Jobs: దేవాదాయ శాఖలో కీలక పోస్టులు ఖాళీ
ఆలయాల అభివృద్ధికి, ఆదాయం కోసం ఓ వైపు ప్రభుత్వం కృషి చేస్తుండగా ముఖ్యమైన అధికారుల పోస్టులు భర్తీ కావడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం 1359 ఆలయాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో 751, కామారెడ్డి జిల్లాలో 608 ఆలయాలు ఉన్నాయి.
ఇందులో రూ కోటి వరకు ఆదాయం ఉన్న దేవాలయాలు 6(ఏ) కింద 6, రూ. 25 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలు 6(బి) కింద 11 ఉ న్నాయి. ఇక రూ. 2లక్షల ఆదాయంలోపు గల ఆలయాలు 1340, రెండు మఠాలు కలుపుకుని మొత్తం 1359 ఆలయాలు ఉన్నాయి. రూ. 25 లక్షల పైబడి ఆదాయం వచ్చే ఆలయాలకు ఒక్కో ఆలయానికి ఒక్కో ఆలయ నిర్వాహణ అధికారి ఉండాలి.
అయి తే ప్రస్తుతం నిజామాబాద్‌లో ఇద్దరు, కామారెడ్డి జి ల్లాలో ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రేడ్ –3 కింద ఏడు పోస్టు లు ఉండగా ఇద్దరు పనిచేస్తున్నారు అయిదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేమ్–2లో మూడు పోస్టులకు గాను ముగ్గురు పనిచేస్తున్నారు. ఇక గ్రేడ్ 1 పోస్టు ఒకటి ఉండగా ఆ కీలక పోస్టు సైతం ఖాళీగా ఉంది.
చదవండి: NIACL Recruitment 2023: 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.80,000 జీతం..
ఉన్నవారిపైనే పనిభారం..
ఉమ్మడి జిల్లాకు ఒకే దేవాదాయ ధర్మదాయ శాఖ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ ఎన్ సుప్రియ ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ రవీందర్ మాధవనగర్ సాయిబాబా ఆలయానికి ఈవోగా పనిచేస్తూ 6 ఆలయాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. జి వేణు శ్రీ జెండా బాలాజీ మందిరంకు ఈవోగా పనిచేస్తూ 7 ఆలయాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో పి శ్రీధర్ సిద్ది రామేశ్వర ఆలయం ఈవోగా పనిచేస్తూ 5 ఆలయాలకు ఇన్‌చార్జిగా, బి ప్రభురాము శ్రీ కాళబైరవ స్వామి ఆలయానికి ఈవో పనిచేస్తూ 4 ఆలయాలకు ఇన్‌చార్జిగా, వి శ్రీధర్‌రావు పంచముఖ హనుమాన్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈవో పనిచేస్తూ మరో 5 ఆలయాలకు ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. వాస్తవానికి రూ. 25 లక్షల పైబడి ఆదాయం ఉన్న ఆలయాలకు ఒక్కో ఆలయానికి ఒక్కో కార్యనిర్వాహణ అధికారిను నియమించవలసి ఉంది.
చదవండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్–సి హోదాలో కేంద్ర కొలువులు
గత కొద్ది సంవత్సరాలుగా ఈ పోస్టులలో ఎవరిని నియమించక పోవటంతో ఉన్న ఈవోలనే ఇన్‌చార్జులుగా నియమించారు. దాంతో వారు ఏ ఆలయంపై అభివృద్ధి పెట్టాలో, ఎక్కడ ఎటువంటి పనులు చేపట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ముఖ్యంగా ఏదైనా పండగ వేళలో, జాతర ఉత్సవాలలో ఆలయాలలో ఏర్పాట్లు తలకు మించిన భారం అవుతోంది. ఉమ్మడి జిల్లాలో రూ. 25 లక్షల పైబడి ఆదాయం వచ్చే దేవాలయాలకు ఈ వోలను నియమించాలని భక్తులు కోరుతున్నారు.