Paytm layoffs: లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ.. కారణమిదే!
పేటీఎం పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా ప్రకటించింది. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు కొత్త కొలువులు వచ్చేలా కంపెనీ మద్దతు ఇస్తుందని చెప్పింది.
కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ మే నెలలో సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రారంభించారు. సంస్థ ఖర్చులు తగ్గించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెక్ కంపెనీకి ప్రధానంగా టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(సాంకేతిక సదుపాయాలు), ఉద్యోగుల వేతనాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
IBPS Clerk Recruitment: గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల
ఇటీవల పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మేనెలలో కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు కంపెనీ చెప్పింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగించిందో మాత్రం తెలియజేయలేదు.
విజయ్‌శేఖర్ శర్మ మే 22న షేర్‌హోల్డర్‌లకు రాసిన లేఖలో..‘సంస్థ తన ప్రధాన వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది. సంభావ్య తొలగింపులకు(పొటెన్షియల్ లేఆఫ్స్) సిద్ధమైంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ద్వారా ఏటా రూ.400కోట్లు-రూ.500 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.