Skip to main content

విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం

Bavitha అభిరుచికి తగ్గ ఉన్నత విద్యావకాశాల్ని అందుకోవాలన్నా, అరుదైన కోర్సులతో అందమైన కెరీర్‌ను సొంతం చేసుకోవాలన్నా ఇంటర్మీడియెట్ విద్య తొలి మైలురాయి. ఇందులో చూపిన ప్రతిభ, భవితకు భరోసా ఇస్తుంది. ఎన్నో లక్ష్యాలతో ఎంపీసీలో చేరిన విద్యార్థులు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత అని కాకుండా, నైపుణ్యాల సాధన కోణంలో చదివితే ఆశించిన గమ్యాన్ని చేరడానికి వీలవుతుంది. అందుకే మీ లక్ష్య సాధనలో తోడుగా ఉండేందుకు సీనియర్ ఇంటర్ ఎంపీసీపై ఫోకస్...

భవిష్యత్తులో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ తొలి మెట్టు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీలు లేదా ఎంసెట్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలంటే ఇంటర్‌లో అధిక ప్రతిభకనబరచాలి. దీనికి నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదవాలి. మొదటి సంవత్సరంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, భాషా సబ్జెక్టులతో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనికి సమాంతరంగా మొదటి సంవత్సర సబ్జెక్టులకు సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలను పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాలి. అందువల్ల పక్కా ప్రణాళిక ప్రకారం ద్వితీయ సంవత్సరం చదువును కొనసాగించాలి.

మ్యాథమెటిక్స్
సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ ముఖ్యమైనది. ఒకవైపు ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలు, మరోవైపు జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్; బిట్‌శాట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో మ్యాథమెటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. బోర్డు పరీక్షల్లో 2-ఎ, 2-బి పేపర్లకు కలిపి 150 మార్కులుంటాయి. ఎంసెట్‌లో ఎంపీసీకి 25 శాతం వెయిటేజీ ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఐఐటీలో ప్రవేశాలకు ఇంటర్ టాప్ 20 పర్సంటైల్ ఉండాలి. ఇంటర్ 2-ఎ, 2-బి మ్యాథమెటిక్స్ తెలుగు అకాడమీ పుస్తకంలోని కాన్సెప్టులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ప్రతి చాప్టర్‌లో ఉదాహరణ సమస్యల్ని సాధించాలి. గత ప్రశ్నపత్రాల్ని సేకరించి, ప్రాధాన్యత గల అంశాలను గుర్తించాలి. వీటిని నోట్సుగా రాసుకోవాలి.

వ్యాస రూప ప్రశ్నలు:
అతిస్వల్ప సమాధాన ప్రశ్నల తర్వాత ప్రాధాన్యం గల ప్రశ్న లు వ్యాసరూప ప్రశ్నలు.ఈ ప్రశ్నలకు ముఖ్యమైన చాప్టర్లు..
2-ఎ:
  • యాదృచ్ఛిక చలరాశులు (Random variables)
  • ద్విపద సిద్ధాంతం (Binomial theorem)
  • సమీకరణాల సిద్ధాంతం (Theory of Equations)
  • సంకీర్ణ సంఖ్యలు (Complex numbers)
  • సాంఖ్యక శాస్త్రం (Statistics)
2-బి:
  • వృత్తాలు (Circles)
  • పరావలయం (Parabola)
  • ఇంటెగ్రల్ కాలిక్యులేషన్స్
  • అవకలన సమీకరణాలు (Differential Equations)
పాక్టీస్.. ప్రాక్టీస్:
Bavitha మ్యాథమెటిక్స్‌లో విజయానికి కీలకం ప్రాక్టీస్. ఎంతటి క్లిష్టమైనా సమస్య అయినా ప్రాక్టీస్‌కు తలవంచాల్సిందే. ద్వితీయ సంవత్సరం సిలబస్‌లో సర్కిల్స్, ఇంటెగ్రల్ కాలిక్యులేషన్స్, బైనామియల్ థీరమ్, ప్రాబబిలిటీ, పారాబోలా చాప్టర్లు కష్టమైనవిగా భావిస్తారు. ఇది ఆయా అంశాల సిలబస్ పరిధి దృష్ట్యా మానసికంగా కలిగే ఆందోళ మాత్రమే. కాన్సెప్టులను అవగాహన పెంచుకొని, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తే అన్ని అంశాలూ తేలికగానే ఒంటపడతాయి.

విస్మరించడం తగదు:
సాధారణంగా కొందరు విద్యార్థులు క్లిష్టంగా ఉన్నాయన్న భావనతోనో, సరైన ప్రణాళిక లేకపోవడంవల్లనో కొన్ని అంశాలను చదవకుండా విడిచిపెడుతుంటారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఇలా చేయడం మంచిది కాదు. ప్రతి చాప్టర్‌కు దానికి ముందున్న చాప్టర్‌తో సంబంధముంటుంది. ద్వితీయ సంవత్సరంలోని ఇంటెగ్రల్ కాలిక్యులస్.. మొదటి సంవత్సరంలోని డిఫరెన్షియల్ కాలిక్యులేషన్‌తోనూ; పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్.. ఫంక్షన్స్‌తోనూ; సర్కిల్స్, కోనిక్స్.. స్ట్రయిట్ లైన్స్‌తోనూ అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఒకవేళ మొదటి ఏడాదిలో ఏవైనా చాప్టర్లను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి, తర్వాత వాటితో సంబంధమున్న సెకండియర్ అంశాలను అధ్యయనం చేయాలి.

ఫిజిక్స్
ఎంసెట్, జేఈఈ మెయిన్‌లో వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ఫిజిక్స్‌లో అధిక మార్కులు సంపాదించేందుకు విద్యార్థులు ప్రణాళికాయుతంగా చదవాలి. ఫిజిక్స్ అకాడమీ పుస్తకంలోని ప్రతి యూనిట్ చివర్లో ఉన్న అతిస్వల్ప సమాధాన ప్రశ్నలన్నింటినీ చదవాలి. ఇవి పూర్తిగా కాన్సెప్టులపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి కాన్సెప్టుల అప్లికేషన్స్‌ను తప్పనిసరిగా నేర్చుకోవాలి. సూత్రాల ఆధారంగా ఉన్న అన్ని ప్రశ్నలను సాధించాలి. కాలేజీలో ఏ చాప్టర్ చెబుతున్నారో, ఇంటి దగ్గర ఆ చాప్టర్‌కు సంబంధించి అకాడమీ పుస్తకంలోని అంశాలను ఆసాంతం చదవాలి. ఆ చాప్టర్‌లో స్వల్ప, దీర్ఘ, అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను గుర్తించాలి.
ప్రతి చాప్టర్‌కు ఒకట్రెండు రోజులు కేటాయించి, పూర్తిగా అర్థం చేసుకొని ఇంటర్ బోర్డు పరీక్షలో వచ్చేందుకు అవకాశమున్న ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై దృష్టిపెట్టాలి.
  • మొదటి ఏడాదితో పోలిస్తే ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. చాప్టర్ల వారీగా వెయిటేజీ అంచనా..
చాప్టర్ మార్కులు
వేవ్స్ 6
స్టాటిక్ ఎలక్ట్రిసిటీ 10
కరెంట్ ఎలక్ట్రిసిటీ 10
మూవింగ్ చార్జెస్ ఇన్ మ్యాగ్నటిజం 6
ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ 4
డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ 8
సెమీ కండక్టర్ డివైసస్ 6

ముఖ్యమైన అంశాలు:
వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఎలక్ట్రో స్టాటిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టంగా భావిస్తారు. ఈ చాప్టర్లను క్షుణ్నంగా చదవాలి. డాప్లర్ ప్రభావం, ఫ్లెమింగ్ ఎడమ, కుడి నియమాలు, అర్ధ వాహక పరికరాలు చాలా ముఖ్యమైనవి. బోర్డు పరీక్షల్లో ఫిజిక్స్‌కు 60 మార్కులు కేటాయించగా, మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండింటికి సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నల్లో ఆరింటికి జవాబులు రాయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 10 ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.

కెమిస్ట్రీ
ద్వితీయ సంవత్సరంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కంటే కెమిస్ట్రీ కష్టమైనదిగా భావిస్తారు. ఎక్కువ కాన్సెప్టులు ఉండటమే దీనికి కారణం. సోలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమైనవి. రీజనింగ్ ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. తెలుగు అకాడమీ పుస్తకం చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. వాటిని వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి. దీనివల్ల లఘు సమాధాన ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. రెండింటికి జవాబులు రాయాలి. ఈ ప్రశ్నలు చాలాసార్లు రెండు చాప్టర్లలో భాగాలుగా (4+4 మార్కులు) అడుగుతున్నారు.
ముఖ్యమైన చాప్టర్లు:
మెటలర్జీ, సొల్యూషన్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్.

ప్రణాళికతో విజయం:
విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సమాంతరంగా ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అందువల్ల కచ్చితమైన సమయపాలన పాటించాలి. ఒత్తిడికి తావులేని విధంగా ప్రిపరేషన్ వ్యూహాలను రూపొందించుకోవాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్‌తదితర పరీక్షల్లో విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నవారు ఇప్పటి నుంచి నవంబరు 15 వరకు ఇంటర్ సెకండియర్‌లోని కాన్సెప్టులతో పాటు ఆబ్జెక్టివ్‌లోని వివిధ స్థాయిలను సాధన చేయాలి. ప్రతి వారాంతం ఆబ్జెక్టివ్ పరీక్షను తప్పనిసరిగా రాయాలి. నవంబరు 15 నుంచి జనవరి 15 వరకు మొదటి సంవత్సరంలోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను పునశ్చరణ చేయాలి. జనవరి 15 నుంచి పూర్తిస్థాయిలో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు, రికార్డులు రాసేందుకు, ప్రాక్టికల్స్‌పైన దృష్టిసారించాలి.
  • ఇప్పటి నుంచి బోర్డు పరీక్షల కోణంలో డిస్క్రిప్టివ్ తరహాలో సిద్ధమవుతూనే, ప్రవేశ పరీక్షలకు ఆబ్జెక్టివ్ కోణంలో సిద్ధమవాలి. ముఖ్యంగా ఎంట్రన్స్‌లలో అడిగే ప్రశ్నల్లో 75 శాతం- 80 శాతం ప్రశ్నలు ప్రాథమిక భావనలపైనే ఆధారపడి ఉంటాయి.
టిప్స్
  • కాలేజీలో లెక్చరర్ చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో వినాలి. ఇంటిదగ్గర ఆ చాప్టర్‌లోని అంశాలను సమీక్షించి, ప్రాక్టీస్ చేయాలి.
  • వారాంతపు ఐపీఈ నమూనా పరీక్షలను, ఆబ్జెక్టివ్ పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. బలాలు,బలహీనతలను గుర్తించాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవాలి.
  • రోజూ కాలేజీ సమయం తర్వాత కనీసం మ్యాథమెటిక్స్‌కు 3 గంటలు, ఫిజిక్స్‌కు గంటన్నర, కెమిస్ట్రీకి గంటన్నర కేటాయించాలి.
  • ఇంటర్ బోర్డు పరీక్షల ప్రకారం ముఖ్యమైన చాప్టర్లను గుర్తించి, ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి.
  • అన్ని చాప్టర్లలోని ముఖ్య భావనలను ఒకచోట రాసుకొని, బాగా చదవాలి.
  • ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ఇలా చేయకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి.
  • అవసరానికి తగినట్లు షార్ట్‌కట్స్, టిప్స్ ఉపయోగించాలి.
  • ఎంసెట్, జేఈఈకి సిద్ధమవుతున్నవారు తొలుత సబ్జెక్టు బేసిక్స్‌ను తర్వాత కాన్సెప్ట్‌లపై పట్టు సా దించాలి. చివర్లో అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
  • అతి విశ్వాసం అనర్ధదాయకం. ‘సిలబస్ అంతా చదివాం.. అంతా వచ్చినట్లే’ అనే భావన వీడాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.
మెటీరియల్:
మెటీరియల్ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌కు పరిమితమై పూర్తిస్థాయిలో చదవాలి. తొలుత తేలిగ్గా ఉన్న అంశాలను పూర్తిచేస్తే, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల కష్టమైన అంశాలు కూడా కొరుకుడుపడతాయి.
Published date : 04 Jul 2014 04:18PM

Photo Stories