UPSC Exams: ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో కటాఫ్ ఎంత ఉంటుంది.. మెయిన్‌లో విజయం సాధించాలంటే..
యూపీఎస్సీ.. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర 19 కేంద్ర సర్వీసుల్లోకి అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే రెండో దశ పరీక్ష! తొలిదశ ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇటీవలే సివిల్స్ ప్రిలిమ్స్–2021 పరీక్ష జరిగింది. ఈ ఏడాది ప్రిలిమ్స్‌లో కటాఫ్ ఎంత ఉంటుంది.. ఎన్ని మార్కులు వస్తాయనుకుంటే మెయిన్‌కు సన్నద్ధత ప్రారంభించొచ్చు.. మెయిన్‌లో విజయం సాధించాలంటే.. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి?! ఇలా అభ్యర్థుల్లో అనేక సందేహాలు!! ఈ నేపథ్యంలో.. ప్రిలిమ్స్ విశ్లేషణతోపాటు మెయిన్‌లో విజయానికి నిపుణుల సలహాలు...
- ముగిసిన సివిల్స్ ప్రిలిమ్స్ 2021 పరీక్ష
- ప్రిలిమ్స్ కటాఫ్ 93–98 మధ్య ఉండే అవకాశం
- జనవరి 7, 2022 నుంచి మెయిన్ పరీక్షలు
- ఇప్పటి నుంచే మెయిన్‌పై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు
సివిల్స్ ప్రిలిమ్స్‌లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సొంతం చేసుకుంటే.. మెయిన్ రాసేందుకు అనుమతి లభిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 10న సివిల్స్ ప్రిలిమ్స్–2021 నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆరున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 42వేల మంది పరీక్ష రాసినట్లు అంచనా. ఇప్పుడు వీరంతా ప్రిలిమ్స్‌లో తమకు ఎన్ని మార్కులు వస్తాయి.. మెయిన్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ప్రిలిమ్స్ క్లిష్టమే
నిపుణుల అభిప్రాయం ప్రకారం–ఈ సంవత్సరం సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష.. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే కాస్త క్లిష్టంగానే ఉంది. ముఖ్యంగా 100 ప్రశ్నలు–200 మార్కులకు జరిగిన జనరల్ స్టడీస్ పేపర్–1లో దాదాపు 35 ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఇవన్నీ.. ప్రాచీన, మధ్యయుగ చరిత్ర, పర్యావరణ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు. ఈ మూడు విభాగాల నుంచి మొత్తం 37 ప్రశ్నలు అడిగారు. దాంతో అభ్యర్థులు పరీక్షను క్లిష్టంగా భావించారు. పాలిటీ, ఎకానమీల నుంచి ప్రశ్నలు సులభంగా రావడం కొంత ఉపశమనంగా చెప్పొచ్చు.
అప్లికేషన్ అప్రోచ్
ప్రిలిమ్స్ పేపర్ 1లో అన్ని విభాగాల్లోనూ ఆయా సబ్జెక్ట్ కాన్సెప్ట్‌లతోపాటు అప్లికేషన్ అప్రోచ్‌ను పరిశీలించేలా ప్రశ్నలు అడిగారు. దాంతో బేసిక్స్‌పై స్పష్టత, సమకాలీన అంశాలు, నిజ జీవితంలో వాటి ప్రాధాన్యంపై అవగాహన కలిగిన అభ్యర్థులు మాత్రమే సరైన సమాధానాలు ఇచ్చే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివి, అవగాహన చేసుకున్న వారు సరైన సమాధానాలు గుర్తించడంలో ముందుంటారని చెబుతున్నారు.
చదవండి: Daily Current Affairs in Telugu
కరెంట్ అఫైర్స్
గత కొన్నేళ్లుగా కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు నేరుగా అడగటం లేదు. కాని ఈసారి దానికి భిన్నంగా డైరెక్ట్ కొశ్చన్స్ అడిగారు. దాదాపు 8 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, జీకేల నుంచి వచ్చాయి. అందులో మూడు ప్రశ్నలు స్పోర్ట్స్ నుంచే ఉండటం విశేషం.
సీశాట్ కూడా క్లిష్టంగానే
ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్–2(సీశాట్) కూడా క్లిష్టంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. ముఖ్యంగా.. అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాల ప్రశ్నలు మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ నేపథ్యమున్న అభ్యర్థులే సమాధానాలు ఇవ్వగలిగేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పేపర్‌కు అర్హత మార్కులుగా నిర్దేశించిన 33 శాతం మార్కులను పొందడం పెద్ద కష్టం కాదని పలువురు పేర్కొంటున్నారు.
కటాఫ్ 93–98
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఈసారి కటాఫ్ 93 నుంచి 98 మధ్య ఉంటుందని నిపుణుల అంచనా. వాస్తవానికి గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం పోస్ట్‌ల సంఖ్య తక్కువగా ఉంది. గతేడాది 796 పోస్ట్‌లకు సివిల్స్ పరీక్ష నిర్వహించగా.. ఈసారి ప్రకటించిన పోస్టుల సంఖ్య 712 మాత్రమే! ఈ ఏడాది అభ్యర్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం, ప్రశ్నల సరళిని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రిలిమ్స్ కటాఫ్ గతేడాది మాదిరిగానే 93 నుంచి 98 మధ్యలో ఉంటుందని పేర్కొంటున్నారు. సమాధానాలు సరి చూసుకొని.. ఈ మార్కుల శ్రేణిలో ఉన్న అభ్యర్థులు.. మెయిన్‌కు ప్రిపరేషన్ ప్రారంభించొచ్చని చెబుతున్నారు.
చదవండి: ఇంటర్వూ సభ్యులు అభ్యర్థిల్లో ముఖ్యంగా పరీక్షించేవి ఇవే..
ప్రిలిమ్స్–2021 విభాగాల వారీగా అడిగిన ప్రశ్నలు
సబ్జెక్ట్ | ప్రశ్నలు | క్లిష్టత స్థాయి |
పాలిటీ | 14 | మోస్తరు క్లిష్టత |
ఎకానమీ | 15 | సులభం |
సైన్స్ | 13 | ఓ మోస్తరు క్లిష్టత |
హిస్టరీ | 20 | క్లిష్టం |
జాగ్రఫీ | 13 | క్లిష్టం |
పర్యావరణం | 17 | క్లిష్టం |
కరెంట్ అఫైర్స్ | 8 | సులభం |
ప్రిలిమ్స్.. గత మూడేళ్ల కటాఫ్స్ ఇలా..
కేటగిరీ | 2020 | 2019 | 2018 |
జనరల్ | 92.51 | 98 | 98 |
ఈడబ్ల్యూఎస్ | 77.55 | 90 | – |
ఓబీసీ | 89.12 | 95.34 | 96.66 |
ఎస్‌సీ | 74.84 | 82 | 84 |
ఎస్‌టీ | 68.71 | 77.34 | 83.34 |
మెయిన్ పరీక్ష ఇలా
సివిల్స్ మెయిన్ పరీక్షలు జనవరి 7వ తేదీ నుంచి అయిదు రోజులపాటు జరుగనున్నాయి. మెయిన్ పరీక్షలో ఏడు తప్పనిసరి పేపర్లు ఉంటాయి. ఒక్కోపేపర్ 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులకు మెయిన్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి అంతిమంగా 275 మార్కులకు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్) ఉంటుంది. మెయిన్‌లో ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం మూడు గంటలు. మెయిన్ పరీక్షలో ఏడు తప్పనిసరి పేపర్లతోపాటు రెండు క్వాలిఫైయింగ్ సబ్జెక్టులు ఉంటాయి. అవి..పేపర్–1, 300 మార్కులు–ఏదైనా భారతీయ భాష, పేపర్–2, 300 మార్కులు–ఇంగ్లిష్. 1750 మార్కులకు జరిగే మెయిన్ పరీక్షలో వేయి మార్కులు సాధించేలా ప్రిపరేషన్ సాగిస్తే.. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
చదవండి: ఆప్షనల్ సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు చదివేలా ప్రణాళిక చేసుకుంటే..!
పేపర్ 1–జనరల్ ఎస్సే
జనరల్ ఎస్సేకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఇందులో అడిగేందుకు అవకాశమున్న టాపిక్స్‌ను గుర్తించాలి. సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా ప్రభావాలు,వ్యాక్సినేషన్ విధానాలు, పర్యావరణ అంశాలు, జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన వాటిని అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఆ తర్వాత విశ్లేషణాత్మకంగా రాయగలిగే నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. అందుకు రైటింగ్ ప్రాక్టీస్ ఎంతో దోహదపడుతుంది.
పేపర్–2 జనరల్ స్టడీస్–1
- ఈ పేపర్ సిలబస్‌లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ అంశాలు ఉన్నాయి.
- ఇందులో హిస్టరీకి సంబంధించి సంగీతం, సాహిత్యం,నాట్యం, వాస్తు–శిల్పకళ, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అనుసంధానిస్తూ చదవాలి.
- 18వ శతాబ్దం మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల్ని పరిశీలించాలి. స్వాతంత్య్ర ఉద్యమం గురించి ప్రత్యేకంగా చదవాలి. అదే విధంగా రాజ్యాంగం, పంచవర్ష ప్రణాళికలు, భూ సంస్కరణలు, నెహ్రూ విదేశాంగ విధానం, అలీనోద్యమం, హరిత విప్లవం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
- ప్రపంచ చరిత్రకు సంబంధించి.. పారిశ్రామిక విప్లవం,ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్య్ర ఉద్యమాల గురించి ప్రధానంగా చదవాలి.
- భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, తుపానులు తదితరాల గురించి శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే సహజ వనరుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
చదవండి: సివిల్స్ 2021 మెయిన్ ఎగ్జామినేషన్‌లో వీటి ఎంపికలో అప్రమత్తత ఎంతో అవసరం.. వివరాలు తెలుసుకోండిలా..!
పేపర్–3 జనరల్ స్టడీస్–2
- ఈ పేపర్ సిలబస్.. ప్రజా పాలన, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాల సమ్మేళనంగా ఉంది. భారత రాజ్యాంగం గురించి చదివే క్రమంలో.. 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి ప్రారంభించి 1947 భారత స్వాతంత్య్ర చట్టం వరకు అధ్యయనం చేయాలి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
- రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసులను పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థలోని అర్ధ సమాఖ్య స్వభావంపై దృష్టిపెట్టాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ పథకాల ఉద్దేశం, లక్ష్యం, ఫలితాలను అధ్యయనం చేయాలి.
పేపర్ 4 జనరల్ స్టడీస్–3
ఈ పేపర్ సిలబస్‌లో టెక్నాలజీ; ఆర్థికాభివృద్ధి; బయో డైవర్సిటీ; ఎన్విరాన్‌మెంట్; సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంశాలున్నాయి. ప్రణాళికా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను క్షణ్నంగా చదవాలి. భారత్‌లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్ తీరుతెన్నులతోపాటు స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రగతి, దైనందిన జీవితంలో దాని అనువర్తనాలపై దృష్టిపెట్టాలి.
పేపర్ 5 జనరల్ స్టడీస్–4
ఈ పేపర్ సిలబస్‌లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, అప్టిట్యూడ్ టాపిక్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాలన(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)కు సంబంధించినవి కాగా మరికొన్ని ఫిలాసఫీ, సైకాలజీకి చెందినవి. పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యకతకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో విలువలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్ ఎథిక్స్(అనువర్తిత నైతిక శాస్త్రం)పై దృష్టిపెట్టాలి. ప్రధానంగా ‘పబ్లిక్ సర్వీస్‌లో ఎథిక్స్’కు సంబంధించిన అంశాలను బాగా చదవాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు, విధుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత, నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. మతం–నైతికత, వర్ణ వ్యవస్థ–నైతికత, కుటుంబం–నైతికత.. ఇలా వివిధ సామాజిక అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి. నైతిక విలువలు పెంపొందించడంలో కుటుంబం, సమాజం, విద్యాసంస్థల పాత్ర గురించి తెలుసుకోవాలి. దాంతోపాటు లక్ష్య సాధనలో, విధి నిర్వహణలో ఎంతో కీలకంగా నిలిచే వైఖరి(అటిట్యూడ్) అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేయడం లాభిస్తుంది.
చదవండి: ఈ ప్రిపరేషన్ టిప్స్‌తో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ప్రిలిమ్స్‌లో విజయం సాధించొచ్చు..!
ఆప్షనల్.. రెండు పేపర్లు ఇలా
ఆప్షనల్ సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు పేపర్లు(పేపర్ 6, పేపర్ 7) రాయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ తదితర ఆప్షనల్స్.. జనరల్ స్టడీస్‌కు కలిసొచ్చే విధంగా ఉన్నాయి. ఆప్షనల్ ఏదైనా సరే వాటిని ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి. ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై మరింత ఫోకస్ పెట్టాలి. గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా ప్రశ్నలకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి.
విషయ అవగాహన, భావవ్యక్తీకరణ
సివిల్స్ మెయిన్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విషయ అవగాహనపై పట్టు పెంచుకోవాలి. ఆయా సిలబస్ అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. నిరంతరం తాము చదివిన అంశాలకు సంబంధించి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈసారి ప్రిలిమ్స్ కటాఫ్ కూడా దాదాపు గతేడాది మాదిరిగానే ఉండొచ్చు. కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది.
వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ ఐఏఎస్ అకాడమీ.
చదవండి: