Skip to main content

మెరుగైన మార్కులకు పక్కా ప్రణాళిక

BiPC వైద్య వృత్తిలో చేరి.. కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సామాజిక సేవ చేసే అవకాశం కోసం ఎందరో విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. ఆ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు తొలి మెట్టు ఇంటర్మీడియెట్ బైపీసీ.. అన్వయం (Apply), విశ్లేషణ (Analysis) పద్ధతులను ఒంటబట్టించుకొని, బైపీసీని దిగ్విజయంగా పూర్తిచేసి, వైద్యంతో పాటు మరెన్నో రంగాల్లో సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు నిపుణులు అందిస్తున్న సలహాలు..

బోటనీ
పదో తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టిన విద్యార్థులు బయాలజీ పాఠ్యాంశాలను వృక్ష (బోటనీ), జంతు (జువాలజీ) శాస్త్రాలుగా చదవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో బోటనీకి 60 మార్కులు, జువాలజీకి 60 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే తొలుత పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకొని తర్వాత విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

‘తెలుగు అకాడమీ’తో మేలు:
బోటనీకి సంబంధించి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ప్రధానం. విద్యార్థులు తొలుత కొత్తగా ప్రచురించిన పుస్తకంలోని పాఠ్యాంశాల వరుస క్రమాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రశ్నపత్రానికి అనుగుణంగా పాఠ్యాంశాలను చదవాలి.

వరుస క్రమంతో మంచి ఫలితాలు:
పాఠ్యాంశాలను చదివేటప్పుడు ఈ కింది వరుసక్రమాన్ని పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముందు చదివిన అంశాలు.. తర్వాత పాఠాలు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఉపయోగపడతాయి.

యూనిట్ 1: జీవించడం అంటే ఏమిటి?; యూనిట్ 2: పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం; యూనిట్ 4: ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం, వ్యవస్థలు, వర్గీకరణ రకాలు; యూనిట్ 1: జీవ ప్రపంచంలో వైవిధ్యాలు; యూనిట్ 4: పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణన; యూనిట్ 3: ప్రత్యుత్పత్తి-రకాలు, ఫలదీకరణ పూర్వ నిర్మాణాలు, పుప్పొడి-అండకోశ పరస్పర చర్య, పరాగ సంపర్కం; యూనిట్ 5: జీవ అణువులు, కణం జీవ ప్రమాణం, కణ చక్రం-కణ విభజన; యూనిట్ 6: మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం; యూనిట్ 7: వృక్ష ఆవరణ శాస్త్రం; యూనిట్ 1: జీవశాస్త్ర వర్గీకరణ, మొక్కల విజ్ఞానం-వృక్ష శాస్త్రం; వృక్ష రాజ్యం.

పశ్నపత్రంపై అవగాహన:
పేపర్ మొత్తం 76 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇందులో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఏలో 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్ సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండింటికి సమాధానం రాయాలి. ప్రశ్నపత్రం సాధారణంగా (స్వల్ప మార్పులతో) ఇంటర్ బోర్డు ప్రతిపాదించే విధానంలో ఉంటుంది.

పాఠ్యాంశాలు-వెయిటేజీ:
యూనిట్ 1: జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు)
యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు)
యూనిట్ 3: మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు)
యూనిట్ 4: ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు)
యూనిట్ 5: కణ నిర్మాణం, విధులు (14 మార్కులు)
యూనిట్ 6: మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం
(12 మార్కులు)
యూనిట్ 7: వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు)
  • 2, 3, 6 యూనిట్‌ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి.
  • ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మొదటి నుంచి చేతిరాతను మెరుగుపరచుకోవాలి.

- బి. రాజేంద్ర,
సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

జువాలజీ
చాలా కాలం తర్వాత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంటర్మీడియెట్ బోర్డు పాఠ్యాంశాలను మార్చింది. శాస్త్ర పరిశోధనలనేవి నిరంతరం కొనసాగే ప్రక్రియలు. వాటికి అనుగుణంగా మొదటి సంవత్సరం జువాలజీ పాఠ్యాంశాల్లో అదనపు విషయాలను జోడించారు. మొదటి యూనిట్- ‘జీవ ప్రపంచ వైవిధ్యం’లో జీవులు మౌలిక లక్షణాలు, జంతుశాస్త్రం పరిధి, శాఖలు, వర్గీకరణలను వివరించారు. రాజ్యం ఏనిమేలియా వర్గీకరణ, జీవ వైవిధ్యం గురించి కూడా విశదీకరించారు.

  • రెండో యూనిట్‌లో జంతు దేహ నిర్మాణం; 3, 4 యూనిట్లలో అకశేరుక వర్గాలు, కార్డేటా వర్గీకరణను వివరించారు.
  • 5వ యూనిట్‌లో ప్రొటొజోవా గమనం, ప్రత్యుత్పత్తుల గురించి తెలపగా, 6వ యూనిట్‌లో ‘మానవ సంక్షేమంలో జీవశాస్త్రం’ గురించిన అంశాలను చేర్చారు.
  • 7వ యూనిట్‌లో పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) నమూనాను, 8వ యూనిట్‌లో జీవావరణం, పర్యావరణం గురించి తెలిపారు.

యూనిట్‌ల వారీగా ప్రాధాన్యం:
మొదటి యూనిట్ నుంచి ఒక అతి స్వల్ప సమాధాన ప్రశ్న, ఒక స్వల్ప సమాధాన ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. రెండో యూనిట్ నుంచి మూడు అతి స్వల్ప సమాధాన, ఒక స్వల్ప సమాధాన ప్రశ్నలు రావొచ్చు.

  • మూడు, నాలుగు యూనిట్‌ల నుంచి రెండు అతి స్వల్ప, రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు; 5వ యూనిట్ నుంచి 2 అతి స్వల్ప, ఒక స్వల్ప సమాధాన ప్రశ్నలు; 6వ యూనిట్ నుంచి ఒక అతి స్వల్ప, ఒక స్వల్ప, ఒక దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • 7వ యూనిట్ నుంచి ఒక స్వల్ప సమాధాన, ఒక దీర్ఘసమాధాన ప్రశ్నలు; చివరి యూనిట్ నుంచి ఒక్కో స్థాయి నుంచి ఒక్కో ప్రశ్న రావొచ్చు.

ప్రిపరేషన్ విధానం:
  • విద్యార్థులు పటాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు సాధన చేసి, భాగాలను గుర్తుంచుకోవాలి. పరీక్షల్లో పటాలు గీసేటప్పుడు రంగు పెన్సిళ్లు ఉపయోగిస్తే మంచిది. దీనివల్ల భాగాలను స్పష్టంగా గుర్తించేందుకు వీలవుతుంది.
  • పాఠ్యాంశాల గురించి తోటి విద్యార్థులతో చర్చించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పరోక్షంగా పునశ్చరణ జరుగుతుంది.
  • ప్రతి యూనిట్‌లోనూ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని రాయటాన్ని అలవర్చుకోవాలి. స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలను సమయ పాలన పాటిస్తూ అభ్యసించాలి.
  • ప్రతి యూనిట్ పారిభాషిక పదకోశంలోని పదాల నిర్వచనాలను అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే అతి స్వల్ప సమాధాన పశ్నలకు సరైన సమాధానాలు రాయడానికి, ఎంసెట్ వంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది.
  • ఒకే రకమైన సమాధానాన్ని వివరణాత్మకంగా, క్లుప్తంగా రాయగలిగే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
  • తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వాటిలోని అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ సాంకేతిక పదాలను, సారాంశాలను వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి.
  • పబ్లిక్ పరీక్షలకు దాదాపు ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి జంతుశాస్త్రానికి రోజుకు కనీసం రెండు గంటలు కేటాయించాలి.
  • కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేరుగా పాఠ్యపుస్తకాల్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అధ్యాపకులను సంప్రదించాలి.

- కె. శ్రీనివాసులు,
శ్రీచైతన్య విద్యాసంస్థలు.

ఫిజిక్స్
ఫిజిక్స్‌కు 60 మార్కులు కేటాయించారు. సెక్షన్-ఏ (20 మార్కులు), సెక్షన్-బి (24 మార్కులు), సెక్షన్-సి (16 మార్కులు) ఉంటుంది. వర్క్-పవర్, ఎనర్జీ, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, థర్మోమెట్రీ దీర్ఘ సమాధాన ప్రశ్నల కోణంలో అతి ముఖ్యమైనవి. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా కనీసం కేటాయించాల్సిన టైం.. వెక్టార్స్ (2 గంటలు), కైనమేటిక్స్ (8గంటలు), ఎస్‌హెచ్‌ఎం (4 గంటలు), రొటేటరీ మోషన్ (6 గంటలు), గ్యాస్, సాలిడ్, లిక్విడ్ ఎక్స్‌పాన్షన్స్ (12 గంటలు), కైనటిక్ గ్యాస్ థియరీ (6 గంటలు).వెక్టార్స్‌లో ఉండే భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పడితే ఈ చాప్టర్‌పై పట్టు లభిస్తుంది. రొటేటరీ మోషన్‌లో.. పొజిషన్ వెక్టార్, ఫోర్స్ వెక్టార్ ముఖ్యమైనవి. అందులో సమస్యలను గుర్తించి సాధన చేయాలి.

  • గ్రావిటేషన్‌లో.. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, వేరియేషన్ ఆఫ్ ‘జి’, లాటిట్యూడ్, డెప్త్; వీటితోపాటు ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ ముఖ్యమైనవి.
  • సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో టర్మ్ ఫేజ్ గురించి, సమస్యా సాధనలో దాని ప్రాధాన్యతను గురించి అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా వెలాసిటీ, యాక్సిలరేషన్, మాక్సిమం, మినిమం వ్యాల్యూస్‌ను, వాటి మధ్య సంబంధాలను గుర్తుంచుకోవాలి.
  • సర్ఫేస్ టెన్షన్‌లో.. నిత్య జీవితంలో సర్ఫేస్ టెన్షన్ ఉదాహరణలు, సర్ఫేస్ ఎనర్జీ, సర్ఫేస్ టెన్షన్ - సర్ఫేస్ ఎనర్జీ మధ్య సంబంధం, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, కాపిలారిటీ మొదలైనవాటిని బాగా చదవాలి.
  • ఎలాస్టిసిటీలో తక్కువ సంఖ్యలో సబ్‌టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా మాదిరి సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన కాన్సెప్ట్స్.. డిఫరెంట్ స్ట్రెస్, స్ట్రెయిన్ రిలేటెడ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, పాయిజన్ రేషియో.
  • థర్మో డైనమిక్స్‌లో జెరోత్ లా, జౌల్స్ లా, హీట్ కాలిక్యులేషన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమీటర్, ఎడియాబాటిక్, ఐసోథర్మల్ ఛేంజెస్ మొదలైనవాటిపై బాగా దృష్టి సారించాలి.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. సెక్షన్-ఏ (20 మార్కులు), సెక్షన్-బి (24 మార్కులు), సెక్షన్-సి (16 మార్కులు) ఉంటుంది. దీర్ఘ సమాధాన ప్రశ్నలు కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పిరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి వస్తాయి. కాబట్టి ఈ నాలుగు అధ్యాయాలను బాగా చదవాలి.

  • ఎక్కువ సంఖ్యలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. వీటిల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి తెలుగు అకాడెమీ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాన్ని ప్రతి రోజూ చదువుతూ, ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్న వచ్చినా రాయగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోజన్ స్పెక్ట్రా, బోర్న్ హేబర్ సైకిల్, పీరియాడిక్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటలీన్ అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న విభాగం కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీనే. కాబట్టి ప్రతి రోజూ దీన్ని ఔపోసన పట్టాలి. అదేవిధంగా హైడ్రో కార్బన్ నేమ్‌డ్ రియాక్షన్స్ వంటి చాప్టర్లను పరీక్షకు ముందు అనేకసార్లు చదవాలి.
  • ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మేటర్ యాసిడ్స్- బేసెస్, కెమికల్ కైనటిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్ ఎనర్జిటిక్స్ ముఖ్యమైనవి. వీటి నుంచి ఎంసెట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి సంబంధిత ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను ఒక చోట రాసుకుని ప్రతి రోజూ చదవాలి.
  • జనరల్ కెమిస్ట్రీలో స్టాచియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయడంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకుని చదవడం చేయాలి.
  • పబ్లిక్ పరీక్షల కోసం ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలసేపైనా కెమిస్ట్రీని చదవాలి.

గెలుపు మార్గాలు
  • పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్టులను గుర్తించి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • తొలుత అన్ని చాప్టర్ల ముఖ్య భావనలను ఒక చోట రాసుకుని బాగా చదవాలి.
  • గుర్తించిన కాన్సెప్ట్‌లను నిర్వచించడం.. విశ్లేషించడం.. అనువర్తించడం విధానంలో చదవాలి.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం అత్యంత ప్రధానమైనవి.
  • ప్రతి సబ్జెక్టుకు ఓ నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు.
  • ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్యమైన సినాప్సిస్‌ను రూపొందించుకొని బాగా చదవాలి.
  • కళాశాలలో ప్రతి పాఠాన్ని ఏకాగ్రతతో వినడంతోపాటు ఇంటిదగ్గర సంబంధిత పాఠాన్ని సమీక్షించుకోవాలి.
  • పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నప్పుడు ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇది చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
  • అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి.

- ఎం.ఎన్.రావు,
శ్రీచైతన్య విద్యాసంస్థలు.
Published date : 30 Aug 2013 12:34PM

Photo Stories