Success Story: సొంత ప్రిపరేషన్‌తో రైల్వే టీసీగా ఎంపికైన రైతు బిడ్డ
కొమరోలు మండలం పోసుపల్లె గ్రామానికి చెందిన బొంత చిన్నకొండారెడ్డి, మహాలక్ష్మి దంపతులది పేద కుటుంబం. కష్టనష్టాలకోర్చి వ్యవసాయం చేస్తూనే తమ కుమారుడు తిరుపతిరెడ్డి డిగ్రీ వరకు చదివించారు.
బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పట్టా పొందిన తిరుపతిరెడ్డి రైల్వే ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. కోచింగ్ సెంటర్లకు వెళ్లేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటూ యూట్యూబ్‌ను వీడియోలు చూసి సొంతగా ప్రిపరేషన్ ప్రారంభించాడు.
ప్రభుత్వ వెబ్‌సైట్లు, యూట్యూబ్ వీడియోల నుంచి సంగ్రహించిన సమాచారంతో నోట్స్ తయారు చేసుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఎన్‌టీటీసీ–2019 నోటిఫికేషన్ విడుదల కాగా కమర్షియల్ కం టికెట్ క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆ పరీక్షను రైల్వే శాఖ 2021లో నిర్వహించగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. 2022లో మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూడసాగాడు.
తలుపుతట్టిన అదృష్టం..
రైల్వే శాఖ గ్రేడ్–4 ఉద్యోగాల ఎంపికకు నిర్వహించిన పరీక్షలో తిరుపతిరెడ్డి సత్తా చాటాడు. బుధవారం బెంగళూరులో గ్రేడ్–4 ఉద్యోగంలో చేరాల్సి ఉంది. మరికొద్ది నిమిషాల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్న తరుణంలో ఎన్‌టీటీసీ–2019 నోటిఫికేషన్‌కు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. కమర్షియల్ కం టికెట్ క్లర్క్ ఉద్యోగానికి ఎంపికై నట్లు తెలియగానే తిరుపతిరెడ్డి సంతోషానికి అవధుల్లేవు. దీంతో గ్రేడ్–4 ఉద్యోగంలో చేరకుండానే బెంగళూరు నుంచి స్వగ్రామమైన పోసుపల్లెకు తిరుగుప్రయాణం అయ్యాడు.
చదవండి: విద్యార్థులకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్... సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఒకటే చానల్.. ఒకటే లక్ష్యం
మాది పేద కుటుంబం. జాబ్ కోచింగ్‌కు వేల రూపాయలు ఖర్చు చేసే స్థోమత నా తల్లిదండ్రులకు లేదు. జాబ్ ప్రిపరేషన్‌కు సంబంధించి యూట్యూబ్‌లో చాలా చానల్స్ ఉన్నాయి. నేను వైఫై అనే చానల్‌ను ఫాలో అవుతూ సొంతగా నోట్స్ తయారు చేసుకున్నా. రోజూ 5 గంటలపాటు శిక్షణ పొందా. సెల్ఫ్ మోటివేషన్‌తో ప్రభుత్వం ఉద్యోగం పొందాలన్న నా కల సాకారమైంది.
– బొంత తిరుపతిరెడ్డి