన్ని సగం తగ్గించి, ఆరుతడి పంటలు సాగు చేస్తా. పంటలతోపాటు పశువులు, కోళ్లు, చేపలను పెంచితేనే రైతుకు రసాయన రహిత ఆహార భద్రత, ఆదాయ భద్రత ఉంటుంది. నా అనుభవాలతో ఆహార–వ్యవసాయ సంస్థ కోసం పుస్తకం రాస్తున్నా. ఎఫ్‌.పి.ఓ. ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలవాలన్నది లక్ష్యం.

ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో..

farming


నిజానికి వ్యవసాయం వారి కుటుంబానికి కొత్తేమీ కాదు. తండ్రి లక్ష్మారెడ్డి వ్యవసాయంలోనే ఉన్నారు. అలా కుటుంబం సాగు చేస్తున్న 12 ఎకరాలలోనే మల్లికార్జున్ రెడ్డి తనదైన పద్ధతుల్లో సేద్యం ప్రారంభించారు. మొదట పాక్షిక సేంద్రియ విధానాల్లో వరి పండించారు. ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో బిందు సేద్యంలో వరి సాగు చేశారు. ఆ తరువాత హైబ్రిడ్ కందిసాగుకు ప్రయత్నించారు. ఆపై వరి దిగుబడిని పెంచడానికి సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (ఎస్ఆర్ఐ) వ్యవసాయ పద్ధతిని అనుసరించారు.

Published date : 31 Mar 2022 04:47PM

Photo Stories