School Admissions: విద్యార్థి ‘ప్రైవేటు’ బాట..! ఈ తరగతి నుంచే చేరికలు ఏక్కువ..
ఏడో తరగతి వరకు స్థానికంగా చదివిన ఎంతోమంది విద్యార్థులు ఆపై తరగతుల చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.
స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తులో పోటీ పరీక్షలను తట్టుకోలేరనే ఉద్దేశంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు.
ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీలకు విపరీతమైన క్రేజ్ నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆర్థికంగా భారమైనా కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే చేర్పిస్తున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఏడో తరగతి నుంచే...
విద్యార్థి దశలో పదో తరగతి కీలకమైంది. ఇదివరకు చాలామంది తల్లిదండ్రులు పదో తరగతి వరకు స్థానికంగానే చదివించేవారు. కానీ, ఇటీవలి కాలంలో ఏడో తరగతి నుంచే హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఏడో తరగతి నుంచే ఐఐటీ, జేఈఈ పరీక్షల సిలబస్ బోధిస్తుండడంతో ఇంటర్ వరకు పూర్తిస్థాయిలో పోటీని తట్టుకుంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు లేవన్న భావనలో కార్పొరేట్ చదువులకే మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు పాఠశాల స్థాయి నుంచే రెసిడెన్షియల్ చదువులకు అలవాటు పడాలన్న ఉద్దేశంతోనూ హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో చదివిస్తున్నారు.
ఫలితాల మోజులో..
ఇంటర్, ఎంసెట్, ఐఐటీ, జేఈఈ ర్యాంకుల మోజులో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోని పలు కార్పొరేట్ కళాశాలలు జిల్లాల వారీగా పీఆర్వోలను నియమించుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి.
అడ్మిషన్‌కు ఇంత కమిషన్ చొప్పున చెల్లిస్తూ ముందుగానే అడ్మిషన్ల పేరిట అడ్వాన్సులు తీసుకుంటున్నాయి. తమ కళాశాలల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకులు, ఫలితాలను ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్లు చేయిస్తున్నాయి. దీంతో రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ ఆర్థికంగా భారమైనా తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు.
కానీ, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరూ ర్యాంకులు సాధిస్తున్నారా అన్నది తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరముంది. ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు తిరుగుబాట పట్టిన సందర్భాలు ఉండగా, తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఎంతోమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.