Skip to main content

Internships: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం.. నెలకు రూ.12 వేల స్టైఫండ్‌.. ఎవ‌రికంటే..

ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌ విద్యార్థులను భవిష్యత్‌ నైపుణ్య నిపుణులు (ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌)గా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Computer science interns support government schools   Government school internship for engineering and CS students  Government Internships For Engineering And Computer Sciences Students

బీటెక్‌, ఎంటెక్‌తో పాటు ఎంసీఏ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించింది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్సెస్‌ విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించారు. దీని తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ), మెకానికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ విద్యార్థులను పరిశీలిస్తారు. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది.

3,024 పాఠశాలలకు.. 1,014 మంది విద్యార్థులు..
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్‌, నెల్లూరు జిల్లాల్లోని 44 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొత్తం 1,014 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. వీరిని మొత్తం 3,042 ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌లో భాగంగా ఒక్కో ఇంజినీరింగ్‌ విద్యార్థి నాలుగు నెలల పాటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. ఒక్కో ఇంజినీరింగ్‌ విద్యార్థికి మూడు ఉన్నత పాఠశాలలను కేటాయించారు. వారానికి రెండు రోజలు పాఠశాలకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్యాబ్‌ల వాడకం, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ తరగతులు, స్మార్ట్‌ క్లాసుల బోధనపై శిక్షణ ఇస్తారు. నాలుగు నెలల ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.12 వేలు స్టైఫండ్‌ చెల్లిస్తారు.

‘వర్చువల్‌’లో మరో ఇంటర్న్‌షిప్‌..
రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలనూ సమీపంలోని ఇంజినీరింగ్‌ కళాశాలతో జత చేశారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత పాఠశాలలో ఇంటర్న్‌గా చేస్తూనే వర్చువల్‌ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్‌ మార్కెట్‌ ఓరియంటెడ్‌ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాలా ఇంటర్న్‌షిప్‌ దోహదపడుతుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

AP Govt: ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక ఘట్టం.. ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం

ఇప్పటికే ఏటీఎల్‌ మెంటార్‌షిప్‌..
ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌ కింద ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్‌ బాటపడుతున్నారు. రెండు నెలల పాటు కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఇందులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’ (ఏటీఎల్‌)కు మెంటార్‌షిప్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ కోర్సుల్లోనే శిక్షణ..
ఫ్యూచర్‌ స్కిల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), అగ్మెంటెండ్‌ రియాలిటీ (ఏఆర్‌), మెటావర్స్‌/వెబ్‌ 3.0, మోడలింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా/డేటా ఎనలిస్ట్‌, రోబోటిక్స్‌లో బేసిక్స్‌ బోధించనున్నారు. దీని ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థుల సహాయంతో బేసిక్స్‌ నేర్పిస్తూనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్‌ పరికరాలపై విద్యా బోధన, హైస్కూల్‌ విద్యార్థులకు ట్యాబ్స్‌ వినియోగంపై శిక్షణ కల్పి స్తున్నారు. అలాగే కొత్త కంటెంట్‌ ఇన్‌స్టాల్‌ చేసి అందిస్తారు.

India Today Education Summit 2024: తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న‌ సీఎం జగన్

చదువుతో పాటే సంపాదన.. 
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ ఓ గొప్ప మార్పునకు నాంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ లిటరసీ పెరుగుతోంది. విద్యార్థులు స్మార్ట్‌ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు పంపాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నాం. – జీవీఆర్‌ శ్రీనివాసరావు, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వరం..
ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌ ఇంటర్న్‌షిప్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వరం లాంటిది. కోర్సు చేస్తూనే ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించారు. ఒక్కో ఇంజినీరింగ్‌ విద్యార్థికి ఆసక్తి గల సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశంతో పాటు ఇంజినీరింగ్‌ కళాశాలకు సమీపంలోని ఉన్నత పాఠశాలకు కేటాయించాం. విద్యార్థులకు పర్యవేక్షణతో పాటు మార్గదర్శకత్వం ఎప్పటికపుడు చేస్తున్నాం.  – డాక్టర్‌ మాధవి, ఫ్యూచర్‌ స్కిల్‌ కోఆర్డినేటర్‌, జేఎన్‌టీయూ

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్రెడిట్లు.. 
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫ్యూచర్‌ స్కిల్‌ ప్రోగ్రాంకు సంబంధించి 785 మంది విద్యార్థులను ఎంపిక చేశాం. నెలకు రూ.12 వేల స్టైఫండ్‌తో పాటు వారికి ఇంజినీరింగ్‌ డిగ్రీలో క్రెడిట్స్‌ కూడా కలుపుతాం. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్‌ ప్రోగ్రాంకు ఎంపిక చేశాం. ఇంటర్న్‌షిప్‌కు స్టైఫండ్‌ కల్పి స్తూ ఉన్నత పాఠశాలలో సాంకేతిక విద్యను అందించే బృహత్తర పథకాన్ని అమలు చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గర్వకారణం.  – సి.శశిధర్‌, రిజిస్ట్రార్‌, జేఎన్‌టీయూ అనంతపురం

Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’.. ఒక్కొక్కరికి రూ.10 వేలు..

Published date : 05 Feb 2024 09:04AM

Photo Stories