Skip to main content

Telangana High Court Orders : బ్రేకింగ్ న్యూస్‌.. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...ఇక‌పై ఈ విద్యార్థులు కూడా ఈ కోట‌లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాల‌కు సంబంధించి హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఇక‌పై స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
MBBS and BDS Seats

ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. 

స్థానిక కోటా కింద..
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సు ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించి సెప్టెంబ‌ర్ 5వ తేదీన‌ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ పలువురు విద్యార్థులు... ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం కొన్ని కార‌ణాల వ‌ల్ల మేము వేరే రాష్ట్రాల్లో చ‌ద‌వాల్సి వ‌చ్చింద‌ని... క‌నుక మ‌మ్మ‌ల్ని కూడా స్థానికులుగా ప‌రిగ‌ణించాలంటూ.. హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నేడు వాదనలు వినిపించారు. ధర్మాసనం ఈ విద్యార్థుల‌ను ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులుగా ప‌రిగ‌ణించాలంటూ.. తీర్పును వెల్లడించింది. అయితే ఈ విద్యార్థుల నుంచి నివాస ధృవీకరణ పత్రం తీసుకొని ప్ర‌వేశాలు కల్పించాల‌న్నారు. 

తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి..

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.మయూర్‌రెడ్డి, డి.వి.సీతారాంమూర్తి తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందన్నారు. ఇతర రాష్ట్రాలవారితోపాటు భారతీయ మూలాలున్న ప్రవాసులు ఇక్కడ 4 ఏళ్లు చదువుకుంటే 85 శాతం స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటారన్నారు. దీనివల్ల తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి నష్టం వాటిల్లుతుందన్నారు. స్థానిక కోటా ఇక్కడ నివాసం ఉన్నవాళ్లకే అడుగుతున్నామని, చదువుకున్నవారు అన్న దానిపై అడగడం లేదన్నారు. 

నిబంధనలు తీసుకువచ్చే అధికారం..

ఉద్యోగులు బదిలీ కావడం వంటి పరిస్థితుల్లోనూ.. అలాగే మెరుగైన విద్య కోసం.. ఇంటర్‌ మరో రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ విద్యార్థి స్థానికుడు కాదనడం సరికాదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం.. ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు అవకాశం నిరాకరించడం వివక్ష చూపడమేనన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చినట్లు తెలిపారు. నిబంధనలు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వారు పలు సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వాదనలను విన్న ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.

Published date : 05 Sep 2024 04:56PM

Photo Stories