Skip to main content

మొదటి ఏడాది ఎంపీసీలో మెరుగైన మార్కులకు...

mpc విద్యార్థి భావి జీవిత కెరీర్‌ను నిర్దేశించడంలో ఇంటర్మీడియెట్‌దే కీలకపాత్ర. అందులోనూ ఎంపీసీ గ్రూప్.. ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలతోపాటు యూపీఎస్సీ- ఎస్‌సీఆర్‌ఏ, ఎన్‌డీఏ-ఎన్‌ఏ వంటి పరీక్షల్లో విద్యార్థుల విజయానికి బాటలు వేస్తుంది. ఎంసెట్, జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో మొదటి ఏడాది నుంచే పక్కాగా సిద్ధమవ్వాలి. ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధనకు దీర్ఘకాలిక ప్రిపరేషన్ వ్యూహాలు..

మ్యాథమెటిక్స్

mpc మూడు సబ్జెక్టుల్లో అత్యంత ప్రధానమైన.. పూర్తి మార్కులు తెచ్చిపెట్టగల సబ్జెక్ట్.. మ్యాథమెటిక్స్. చాలా ప్రైవేటు కళాశాలల్లో అక్టోబర్ చివరి నాటికి సిలబస్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత తెలుగు అకాడెమీ పాఠ్యపుస్తకంలోని సమస్యలన్నింటినీ సాధన చేయాలి. ఇలా చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. అదేవిధంగా ప్రతి చాప్టర్‌లో సూత్రాలను, ప్రాథమిక భావనలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. ప్రతి చాప్టర్‌లో ఉన్న సమస్యలను సాధన చేయడంతోపాటు పాత ప్రశ్నాపత్రాల్లోని సమస్యలను పరిష్కరించాలి. వాటిలో ముందుగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు, ఆ తర్వాత దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి.

మ్యాథ్స్-1ఏలో వెయిటేజ్ దృష్ట్యా ముఖ్యమైన చాప్టర్లు- కేటాయించాల్సిన సమయం: ట్రాన్స్‌ఫార్మేషన్(4 గంటలు), మ్యాథమెటిక్ ఇన్‌డక్షన్ (2 గంటలు), మ్యాట్రిసెస్ అండ్ డెటర్మినెంట్స్(8 గంటలు), ఫంక్షన్స్(6గంటలు), ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ (6 గంటలు), ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ (5 గంటలు).

మ్యాథ్స్-1బీ: పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్‌లైన్స్ (8గంటలు), స్ట్రె యిట్‌లైన్స్ (6 గంటలు), డీడీఆర్‌ఎస్ డీసీఎస్(3 గంటలు), డిఫరెన్షియేషన్ (6 గంటలు), మాక్సిమా అండ్ మినిమా (4 గంటలు), టాంజెంట్స్ అండ్ నార్మల్స్ (3 గంటలు).

ఫిజిక్స్

mpc ఫిజిక్స్‌లో వర్క్-పవర్ ఎన ర్జీ, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్, కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, థర్మోమెట్రీ వంటి చాప్టర్లు దీర్ఘ సమాధాన ప్రశ్నల కోణంలో అతి ముఖ్యమైనవి. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా కనీసం కేటాయించాల్సిన సమయం.. వెక్టార్స్ (2 గంటలు), కైనమేటిక్స్ (8 గంటలు), ఎస్‌హెచ్‌ఎం (4 గంటలు), రొటేటరీ మోషన్ (6 గంటలు), గ్యాస్, సాలిడ్, లిక్విడ్ ఎక్స్‌పాన్షన్స్ (12 గంటలు), కైనటిక్ గ్యాస్ థియరీ (6 గంటలు)

  • వెక్టార్స్‌లో ఉండే భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పడితే ఈ చాప్టర్‌పై పట్టు లభిస్తుంది.
  • రొటేటరీ మోషన్‌లో.. పొజిషన్ వెక్టార్, ఫోర్స్ వెక్టార్ ముఖ్యమైనవి. అందులో సమస్యలను గుర్తించి సాధన చేయాలి.
  • గ్రావిటేషన్‌లో.. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, వేరియేషన్ ఆఫ్ ‘జి’, లాటిట్యూడ్, డెప్త్ ముఖ్యమైనవి. వీటితోపాటు ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అతి ముఖ్యమైనవి.
  • సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో టర్మ్ ఫేజ్ గురించి, సమస్యాసాధనలో దాని ప్రాధాన్యతను గురించి విద్యార్థులు అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా వెలాసిటీ, యాక్సిలరేషన్, మాక్సిమం, మినిమం వ్యాల్యూస్‌ను, వాటి మధ్య సంబంధాలను గుర్తుంచుకోవాలి.
  • సర్ఫేస్ టెన్షన్‌లో.. నిత్య జీవితంలో సర్ఫేస్ టెన్షన్ ఉదాహరణలు, సర్ఫేస్ ఎనర్జీ, సర్ఫేస్ టెన్షన్ - సర్ఫేస్ ఎనర్జీ మధ్య సంబంధం, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, కాపిలారిటీ, సర్ఫేస్ టెన్షన్ ఇన్ మాలిక్యులర్ ఫినామినన్ మొదలైనవాటిని బాగా చదవాలి.
  • ఎలాస్టిసిటీలో తక్కువ సంఖ్యలో సబ్‌టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా మాదిరి సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కాన్సెప్ట్స్.. డిఫరెంట్ స్ట్రెస్, స్ట్రెయిన్ రిలేటెడ్ మ్యాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, పాయిజన్ రేషియో.
  • థర్మో డైనమిక్స్‌లో జెరోత్ లా, జౌల్స్ లా, హీట్ కాలిక్యులేషన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమీటర్, ఎడియాబాటిక్, ఐసోథర్మల్ ఛేంజెస్ మొదలైనవాటిపై బాగా దృష్టి సారించాలి.
కెమిస్ట్రీ

  • కెమిస్ట్రీలో ప్రధానంగా దీర్ఘ సమాధాన ప్రశ్నలు కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పాఠాల నుంచి వస్తాయి. కాబట్టి ఈ నాలుగు అధ్యాయాలను బాగా చదవాలి.
  • ఎక్కువ సంఖ్యలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. వీటిల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి తెలుగు అకాడెమీ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాన్ని ప్రతి రోజూ చదువుతూ, ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్న వచ్చినా రాయగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోజన్ స్పెక్ట్రా, బోర్న్ హేబర్ సైకిల్, పీరియాడిక్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎహ్‌లెన్స్, ఎసిటలీన్ అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న విభాగం కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీనే. కాబట్టి ప్రతి రోజూ దీన్ని ఔపోసన పట్టాలి. అదేవిధంగా హైడ్రో కార్బన్ నేమ్‌డ్ రియాక్షన్స్ వంటి చాప్టర్లను పరీక్షకు ముందు అనేకసార్లు చదవాలి.
  • ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మేటర్ యాసిడ్స్ అండ్ బేసెస్, కెమికల్ కైనటిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్ ఎనర్జిటిక్స్ మొదలైన టాపిక్స్ ముఖ్యమైనవి. వీటి నుంచి ఎంసెట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి సంబంధిత ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను ఒక చోట రాసుకుని ప్రతి రోజూ చదవాలి.
  • జనరల్ కెమిస్ట్రీలో స్టాచియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయడంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకుని చదవడం చేయాలి.
  • పబ్లిక్ పరీక్షల కోసం ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలసేపైనా కెమిస్ట్రీని చదవాలి.
కెమికల్ బాండింగ్ - 5 గంటలు
అటామిక్ స్ట్రక్చర్ - 4 గంటలు
పీరియాడిక్ టే బుల్ - 4 గంటలు
కెమికల్ కైనటిక్స్ - 4 గంటలు
ఆర్గానిక్ కెమిస్ట్రీ - 8 గంటలు

కాన్సెప్ట్+ అప్లికేషన్ ఓరియెంటేషన్ అప్రోచ్

అటు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా, ఇటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోణంలోనూ అతి ముఖ్యమైంది ఎంపీసీ గ్రూప్. ఇందులో ఉండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు.. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోణంలో అతి ముఖ్యమైనవి. ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటివాటిలో ర్యాంకు తె చ్చుకోవాలంటే ఆ పరీక్షలు బాగా చదివి రాస్తే సరిపోదు. ఇంటర్ గ్రూప్ సబ్జెక్టులను అంతకంటే బాగా చదవాలి. ఎందుకంటే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్, జేఈఈ అడ్వాన్స్‌డ్ కు ఎంపికవడానికి మెయిన్‌కు 40 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మొదటి ఏడాది నుంచే పబ్లిక్ పరీక్షలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇంటర్ ఎంపీసీ మొదటి ఏడాదిలో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే సాధారణ పద్ధతిలో చదువుకుంటూ వెళ్తే కుదరదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ముఖ్యమైన కాన్సెప్ట్స్ (భావనలు)ను నేర్చుకుంటూ, అప్లికేషన్ ఓరియెంటేషన్ (అనువర్తిత పద్ధతి)లో అధ్యయనం చేస్తే అత్యధిక మార్కుల సాధనకు బాటలు వేసుకోవచ్చు. పబ్లిక్ పరీక్షలతోపాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయానికి కూడా ఇదే వ్యూహం పాటించాలి. ముందుగా పబ్లిక్ పరీక్షలపై దృష్టి సారించాలి కాబట్టి మ్యాథ్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఎందుకంటే మూడు ప్రధాన సబ్జెక్ట్‌ల్లో మార్కుల రీత్యా మ్యాథ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దీనికి పబ్లిక్ పరీక్షల్లో 150 మార్కులు కేటాయించారు. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలకు 60 చొప్పున మార్కులు ఉంటాయి. ఇంటర్మీడియెట్ బోర్డ్ కూడా ప్రతి సబ్జెక్టుకు నిర్దేశిత గంటల పీరియడ్స్‌ను నిర్దేశించింది. దీని ప్రకారం ఏడాదిలో మ్యాథ్స్-1ఏకు 150 గంటలు, మ్యాథ్స్-1బీకి 150 గంటలు, ఫిజిక్స్‌కు, కెమిస్ట్రీలకు 180 గంటల చొప్పున బోధనా తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

ప్రశ్నాపత్రం ఇలా:

మ్యాథ్స్: మ్యాథ్స్1ఏలో మొత్తం 75 మార్కులకు దీర్ఘ సమాధాన ప్రశ్నలు 7 ఇస్తారు. ఇందులో ఏవైనా 5 ప్రశ్నలు రాయాలి. అదేవిధంగా స్వల్ప సమాధాన ప్రశ్నలు కూడా 7 ఇస్తారు. ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు 10 ఇస్తారు. మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
మ్యాథ్స్-1బీ:
మొత్తం 75 మార్కులకు ఉంటే మ్యాథ్స్-1బీ కూడా 1ఏ మాదిరిగానే ఉంటుంది. ఎలాంటి మార్పులుండవు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ: 60 మార్కుల చొప్పున ఉండే రెండు పేపర్లలో 3 ప్రశ్నల చొప్పున దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అదేవిధంగా ప్రతి పేపర్‌లోనూ 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో ఏవైనా 6 ప్రశ్నలకు సమాధానాలకు ఇవ్వాలి. అదేవిధంగా రెండు పేపర్లలోనూ 10 చొప్పున అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

టిప్స్

  • పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్స్‌ను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముందుగా అన్ని చాప్టర్ల ముఖ్య భావనలను ఒక చోట రాసుకుని బాగా చదవాలి.
  • ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌కు సంబంధించి లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను, ఇతర అంశాలను బాగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా సంబంధిత కాన్సెప్ట్‌ను నిర్వచించడం.. విశ్లేషించడం.. అనువర్తించడం విధానంలో చదవాలి.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం అనేవి అత్యంత ముఖ్యమైనవి. వీటిని తప్పక పాటించాలి.
  • అవసరానికి తగ్గట్లు టిప్స్, షార్ట్‌కట్స్‌ను ఉపయోగించాలి.
  • ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్ధిష్ట ప్రణాళిక ను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. వేస్తే ఈ రోజుది, ముందురోజుది ఒకేసారి చదవాల్సి రావడంతో ఒత్తిడి ఏర్పడుతుంది.
  • అదేవిధంగా ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్యమైన సినాప్సిస్‌ను రూపొందించుకొని బాగా చదవాలి.
  • ప్రతి పాఠంలో ఉన్న సమస్యలను.. సంబంధిత సూత్రాల సహాయంతో పరిష్కరించాలి.
  • ఆబ్జెక్టివ్ ప్రశ్నల పట్ల చాలామంది విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తారు. రెండో ఏడాదిలో చాలా కష్టంగా ఉన్నాయని విచారిస్తారు. అందుకే మొదటి ఏడాదిలోనే లాంగ్ ఆన్సర్, వెరీషార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలతోపాటే బహుళైచ్ఛిక ప్రశ్నలపై కూడా దృష్టి సారించాలి.
  • అందుబాటులో ఉన్న సమయాన్ని రెండు భాగాలుగా విభజించుకుని మ్యాథ్స్‌కు అధిక సమయాన్ని కేటాయించాలి. మిగిలిన సమయాన్ని వెయిటేజ్‌ను బట్టి ఆయా సబ్జెక్టులకు.. చాప్టర్లకు కేటాయించాలి.
  • పబ్లిక్ పరీక్షలతోపాటు, ఎంసెట్, ఐఐటీ జేఈఈ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత ప్రిపరేషన్ సాగించాలి.
  • వీరు ముందుగా సంబంధిత సబ్జెక్టులో బేసిక్స్‌ను, ఆ తర్వాత కాన్సెప్ట్స్‌ను నేర్చుకుని చివరిగా అనువర్తిత విధానంలో సమస్యలను పరిష్కరించాలి.
  • మ్యాథ్స్‌ను ప్రతి రోజూ సాధన చేయడంతోపాటు వారంలో వీలైన న్ని మాదిరి పరీక్షలు రాయాలి. అదేవిధంగా వారానికి ఒక గ్రాండ్ టెస్ట్‌ను రాయాలి.
  • కాలేజ్ షెడ్యూల్ మీ ప్రిపరేషన్‌కు ఇబ్బంది కాకుండా సీనియర్ అధ్యాపకులతో ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • కళాశాలలో ప్రతి పాఠాన్ని ఏకాగ్రతతో శ్రద్ధగా వినడంతోపాటు ఇంటికొచ్చాక సంబంధిత పాఠాన్ని సమీక్షించాలి. ఆ తర్వాత సాయంత్ర ట్యూషన్‌లో ఆ పాఠాన్ని క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే సంబంధిత పాఠం బాగా గుర్తుండిపోతుంది.
  • పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నప్పుడు ముఖ్య అంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇలా చేస్తే చివర్లో క్విక్ రివిజన్ చేసేటప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడదు.
  • అధ్యాపకుడు పాఠం చెప్పేటప్పుడు ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.
  • అతి విశ్వాసం ఎప్పుడూ అనర్ధదాయకం. ‘సిలబస్ అంతా చదివాం.. అంతా వచ్చినట్లే’ అనే భావన వీడాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.
Published date : 15 Aug 2013 03:37PM

Photo Stories