సివిల్స్ 2021 మెయిన్ ఎగ్జామినేషన్‌లో వీటి ఎంపికలో అప్రమత్తత ఎంతో అవసరం.. వివరాలు తెలుసుకోండిలా..!
ఇందులో అభ్యర్థులు ఒక సబ్జెక్ట్(రెండు పేపర్లు)ను ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్ ఎంపిక అభ్యర్థుల విజయంలో ఎంతో కీలకంగా మారుతోంది. దీంతో.. ఏ ఆప్షనల్ ఎంచుకుంటే బాగుంటుంది? ఏ సబ్జెక్ట్ స్కోరింగ్ అనే సందేహాలు! సివిల్స్–2021కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా.. ఆప్షనల్స్ ఎంపికపై నిపుణుల సలహాలు, సూచనలు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. సంప్రదాయ డిగ్రీ అభ్యర్థుల నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ ఉత్తీర్ణుల వరకూ.. ఉన్నత విద్యావంతులెందరో పోటీ పడుతున్న పరీక్ష. మూడంచెల(ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వూ్య) సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. రెండో దశ మెయిన్ అత్యంత కీలకం. ఇందులో ఆప్షనల్ సబ్జెక్ట్ మరింత నిర్ణయాత్మకం. దాంతో ఆప్షనల్ ఎంపిక అభ్యర్థులకు సవాలుగా మారుతోంది. సివిల్స్ అభ్యర్థులు..ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రారంభించే సమయానికే మెయిన్‌లోని ఆప్షనల్ ఎంపికపై పూర్తి స్పష్టతకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
26 ఆప్షనల్ సబ్జెక్ట్‌లు..
ప్రస్తుతం సివిల్స్ మెయిన్ పరీక్ష విధానం ప్రకారం–భాషా సాహిత్యం సహా 26 ఆప్షనల్ సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్స్, టెక్నాలజీ, మెడికల్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్ తదితర విభాగాలకు సంబంధించిన వీటిల్లో ఏదో ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకున్న ఆఫ్షనల్‌పై రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఆసక్తి, నేపథ్యం..
ఆప్షనల్ ఎంపికలో ముందుగా ఆసక్తి, అకడమిక్ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సివిల్స్ అభ్యర్థుల్లో కొన్ని క్రేజీ ఆప్షనల్స్, కొన్ని స్కోరింగ్ ఆప్షనల్స్ అనే అభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, జాగ్రఫీ వంటి సబ్జెక్ట్‌లను స్కోరింగ్ ఆప్షనల్స్‌గా, పాపులర్ ఆప్షనల్స్‌గా పేర్కొంటున్నారు.