Skip to main content

Teacher Jobs: ఖాళీ పోస్టులతో అవస్థలు.. టీచర్లు లేక విద్యార్థులు ఇలా..

తలకొండపల్లి: సౌకర్యాల లేమితో ప్రభుత్వ పాఠశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి. టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
Posts are vacant in some schools

మండల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 52 ఉన్నాయి. వీటిల్లో 234 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 106 మంది మాత్రమే ఉన్నారు. 28 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ బడుల్లో 2,219 మంది చదువుతుండగా అందరికీ ఒక జత యూనిఫామ్స్‌ పంపిణీ చేశారు. రెండో జతను త్వరలో పంపిణీ చేయనున్నట్లు ఎంఈఓ సర్దార్‌నాయక్‌ తెలిపారు.

పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. మనఊరు–మనబడి పథకం కింద రూ.3,71,93,576 నిధులు మంజూరు కాగా.. రూ.51 ,94,015 మాత్రమే ఖర్చు చేశారు. చంద్రధన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. స్లాబ్‌ వేసి వదిలేశారు. చుక్కాపూర్‌ ఉన్నత పాఠశాలలో గదులు నిర్మాణం కోసం రూ.74 లక్షలు మంజూరు కాగా, ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కాలేదు. రాంపూర్‌ ఉన్నత, చీపునుంతల ప్రాథమిక పాఠశాలల్లో ప్రహరీలు లేవు.

తలకొండపల్లి ప్రాథమిక పాఠశాలలో వంట గది లేదు. శిథిలమైన గదిలోనే వంట చేస్తున్నారు. చంద్రధన ప్రాథమిక పాఠశాలకు వంట గది అవసరముంది. మెదక్‌పల్లి ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలమైపోయింది. 3 అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల కింద 9 బడులకు 8,91,000 మంజూరు కాగా.. 100 శాతం నిధులు ఖర్చు చేసి మరమ్మతులు చేశారు.

చదవండి: ‘Eklavya’లో స్థానికులకు సీట్లు కేటాయించాలి

13 పాఠశాలల్లో కిచెన్‌ షెడ్లు నిల్‌

కందుకూరు: మండల పరిధి 13 ప్రభుత్వ పాఠశాలల్లో (గుమ్మడవెల్లితండా, మాలగూడ, ముచ్చర్ల, చీమలవానికుంట, జబ్బార్‌గూడ, దావూద్‌గూడ, దాసర్లపల్లితండా, శ్యామగడ్డ, అగర్‌మియాగూడ, పులిమామిడి, ధన్నారం ప్రాథమిక, బేగంపేట, మాన్యగూడ) కిచెన్‌ షెడ్లు లేవు. దీంతో ఆరు బయట లేదా వరండా, తరగతి గదుల్లో వంట చేయాల్సిన దుస్థితి.

కందుకూరు చౌరస్తాలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేదు. అన్ని పాఠశాలల్లో 4,512 మంది విద్యనభ్యసిస్తుండగా.. 75 నుంచి 80 శాతం మాత్రమే హాజరవుతున్నారు. మెడికల్‌ కిట్లు, న్యాప్‌కిన్స్‌ సరఫరా లేదు. ప్రస్తుతం అన్ని పాఠశాలకు తాగునీరు సరఫరా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని బడులకు స్టేయిన్‌ లెస్‌ స్టీల్‌ ట్యాంకుల ఏర్పాటుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

చదవండి: Admissions: డైట్‌ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

తరగతి గదిలోనే వంట

పెద్దేముల్‌: సర్కారు బడుల్లో వసతులు కొరవడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో సెలవుల దినాల్లో పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కానీ.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. క్షేత్రస్థాయి బడుల్లో పనులు పూర్తి కాలేదు. మండల పరిధి కర్ణాటక సరిహద్దు గిరిజన పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి.

1నుంచి 5 తరగతులను ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తున్నారు. ఆ టీచర్‌ అత్యవసర సమయంలో సెలవు పెడితే విద్యార్థులకు తీవ్ర నష్టం తప్పదు. గాజీపూర్‌ పాఠశాలకు ప్రహరి, బుద్దారం, ఊరేంటితండా బడులకు వంట గదులు లేక, క్లాస్‌ రూముల్లో వంట చేస్తున్నారు. బాయిమీదితండా, జైరాంతండా, ఉఫానాయక్‌తండాల ఐదు తరగతులకు ఒక్కరే టీచర్‌. బడులు తెరిచి పది రోజులు గడుస్తున్నా.. నేటికీ 40శాతం వరకు ఏకరూప దుస్తులు సరఫరా అయినట్లు ప్రధానాపోధ్యాయుల ద్వారా తెలుస్తోంది.

కొన్ని స్కూళ్లకే ప్రహరీలు

కడ్తాల్‌: మండల పరిధి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. మనఊరు–మనబడి కింద కొన్ని పాఠశాలలో అభివృద్ధి పనులు చేశారు. అమ్మ ఆదర్శ పథకం కింద పనులు చేపట్టారు. దీని ద్వారా కొన్ని పాఠశాలల్లో మౌలిక సమస్యలు తీరుతున్నా, మరికొన్నింటిలో అలాగే ఉన్నాయి. ఆదర్శ పాఠశాలల పథకం కింద 12 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో వాస్‌దేవ్‌పూర్‌, గడ్డమీదితండా, అన్మాస్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

మండల పరిధి ప్రాథమిక పాఠశాలలకు ఎక్కడా ప్రహరీలు లేవు. కిచెన్‌ షెడ్లు కొన్ని పాఠశాలల్లో ఉన్నా.. మరికొన్నింట్లో లేవు. ప్రధానంగా మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలకు నేటికీ ప్రహరీ లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. మక్తమాధారం ప్రాథమికోన్నత పాఠశాలలో హిందీ పోస్ట్‌ ఖాళీగా ఉంది.

మరుగుదొడ్లున్నా.. శుభ్రం సున్నా..

ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టినప్పటికీ.. ఇంకా చాలా బడుల్లో పూర్తికాలేదు. మండలంలో 29 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో 5 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు కొనసాగుతుండగా.. 390 మంది విద్యనభ్యసిస్తున్నారు. 22 మంది ఉపాధ్యాయులు ఉండగా.. ఇటీవల నలుగురు టీచర్లు బదిలీ అయ్యారు.

పాఠశాలలో విద్యార్థులు ఇతర అవసరాలకు బోరు నీటిని వాడుతున్నప్పటికీ.. తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నా.. వాటిని శుభ్రం చేయడానికి స్కావెంజర్‌ లేరు. అప్పుడప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. కొన్నేళ్లుగా అటెండర్‌, వాచ్‌మెన్‌, స్వీపర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్‌మెన్‌ లేక పోవడంతో.. ఆకతాయిలు పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల మాటున ఉంటూ.. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, వెంటనే వాచ్‌మెన్‌ను నియమించడంతో పాటు.. పాఠశాల వెనుకభాగంలో ప్రహారి ఎత్తును పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Published date : 26 Jun 2024 09:14AM

Photo Stories