Skip to main content

ఈ ప్రిపరేషన్‌ టిప్స్‌తో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో విజయం సాధించొచ్చు..!

సివిల్స్‌ 2021 నోటిఫికేషన్‌ వెలువడింది. దరఖాస్తు గడువు కూడా ముగిసింది. నోటిఫికేషన్‌ విడుదల కాస్త ఆలస్యమైనప్పటికీ.. క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారమే జూన్‌ 27వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగనుంది.

అంటే.. దాదాపు 75 రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో పరీక్షార్థులు ప్రిపరేషన్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో పరీక్ష రాసిన వారికి ప్రిలిమ్స్‌ తీరుతెన్నులు, పరీక్ష వ్యూహాలపై తమదైన ప్రణాళిక ఉంటుంది. కానీ, మొదటిసారి ప్రిలిమ్స్‌కు హాజరుకానున్న అభ్యర్థులు కొంత ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రిలిమ్స్‌ రాయబోతున్న అభ్యర్థులు ఎలాంటి ప్రిపరేషన్‌ వ్యూహాలను అనుసరించాలో తెలుసుకుందాం..

పేపర్‌ 1 కీలకం..
మూడు దశలుగా నిర్వహించే సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్‌ ఓ వడపోత పరీక్ష. ప్రిలిమ్స్‌ రెండు పేపర్లుగా ఉంటుంది. ఇందులో పేపర్‌ 1 కీలకమైంది. ఈ పేపర్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. పేపర్‌ 2 (సీశాట్‌)..అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో 33శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ప్రశ్నపత్రాలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.

పరీక్ష స్వరూపం..

పేపర్‌

ప్రశ్నలు

మార్కులు

సమయం

జనరల్‌ స్టడీస్‌–పేపర్‌ 1 200 200 2 గంటలు
జనరల్‌ స్టడీస్‌–పేపర్‌ 2 200 200 2 గంటలు

పేపర్‌ 1– సిలబస్‌
పేపర్‌1 సిలబస్‌లో 7 ప్రధాన అంశాలను పేర్కొన్నారు. అవి..

  • జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలు
  • భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం
  • భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం: భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక అంశాలు.
  • భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన–రాజ్యాంగం, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కులు–సమస్యలు.
  • ఆర్థిక, సామాజిక, సుస్థిర– అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బ ణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు..
  • పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు– సాధారణ అంశాలు. 

జనరల్‌ సైన్సు.. పేపర్‌ 2 సిలబస్‌..

  • పేపర్‌–2 సిలబస్‌లో 6 అంశాలను కీలకంగా పేర్కొన్నారు. అవి..కాంప్రహెన్షన్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌(కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌.
  • సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫ్యాక్చువల్‌ డేటా, అప్లికేషన్ల కలయికగా ఉంటుంది. అభ్యర్థులు సిలబస్‌ను స్టాటిక్, డైనమిక్‌ భాగాలుగా విభజించుకోవాలి. ముందుగా స్టాటిక్‌ పార్ట్‌ ప్రిపరేషన్‌ను పూర్తిచే సి తర్వాత.. డైనమిక్‌ పార్ట్‌పై అధిక సమయం వెచ్చించాలి.

తొలి ప్రయత్నం..
సివిల్స్‌.. దేశంలో అత్యంత కష్టమైన పరీక్షగా చాలామంది భావిస్తారు. అంతేకాదు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించడం కష్టం అనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది. సివిల్స్‌లో విజయం సాధించాలంటే అంకితభావం, నిబద్ధతతో కూడిన ప్రిపరేషన్‌ అవసరం అంటున్నారు నిపుణులు. పరీక్షకు హాజరయ్యే వారంతా ఫస్ట్‌ అటెంప్ట్‌ ఈజ్‌ బెస్ట్‌ అటెంప్ట్‌ అనుకొని ప్రిపరేషన్‌ సాగించాలని సూచిస్తున్నారు. సివిల్స్‌ ప్రిపరేషన్‌ తొలిరోజు నుంచి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలి. సిలబస్‌లో ప్రతి అంశాన్ని క్షణ్నంగా చదవాలి. అలా చదివిన అంశాలను అన్వయించే సామర్థ్యాలుంటే.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించొచ్చు.

ఎంత సేపు చదవాలి..
తొలిసారి ప్రిలిమ్స్‌కు హాజరవుతున్నాం..రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. తొలిసారి హాజరయ్యే వారు కచ్చితంగా ఇన్ని గంటలు చదవాలనేం లేదు. ప్రిపరేషన్‌ అనేది పూర్తిగా అభ్యర్థి సంకల్పం, పఠన సామర్థ్యం, సంగ్రాహణా శక్తి, అన్వయ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని గుర్తించాలి. పరీక్షకు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు ప్రిపేరయ్యామనే దానికంటే..ఎంత బాగా గ్రహించాం అనేది ముఖ్యం. పరీక్ష రోజు చూపే ఏకాగ్రత, ప్రతిభ సైతం విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి విద్యార్థులు తమ స్వీయ సామర్థ్యాలను అవగాహన చేసుకొని ప్రిపరేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలి.

ప్రేరణ, స్ఫూర్తి..
పరీక్షేదైనా ప్రేరణ, స్ఫూర్తి ప్రిపరేషన్‌కు ఇంధనంగా పనిచేస్తాయి. ముఖ్యంగా తొలి ప్రయత్నంలోనే విజయం వరించాలంటే.. లక్ష్యం దిశగా బలమైన ప్రేరణ తప్పనిసరి. ఆశయాన్ని నిత్యం గుర్తుచేసుకుంటూ ప్రేరణ పొందాలి. ఆలోచనల్లో పరిణితి, ప్రిపరేషన్‌లో సమగ్రత కలిగిన అభ్య ర్థులు తొలి ప్రయత్నంలో విజయం సాధించగలరు. సివిల్స్‌ అభ్యర్థులకు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై నిర్దిష్ట అభిప్రాయాలు ఉండాలి. వీటితోపాటు క్రమశిక్షణ, చక్కటి తెలివితేటలు తప్పనిసరి. సరైన ప్రిపరేషన్‌ ప్రణాళికను అనుసరిస్తే తొలి ప్రయత్నంలోనే విజయం వరిస్తుంది.

కోచింగ్‌ అవసరమా?
గత టాపర్‌ల అనుభవాలను పరిశీలిస్తే.. తొలిసారి సివిల్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు కోచింగ్‌ తీసుకోకుండా కూడా.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్‌లోనూ సక్సెస్‌ సాధించొచ్చు అని చెప్పొచ్చు. కోచింగ్‌ తీసుకోవడం వల్ల అభ్యర్థులకు పరీక్షకు అవసరమైన నిపుణుల గైడెన్స్‌ లభిస్తుంది. ఎలాంటి బుక్స్‌ చదవాలి,ఏ టాపిక్స్‌పై ఫోకస్‌ పెట్టాలో తెలుస్తుంది. సివిల్స్‌కు ప్రిపేరవడమనేది..ఫుల్‌ టైమ్‌ జాబ్‌ వంటిది. రోజుకు కనీసం 8 గంటలు చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సొంతం చేసుకోవచ్చు. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో పత్రికా పఠనం కీలక భూమిక పోషిస్తుంది. ప్రామాణిక ఇంగ్లిష్, తెలుగు న్యూస్‌ పేపర్‌లను ప్రతిరోజూ చదవడంతోపాటు కీలక అంశాలను నోట్‌ చేసుకోవడం చేయాలి.

కరెంట్‌ అఫైర్స్‌..
గత సంవత్సరం కాలంగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాల గురించి లోతుగా అధ్యయనం చేయాలి. సివిల్స్‌ అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ కోసం దినపత్రికలను నిర్మాణాత్మక కోణంలో చదవాలి. అలాకాకుండా పేపర్‌ మొత్తం చదవడం వల్ల ఉపయోగం లేకపోగా సమయం వృథా అవుతుంది. ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉన్న అంశాలనే చదివి నోట్స్‌ రాసుకోవాలి. పరీక్షలో కీలక విభాగాలైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనామిక్స్‌లో అడిగే ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్‌ పరంగా వార్తా పత్రికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌లో స్టాటిక్‌ పార్ట్‌ కంటే ఫ్యాక్చువల్‌ డేటా సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు.

టెస్టు సిరీస్‌లు..
ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌లో టెస్టు సిరీస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం 30–40 టెస్టు సిరీస్‌లకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీంతోపాటు స్వీయ పరీక్ష విధానాన్ని అనుసరించాలి. తద్వారా స్వీయ సామర్థ్యం, ప్రశ్నల తీరుపై అవగాహన లభిస్తుంది. టెస్టు సిరీస్‌ వివరణల్లోని కొత్త అంశాలను నోట్‌ చేసుకొని అధ్యయనం చేయాలి. తద్వారా ప్రిపరేషన్‌ మెరుగవడంతోపాటు ప్రశ్నలు ఏవిధంగా అడిగినా గందరగోళానికి గురికాకుండా ఉంటారు.

ఆష్షనల్‌ ఎంపిక..

  • సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియలో ఆప్షనల్‌ ఎంపిక కీలకమైంది. ఆప్షనల్‌లో 300కు పైగా స్కోరు చేస్తే.. టాప్‌ 10లో స్థానం దక్కించుకోవచ్చు.అదే సమయంలో పేలవ మార్కులు పొందితే ఇంటర్వూ్య చేజారుతుంది. మొత్తం 2025 మార్కులకు జరిగే సివిల్స్‌లో ఆప్షనల్‌ పేపర్లకు 500 మార్కులు కేటాయించారు. అంటే.. దీని వెయిటేజీ 24.6 శాతం. కాబట్టి ఆప్షనల్‌ ఎంపికలో అభ్యర్థులు ఆచితూచి వ్యవహరించాలి.
  • ఆప్షనల్‌ ఎంపికలో అపోహలను పక్కన పెట్టాలి. ఫలానా సబ్జెక్టు తీసుకుంటే ఎక్కువ మార్కులొస్తాయి అని చెబుతుంటారు. వాస్తవానికి అభ్యర్థి తనకు ఆసక్తి గల, ఇష్టమైన సబ్జెక్టును, తాను న్యాయం చేయగలను అనే సబ్జెక్టును మాత్రమే ఆప్షనల్‌గా ఎంచుకుంటే ఫలితం సానుకూలంగా ఉంటుంది.

ఆప్షనల్‌ ఎంపికలో పరిశీలించాల్సిన అంశాలు:

  • సదరు సబ్జెక్టుపై పట్టు/పరిజ్ఞానం
  • సబ్జెక్టుపై ఆసక్తి, ఇష్టం
  • మెటీరియల్‌ లభ్యత, కోచింగ్‌ అందుబాటు
  • స్కోరింగ్‌ నేచర్‌ ఆఫ్‌ ది సబ్జెక్టు
  • జీఎస్‌ సిలబస్‌లో మిళితమైన అంశాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని.. ఆఫ్షనల్‌ను ఎంపిక చేసుకోవాలి.

ప్రిపరేషన్‌ టిప్స్‌..

  • 6 నుంచి 12 తరగతుల ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
  • పత్రికల్లో వచ్చే ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవాలి. తద్వారా జనరల్‌ అవేర్‌నెస్‌ను పెంచుకోవాలి.
  • న్యూస్‌ చానెల్స్‌లో వచ్చే అర్థవంతమైన చర్చలను వీక్షించాలి. ఈ దిశగా డీడీ, బీబీసీ, సీఎన్‌ఎన్, రాజ్యసభ ఛానెల్స్‌ను అనుసరించాలి.
  • సివిల్స్‌ మొత్తాన్ని ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌తో చూడాలి. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వూ్యలకు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించాలి.
  • ముందుగా ప్రిలిమ్స్‌ను క్లియర్‌ చేస్తా... తర్వాత మెయిన్‌ గురించి ఆలోచిస్తా అనే దృక్ఫథాన్ని వీడాలి.

పరిగణనలోకి తీసుకోవాల్సిన పుస్తకాలు..
తొలిసారి ప్రిలిమ్స్‌కు హాజరుకాబోతున్న అభ్యర్థులు ప్రమాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. సివిల్స్‌లో టాప్‌లో నిలిచిన అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే.. ప్రిలిమ్స్‌కు కింది పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు.
చరిత్ర:

  • బిపిన్‌ చంద్ర–ఆధునిక భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం
  • ఆర్‌.ఎస్‌.శర్మ–ఇండియాస్‌ ఏషియంట్‌ పాస్ట్‌
  • సతీష్‌ చంద్ర–ఎ హిస్టరీ ఆఫ్‌ మిడీవల్‌ ఇండియా పుస్తకాలను అనుసరించొచ్చు.

కళలు, సంస్కృతి:
ఏఎల్‌ భాషమ్‌– ది వండర్‌ దట్‌ వాజ్‌ ఇండియా, నితిన్‌ సింఘానియా– ఇండియన్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌.

ఇండియన్‌ జాగ్రఫీ:
మాజిద్‌ హుస్సేన్, టీఎంహెచ్‌ పబ్లిషింగ్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ అట్లాస్, గో చెంగ్‌ లియాంగ్‌ సర్టిఫికెట్‌ ఫిజికల్‌ అండ్‌ హ్యూమన్‌ జియోగ్రఫీ, డీఆర్‌ ఖుల్లర్‌– ఇండియా అండ్‌ వరల్డ్‌ జాగ్రఫీ(ఆబ్జెక్టివ్‌ క్వశ్చన్స్‌ విత్‌ ఎక్స్‌ప్లనేషన్స్‌).

పాలిటీ:

  • ఎం.లక్ష్మీకాంత్‌– ఇండియన్‌ పాలిటీ
  • డీడీ బసు– ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా
  • అరిహంత్‌ పబ్లికేషన్స్‌–ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్
  • ఎన్‌డీ అరోరా,యాక్సెస్‌ పబ్లిషింగ్‌ ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్, నేషనల్‌ మూవ్‌మెంట్‌.

ఇండియన్‌ ఎకానమీ:
రమేష్‌ సింగ్‌–ఇండియన్‌ ఎకానమీ, సంజీవ్‌వర్మ– ది ఇండియన్‌ ఎకానమీ, ఉమా కపిల– ఇండియన్‌ ఎకానమీ(పెర్ఫార్మెన్స్‌ అండ్‌ పాలసీస్‌).

ఎన్విరాన్‌మెంట్‌:
డీఆర్‌ ఖుల్లర్‌–ఎన్విరాన్‌మెంట్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ అండ్‌ మెయిన్స్, అదర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ పేపర్‌ బుక్, ఆర్‌.రాజగోపాలన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (ఫ్రమ్‌ క్రైసిస్‌ టు క్యూర్‌).

Published date : 12 Apr 2021 12:58PM

Photo Stories