Skip to main content

NEET UG counselling 2024: నీట్‌–యూజీ కౌన్సెలింగ్‌పై అయోమయం!.. ఇంతవరకు షెడ్యూల్‌ విడుదల చేయని ఎంసీసీ

Central Medical and Health Department Announcement   MBBS and BDS Admission Counseling Alert  Student Preparation for UG NEET Counseling  NEET UG counselling 2024  UG NEET-2024 Admission Counseling Schedule

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీ ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే యూజీ నీట్‌–2024 అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో తీవ్ర అయో మయం నెలకొంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మే 5వ తేదీన ఈ పరీక్షను నిర్వహించగా.. జూన్‌ 4వ తేదీన ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత గ్రేస్‌ మార్కుల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో ఆయా అభ్యర్థులకు తిరిగి జూన్‌ 23న పరీక్ష నిర్వహించారు.

ఆ తర్వాత జూన్‌ 30న ఎన్‌టీఏ తుది ఫలితాలను ప్రకటించింది. మరోవైపు జూలై 6వ తేదీ (శనివారం) నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ  ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులంతా కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యారు. కానీ ఇప్పటివరకు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) యూజీ నీట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కేంద్రం ప్రకటించిన తేదీ సమీపించినా షెడ్యూల్‌ జాడలేకపోవడంతో కౌన్సెలింగ్‌పై సందిగ్ధం నెలకొంది. మరోవైపు విద్యార్థుల్లో రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతోంది.

CM Revanth Reddy: త్వరలోనే జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామన్న సీఎం.. గ్రూప్‌–2 పరీక్షలపై కీలక అప్‌డేట్‌

తరగతుల ప్రారంభం మరింత జాప్యం..
యూజీ నీట్‌ పరీక్ష మే మొదటి వారంలోనే నిర్వహించడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ నెల మూడో వారం నాటికి ప్రారంభమవుతుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. కానీ ఫలితాల విడుదల.. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని జూలై 6వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. యూజీ నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తే అన్ని కేటగిరీల్లో సీట్ల భర్తీకి కనీసం నెలన్నర సమయం పడుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైతే ఆగస్టు మూడో వారం నాటికి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పటివరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వెలువడకపోవడంతో ఈ ఏడాది తరగతుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కోవిడ్‌–19 సమయంలో నీట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.

దీంతో 2020 ఏడాదిలో ప్రవేశాల ప్రక్రియ దాదాపు డిసెంబర్‌ వరకు సాగింది. ఆ అంతరాన్ని తొలగించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అప్పటినుంచి ఎంబీబీఎస్‌ విద్యార్థులకు సెలవులు తగ్గించడం.. తరగతుల నిర్వహణకు ఎక్కువ సమయం కేటాయించడం తదితర అంశాలతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది.

Latest Anganwadi news: కష్టాల్లో అంగన్‌వాడీలు ఇకపై ఈ కష్టాలు తప్పవ్‌..

మానసిక ఒత్తిడిలో నీట్‌ విద్యార్థులు
మరోవైపు యూజీ నీట్‌–2024 పరీక్షను మరోమారు నిర్వహించాలనే ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు వెలువడిన ఫలితాల ఆధారంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందా? లేక కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. 

ఈ అస్పష్టమైన పరిస్థితి విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి నీట్‌ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించినప్పటికీ ఆయా విద్యార్థులకు ర్యాంకులు లక్షల్లోకి ఎకబాకాయి. రాష్ట్రస్థాయి ర్యాంకులు వెలువడితే ఆమేరకు సీటు ఎక్కడ వస్తుందో అంచనా వేయొచ్చు. కానీ ఇప్పటివరకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వెలువడకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. సీటు రాకుంటే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. 

Published date : 06 Jul 2024 12:05PM

Photo Stories