Skip to main content

Unemployment Rate In India: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ రేటు.. కేరళ, తెలంగాణలో అత్యధికంగా..

Comparison of urban and rural unemployment rates  job loss impact on rural areas  Unemployment Rate In India  Rising unemployment trend in India  Monthly unemployment rates in India

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగిత శాతం క్రమక్ర­మంగా పెరుగుతోంది. గత మే నెలలో 6.3 శాతం ఉండగా, జూన్‌ నాటికి 9.2 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత శాతంగా అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో డిమాండ్‌ తగ్గడంతో అక్కడ పనులు చేసుకునేవా­రిలో నిరుద్యోగం పెరిగింది.అదే సమయంలో ఆర్థిక రంగం దిగజారడం, ఇతర అంశాల కారణంగా పట్టణాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 

⇒ గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగశాతం 6.3 ఉండగా, జూన్‌లో 9.3కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూస్తే...మే నెలలో 8.6 ఉండగా, జూన్‌ నాటికి 8.9 శాతానికి పెరిగింది. 
⇒ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రెండుచోట్లా మహిళల్లోనే నిరుద్యోగమనేది ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. 
⇒ దేశవ్యాప్తంగా మహిళల విషయానికొస్తే... పట్టణ ప్రాంతాల్లో 21.36, గ్రామీణ ప్రాంతాల్లో 17.1 శాతం నిరుద్యోగులు ఉన్నారు. 
⇒ పురుషుల విషయంలో నిరుద్యోగిత శాతం పట్టణ ప్రాంతాల్లో 8.9, గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతంగా ఉంది. 
⇒ 2023 జూన్‌లో నిరుగ్యోగ శాతం 8.5  ఉండగా, ఈ ఏడాది ఇదే సమయానికి 9.2 శాతానికి పెరిగింది. 
⇒ కన్జూమర్‌ పిరమిడ్స్‌ హోస్‌హోల్డ్‌ సర్వేలోని గణాంకాల ప్రాతిపదికగా సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఆయా వివరాలు వెల్లడించింది.

Good News For Government Employees 2024 : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..


జనవరి–మార్చి మధ్యలో 6.7 శాతం... పీఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో 6.7గా నిరుద్యోగశాతం ఉన్నట్టుగా  పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) పేర్కొంది. 2013లో 5.42 శాతమున్న నిరుద్యోగ శాతం, కరోనా పరిస్థితుల కారణంగా 2020లో 8 శాతానికి, ఆ తర్వాత 2021లో 5.98 శాతానికి తగ్గి, 2022లో 7.33 శాతానికి, 2023లో 8.4 శాతానికి, 2024లో తొలి ఆరునెలల్లో 6.7 శాతానికి (జూన్‌లో 9.2 శాతానికి) చేరుకున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


15–29 ఏజ్‌ గ్రూప్‌ నిరుద్యోగంలో మూడోప్లేస్‌ 
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక నిరుద్యోగ శాతమున్న రాష్ట్రంగా కేరళ నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఈ ఏజ్‌ గ్రూప్‌ నిరుద్యోగుల్లో టాప్‌ఫైవ్‌ రాష్ట్రాలు కేరళ 31.8 శాతం, జమ్మూ,కశ్మీర్‌ 28.2, తెలంగాణ 26.1, రాజస్థాన్‌న్‌ 24, ఒడిశాలో 23.3 శాతం ఉన్నట్టు వెల్లడైంది.

దేశవ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌లో మొత్తంగా నిరుద్యోగిత శాతం జనవరి–మార్చి మధ్యలో 17 శాతంగా (అంతకు ముందు అక్టోబర్‌–డిసెంబర్‌ల మధ్యలో పోల్చితే 16.5 శాతం నుంచి) ఉంది. ఇక ఏజ్‌ గ్రూపుల వారీగా చూస్తే (అన్ని వయసుల వారిలో నిరుద్యోగ శాతం) నిరుద్యోగిత శాతం 6.7 శాతంగా ఉంది.

నిరుద్యోగానికి ప్రధాన కారణాలు...
⇒ అధిక జనాభా
⇒ తక్కువ స్థాయిలో చదువు, నైపుణ్యాల కొరత (ఒకేషనల్‌ స్కిల్స్‌)
⇒ప్రైవేట్‌రంగ పెట్టుబడులు తగ్గిపోవడం
⇒వ్యవసాయరంగంలో తక్కువ ఉత్పాదకత 
⇒చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం కొరవడటం
⇒మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిరంగాల్లో పురోగతి సరిగ్గా లేకపోవడం
⇒అనియత రంగం (ఇన్ఫార్మల్‌ సెక్టార్‌) ఆధిపత్యం
⇒ కాలేజీల్లో చదివే చదువు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరం పెరగడం

మహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ ఫోర్త్‌ ప్లేస్‌
ఈ ఏడాది జనవరి–మార్చి నెలల మధ్యలో వివిధ వయసుల వారీగా నిరుద్యోగిత శాతంపై  మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేçషన్‌ (ఎంఎస్‌పీఐ) విడుదల చేసిన పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో ఇవి వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళల్లో అత్యధిక నిరుద్యోగుల శాతంలో తెలంగాణ 38.4 శాతంతో నాలుగో స్థానంలో నిలిచినట్టు ఈ సర్వే వెల్లడించింది. 

మహిళల్లో అత్యధికంగా నిరుద్యోగులు అంటే 48.6 శాతంతో జమ్మూ కశ్మీర్‌ మొదటిస్థానంలో నిలవగా...కేరళ 46.6 శాతంతో రెండోస్థానంలో, ఉత్తరాఖండ్‌ 39.4 శాతంతో మూడోస్థానంలో, హిమాచల్‌ప్రదేశ్‌ 35.9 శాతంతో ఐదో స్థానంలో నిలిచాయి. 

⇒ పురుషుల్లో అత్యధిక  నిరుద్యోగిత శాతమున్న రాష్ట్రంగా 24.3 శాతంతో కేరళ మొదటి స్థానంలో, బిహార్‌ 21.2 శాతంతో రెండోస్థానం, ఒడిశా, రాజస్తాన్‌లు 20.6 శాతంతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌ 19.6 శాతంతో నాలుగోస్థానంలో నిలిచాయి.

Skill Training Programme: ఐసీటీ కంపెనీతో కలిసి 48వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఇన్ఫోసిస్‌


ఏ అంశాల ప్రాతిపదికన...
⇒16 ఏళ్లు పైబడినవారు పరిగణనలోకి
⇒ నెలలో నాలుగువారాలపాటు పనిచేసేందుకు అందుబాటులో ఉండేవారు
⇒ఈ కాలంలో ఉపాధి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు
⇒ ఉపాధి కోల్పోయి మళ్లీ పనికోసం చురుగ్గా  వెతుకుతున్నవారు.

నిరుద్యోగుల శాతం లెక్కింపు ఇలా...
నిరుద్యోగిత శాతం = నిరుద్యోగుల సంఖ్య/ఉద్యోగులు, ఉపాధి పొందిన సంఖ్య + నిరుద్యోగుల సంఖ్య 

Published date : 05 Jul 2024 11:15AM

Photo Stories