NEET 2024 Paper Leak : నీట్ ప్రశ్న పత్రం లీకేజీపై మండిపుడుతున్న విద్యా సంఘాలు.. ఎన్టీఏకు హెచ్చరిక!
అనంతపురం: వైద్య విద్య ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన నీట్ (ఉమ్మడి ప్రవేశ పరీక్ష)ను రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రశ్న పత్రాల లీకేజీని నిరసిస్తూ దేశ వ్యాప్త విద్యా సంస్థల బంద్‌లో భాగంగా గురువారం జిల్లాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. నగరంలోని వివిధ ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎనుమల నరేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వీరేంద్రప్రసాద్, ఏఐఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్‌యాదవ్, పీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అలాం, వీఎన్‌ఐవీ రాష్ట్ర కార్యదర్శి వినోద్‌కుమార్, ఏపీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సాయికుమార్ మాట్లాడారు.
Gurukulam Common Timetable: కామన్ టైమ్‌టేబుల్ ఉత్తర్వులను రద్దు చేయాలి
నీట్ నిర్వహణలో కొందరు విద్యార్థుల నుంచి రూ. 30 లక్షల చొప్పున వసూలు చేసి ప్రశ్న పత్రాలు లీక్ చేసినట్లుగా బహిరంగంగా చెబుతున్నా... సంబంధీకులపై చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్‌ను రద్దు చేయాలంటూ అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశాయన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Unemployment Rate In India: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ రేటు.. కేరళ, తెలంగాణలో అత్యధికంగా..
లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ను నిర్వహించిన ఎన్టీఏను రద్దు చేయకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రమణయ్య, ప్రతిభాభారతి, మంజునాథ్, ఉమామహేష్, వంశీ, హరికృష్ణ, సోము, నాని, ఓబులేసు, బాలకృష్ణ, పవన్, రారాజు, హరికృష్ణ పాల్గొన్నారు.
Department Test Schedule : వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు డిపార్ట్‌మెంట్ టెస్ట్‌కు షెడ్యూల్ విడుదల..