3 530 Jobs: కొత్త వైద్య కళాశాలలకు 3,530 పోస్టులు
ఈ మేరకు Andhra Pradesh Medical and Health Department ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర జూన్ 28న ఉత్తర్వులు ఇచ్చారు. ఒక్కో వైద్య కళాశాలకు 706 పోస్టులు చొప్పున 3,530 పోస్టులు కొత్తగా సృష్టించడానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 16 కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.7850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం(2023–24) నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం లలో నూతన వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలో 222, అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో 484 చొప్పున పోస్టులను ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తోంది. ప్రతి మెడికల్ కళాశాల, బోధానాస్పత్రిలో ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ పోస్టులతో పాటు, 11 ప్రొఫెస్, 25 అసోసియేట్, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్, 58 సీనియర్ రెసిడెంట్, 18 హెడ్‌నర్సు, 200 స్టాఫ్ నర్స్, ఇతర పారామెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాయి. ఐదు వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా అక్కడి జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా వైద్య శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఆస్పత్రిలో ఒక లక్ష చ.అ ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) నిర్మాణానికి ప్రభుత్వం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే విధంగా ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఖర్చు చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇప్పటికే 40వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. ఇదే క్రమంలో ఐదు కొత్త వైద్యశాలల కోసం మరో 3530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించడం గమనార్హం.
చదవండి: