Skip to main content

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు చదివేలా ప్రణాళిక చేసుకుంటే..!

మెయిన్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను పరీక్షకు ముందు నెలరోజుల్లోపు కనీసం రెండుసార్లు పూర్తిగా చదివే విధంగా ప్రణాళిక రచించుకోవాలి. దీనికి అనుగుణంగా సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి.

కొన్ని సబ్జెక్ట్‌ల నిడివి విస్తృతంగా ఉంటుంది. వీటిని ఒక్కసారి పూర్తి చేయడం కూడా కష్టమేనని భావిస్తుంటారు. మరికొన్ని సబ్జెక్ట్‌ల నిడివి తక్కువగా ఉండి..ఒకటికి రెండుసార్లు చదివే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆప్షనల్‌ను ఎంపిక చేసుకోవడం మేలు అనేది నిపుణుల అభిప్రాయం.

టెక్‌ అభ్యర్థులు..
ఇటీవల కాలంలో సివిల్స్‌ విజేతల్లో 40 నుంచి 50 శాతం వరకూ టెక్నికల్‌ అభ్యర్థులే ఉంటున్నారు. వీరిలో అధిక శాతం మంది ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. విశ్లేషణాత్మక దృక్పథం, అన్వయ సామర్థ్యంతో టెక్నికల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న ఈ అభ్యర్థులు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్‌లను సులువుగా ఆకళింపు చేసుకోగలుగుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. డొమైన్‌ సబ్జెక్ట్‌లు ఆప్షనల్‌గా ఎంచుకుని విజయం సాధించిన వారి సంఖ్య పది నుంచి పదిహేను శాతం మధ్యలోనే ఉంటోంది. సదరు సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలో అడిగే ప్రశ్నల తీరుపై అవగాహన పొందడం కొంత క్లిష్టంగా మారడం, గైడెన్స్‌ సరిగా లభించకపోవడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

ట్రెండ్‌ మారుతోంది..

  • గత మూడు, నాలుగేళ్ల ఫలితాలను చూస్తే.. సివిల్స్‌ ఆప్షనల్‌ ఎంపికలో ట్రెండ్‌ మారుతున్నట్లు స్పష్టమవుతోంది.
  • ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ తర్వాతి స్థానాల్లో మెడికల్‌ సైన్స్, సైన్స్, ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకునే వారి సంఖ్య సైతం పెరుగుతోంది.
  • దాదాపు ప్రతి ఆప్షనల్‌లోనూ సక్సెస్‌ రేటు సగటున పది శాతంగా నమోదవుతోంది.
  • ఇంజనీరింగ్‌ విద్యార్థులు సైతం ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్‌లను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుంటున్నారు.
  • తుది ఫలితాల్లో టెక్నికల్‌ అభ్యర్థుల సంఖ్య 45 నుంచి 50 శాతం వరకు నమోదవుతోంది.

సివిల్స్‌ మెయిన్‌.. ముఖ్యాంశాలు

  • ప్రిలిమినరీ నుంచి 1:12 లేదా 1:13 నిష్పత్తిలో మెయిన్‌కు అభ్యర్థుల ఎంపిక.
  • ఏడు పేపర్లలో 1,750 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌.
  • ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్లుగా పేపర్‌–6, పేపర్‌–7.
  • ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్లలో మొత్తం 500 మార్కులకు పరీక్ష.
  • సెప్టెంబర్‌ 17 నుంచి అయిదు రోజులపాటు సివిల్స్‌–2021 మెయిన్‌ ఎగ్జామినేషన్‌.

ఆసక్తితోపాటు ఇంకా ఎన్నో..
సివిల్స్‌ మెయిన్‌ ఆప్షనల్‌ ఎంపికలో అభ్యర్థులు ఆసక్తితోపాటు మరెన్నో అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముందుగా తమ ఆసక్తికి అనుగుణంగా సన్నద్ధత పొందేందుకు అందుబాటులో ఉన్న మెటీరియల్, గైడెన్స్‌ తదితర అంశాలను గుర్తించాలి. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. టెక్నికల్, సైన్స్‌ సబ్జెక్ట్‌లను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటే.. సదరు అభ్యర్థులు తమ అకడమిక్స్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం ఒక్కటే విజయానికి సాధనం.
– వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ

స్వీయ అభ్యసన సామర్థ్యం..
ఆప్షనల్‌ ఎంపికలో అభ్యర్థులు స్వీయ అభ్యసన సామర్థ్యాలను బేరీజు వేసుకోవాలి. దానికి అనుగుణంగా సొంతంగా పట్టు సాధించగలం అనే సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఫలితాల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్‌లదే పైచేయిగా నిలుస్తున్న మాట వాస్తవమే. వీటిని ఎంచుకునే అభ్యర్థులు పోటీ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. కేవలం ట్రెండ్‌కు అనుగుణంగా ఆప్షనల్‌ను ఎంపిక చేసుకుంటే.. ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తి లేకపోతే విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది.
– శ్రీరంగం శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌

Published date : 22 Apr 2021 04:31PM

Photo Stories