TS Gurukulam Jobs 2023 : 11,687 గురుకుల ఉద్యోగ నోటిపిషన్‌కు రంగం సిద్ధం.. ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే..
ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసే దిశగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది. గురుకుల పాఠశాలలు, కళాశాలలో 11,687 ఉద్యోగ ఖాళీల నియామకానికి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్ మెంట్ బోర్డు (TRIRB) సిద్ధంగా ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే..
తొలుత డిగ్రీ, జూనియర్ గురుకుల కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీని చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత ప్రిన్సిపాల్ పోస్టులు, ఆపై పీజీటీ, టీజీటీ, తర్వాత సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన ఆయా పోస్టుల రిజర్వ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆయా పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ట్రిబ్ సిద్ధంగా ఉంది.
పోస్టుల వివరాలు ఇలా..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి మొత్తంగా 9,096 ఉద్యోగాలకు ప్రతిపాదనలను పంపగా, దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వం అదనంగా మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. వాటికి ప్రభుత్వం మంజూరు చేసిన 2,591 ఉద్యోగాలకు ఆర్ధికశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 ఉద్యోగాలకు గుర్తించారు. వాటిలో లెక్చరర్, ప్రిన్సిపాల్ తదితర పోస్టులను ట్రిబ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. రిక్రూమెంట్ విడుదల మొదలు, పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను ట్రిబ్ రూపొందిస్తున్నది.