Skip to main content

JEE Main 2022: ర్యాంకెంత? సీటెక్కడ?

దేశవ్యాప్తంగా JEE Main పూర్తయింది. ఇందులో అర్హత సాధిస్తే అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు.
JEE Main 2022
ర్యాంకెంత? సీటెక్కడ?

అందులో లభించే ర్యాంకు ఆధారంగానే IIT కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే... JEE Main ర్యాంకు ఆధారంగా NITలు, ఐఐఐటీల్లో Engineering సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్‌ మొదలవుతుంది. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? JEE Advancedకు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్‌లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే... JEE Mainsలో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్‌ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు.

చదవండి: ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు

కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు ఈజీయే!

ఎన్‌ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటుంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్‌ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్‌ డేటా చెబుతోంది.

చదవండి: అన్వయ నైపుణ్యంతో జేఈఈని జయించండిలా..

వరంగల్, తాడేపల్లిగూడెంలలో ఇలా..

గత ఐదేళ్ల సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్‌ కేటగిరీలో 75 వేల వరకు, రిజర్వేషన్‌ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా వీటిల్లో సీటు గ్యారెంటీ అని తెలుస్తోంది. వరంగల్‌ నిట్‌ సీఎస్‌ఈలో బాలురకు 3,089 ర్యాంకు, బాలికలకు 3,971 ర్యాంకు వరకు సీటు వస్తుంటే, అదే ఏపీ నిట్‌ (తాడేపల్లిగూడెం)లో బాలురకు 14 వేలు, బాలికలకు 28 వేల వరకు సీటు వస్తోంది. ఓబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13 వేల వరకు, ఏపీలో 33 వేల ర్యాంకు వరకు సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకైతే గరిష్టంగా 97,139 వరకు, ఎస్టీలకు 48 వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. మెకానికల్‌ బ్రాంచి ఓపెన్‌ కేటగిరీలోనే వరంగల్‌ నిట్‌లో 17 వేల వరకు, ఏపీలో 75 వేల వరకు ర్యాంకులకు సీట్లొచ్చాయి.

చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

వీటిల్లో అయితే 50 వేల వరకు..

తిరుచ్చి, సూరత్‌కల్, క్యాలికట్, నాగపూర్‌ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌ఐటీల్లో ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు కూడా గరిష్టంగా జేఈఈ ర్యాంకు 50 వేల వరకు వచ్చినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి.

చదవండి: జేఈఈ మెయిన్..ముందస్తు ప్రణాళికలతో సక్సెస్ సునాయసమే

జేఈఈ మెయిన్స్‌ ద్వారా 34,319 సీట్లు భర్తీ

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్‌ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో వివిధ కేటగిరీలకు ఏ బ్రాంచిలో ఏ ర్యాంకు వరకు సీటు వచ్చిందో వివరాలు

కేటగిరీ

సీఎస్‌ఈ

మెకానికల్‌

కెమికల్‌

ఓపెన్‌

25,157

75,237

60,507

ఓబీసీ

33,620

85,642

71,467

ఈడబ్ల్యూఎస్‌

20,671

88,023

91,530

ఎస్సీ

97,139

1,58,595

1,69,515

ఎస్టీ

48,706

1,91,389

1,78,327

తిరుచ్చి, సూరత్‌కల్, క్యాలికట్, నాగపూర్‌ రాష్ట్రాల్లో వివిధ బ్రాంచ్‌ల్లో ఓపెన్‌ కేటగిరీకి ఏ ర్యాంకు వరకు సీటు వచ్చిందో వివరాలు.

కేటగిరీ

సీఎస్‌ఈ

సివిల్‌

మెకానికల్‌

ఈసీఈ

ఓపెన్‌

8,933

50,284

41,302

12,712

అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలి

జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులు, నిట్‌లలో సీట్లపై విద్యార్థుల్లో అవగాహన తక్కువ. 10 వేలు దాటి ర్యాంకు వస్తే నీరసపడిపోతున్నారు. కానీ ఏ కాలేజీ అయినా సరే, ఏ బ్రాంచీ అయినా ఫర్వాలేదు అనుకుంటే, ఓపెన్‌ కేటగిరీలో 40 వేల వరకు, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉందని గత కొన్నేళ్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. అందువల్ల తొందరపడి ఇతర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరవద్దు.
– ఎంఎన్‌ రావు (గణిత శాస్త్ర నిపుణులు)

Published date : 30 Jul 2022 01:14PM

Photo Stories