Skip to main content

ఇంటర్ ప‌రీక్షల్లో టాప్ మార్కులను సాధించేందుకు స‌రైన మార్గం ఇదే..!

ఇంటర్మీడియెట్.. విద్యార్థి జీవితంలో మేలి మలుపు. ఇక్కడ గెలుపే భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తుంది. నిర్ణయాత్మకమైన ఈ దశలో మంచి మార్కులు సాధించేలా.. సబ్జెక్టులను ఓ పట్టు పట్టాల్సిన సమయం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో త్వర‌లోనే ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో...ముందు నుంచే గ్రూప్ ఏదైనా అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని పూర్తిగా చదువుకే కేటాయించడం ద్వారా ఉత్తమ స్కోర్ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Education Newsఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ.. తెలుగు విద్యార్థులు ఎక్కువ శాతం చదివే కోర్సులివి. పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం ఇంజనీరింగ్ లక్ష్యంగా ఎంపీసీ; మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల ఔత్సాహికులు బైపీసీ; సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకునేవారు సీఈసీ; లా, జర్నలిజం, సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల దృష్టితో హెచ్‌ఈసీలో చేరుతుంటారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న గ్రూప్, నిర్దేశించుకున్న లక్ష్యం ఏదైనా.. పబ్లిక్ పరీక్షల వేళ పూర్తిగా గ్రూప్ సబ్జెక్టులపైనే దృష్టిసారించి మంచి మార్కుల సాధనకు కృషి చేయాలి. ఈ క్రమంలో గ్రూప్‌ల వారీగా విద్యార్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ పద్ధతులు..

ఎంపీసీ...
మూడు సబ్జెక్ట్‌ల (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ను డిస్క్రిప్టివ్ దృక్పథంతో చదవాలి. ఇప్పటినుంచి దాదాపు 90 శాతం సమయాన్ని గ్రూప్ సబ్జెక్ట్‌లకు కేటాయించాలి. జనవరి చివరికి ప్రిపరేషన్ పూర్తి చేసుకుని, ఫిబ్రవరి నెలలో పునశ్చరణ సాగించేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.

మ్యాథమెటిక్స్ :
 1. ప్రస్తుత సమయంలో మ్యాథమెటిక్స్ పరంగా షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌పై పట్టుకు కృషి చేయాలి. ద్వితీయ సంవత్సరంవారు షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షల కోణంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-సమాధానాల రూపంలో ప్రిపరేషన్ సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది.
 2. ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ద్విపద సిద్ధాంతం; ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యత; వృత్తాలు, సమాకలనులు; నిశ్చిత సమాకలనులు; అవకలన సమీకరణాలు; డిమూవర్స్ సిద్ధాంతం, వర్గ సమాసాలు, పరావలయం వంటి అంశాలను బాగా పునశ్చరణ చేయాలి.
 3. మొదటి సంవత్సరం విద్యార్థులు వెక్టార్ అల్జీబ్రా; మాత్రికలు,త్రికోణమితి, సరళ రేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేషన్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.

ఫిజిక్స్ :
 • ద్వితీయ సంవత్సరంలోని మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ వంటి అంశాల్లో పట్టుకు కృషి చేయాలి.
 • మొదటి సంవత్సరం విద్యార్థులు రొటేషనల్ మోషన్; గ్రావిటేషన్; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; సర్ఫేస్ టెన్షన్, థర్మో డైనమిక్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.

కెమిస్ట్రీ :
 • దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
 • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు విద్యుత్ రసాయన శాస్త్రం; పి-బ్లాక్ మూలకాలు, డి,ఎఫ్-బ్లాక్ మూలకాలు, లోహ శాస్త్రం; సాలిడ్ స్టేట్ వంటి అంశాలకు ఎక్కువ సమయం ఇవ్వాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యాంశాలు చదవాలి. వాటికి సంబంధించి సొంత నోట్స్ రూపొందించుకోవడం మేలు.
 • ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కర్బన రసాయన శాస్త్రం; ఆవర్తన పట్టిక; పరమాణు నిర్మాణం; రసాయన బంధం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక చాప్టర్ పూర్తయ్యేలా చూసుకోవాలి.

బైపీసీ...
బోటనీ, జువాలజీలను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. అంతేకాక అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. జనవరి చివరి నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకుని తర్వాత సమయాన్ని రివిజన్‌కు కేటాయించే విధంగా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి.

బోటనీ :
 • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయో టెక్నాలజీ; మైక్రోబ్స్, అణు జీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. బోటనీ విషయంలో ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి.
 • మొదటి సంవత్సరం బోటనీ విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణ నిర్మాణం, విధులు; మొక్కల అంతర్ నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా సాధన చేయాలి.

జువాలజీ :
 • ద్వితీయ సంవత్సర విద్యార్థులు.. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం; అంతస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ -సమన్వయం; శరీరద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
 • ప్రథమ సంవత్సరంవారు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవవ్యవస్థ వంటి అంశాలపై సమగ్ర అవగాహన పొందాలి.
 • జువాలజీలో కూడా గ్రాఫికల్ ప్రజంటేషన్ మార్కుల సాధనలో కీలకంగా ఉంటుంది. కాబట్టి డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయాలి.

ఫిజిక్స్ :
 • ప్రథమ సంవత్సరం విద్యార్థులు లిక్విడ్, గ్యాస్, కైనటిక్ గ్యాస్ థియరీ, రొటేటరీ మోషన్, యాంగులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వేవ్ ఆప్టిక్స్; సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.

కెమిస్ట్రీ :
 • ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేస్తూనే వీలైతే సినాప్సిస్ రూపొందించుకుంటే రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.
 • ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

సీఈసీ...
విద్యార్థులు విశ్లేషణాత్మక, తులనాత్మక ప్రిపరేషన్ సాగించాలి. థియరీ సబ్జెక్ట్‌లైన సివిక్స్, ఎకనామిక్స్‌కు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. గణాంకాలతో కూడుకున్న కామర్స్ విషయంలో తులనాత్మక అధ్యయనం మేలు చేస్తుంది.

సివిక్స్ :
 • మొదటి సంవత్సరం విద్యార్థులు రాజ్యం, ప్రజా స్వామ్యం, ప్రభుత్వం తదితర అంశాలపై సంపూర్ణ నైపుణ్యం పొందాలి. ఆయా అంశాలకు సంబంధించి నిర్వచనాలు షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సమయంలో లాభిస్తుంది.
 • ద్వితీయ సంవత్సరం సివిక్స్‌కు సంబంధించి.. భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, పరిపాలన అంశాలు అత్యంత ప్రాధాన్య అంశాలు. విద్యార్థులు రాజ్యాంగ సంస్థలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి.

కామర్స్ :
 • కీలకమైన కామర్స్‌లో ప్రాక్టీస్ ముఖ్య సాధనం. మొదటి సంవత్సరం విద్యార్థులు పార్ట్-1కు వ్యాపారం-భావనలు, స్వరూపాలు, వ్యవస్థాపన-వ్యవస్థాపకులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. పార్ట్-2లో వ్యాపార గణాంక శాస్త్రంలో మెరుగైన మార్కులకు సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై అవగాహనతో పాటు కంప్యుటేషనల్, తులనాత్మక అధ్యయన నైపుణ్యం పెంచుకోవాలి. ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ షీట్, బ్యాంకింగ్ రీకన్సిలియేషన్ సిస్టమ్‌లపై ఎక్కువ దృష్టిసారించాలి. వీటిలో పట్టుకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
 • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. పార్ట్-1లో మార్కెటింగ్, వ్యాపారం, స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు, కంప్యూటర్ అంశాలపై అవగాహన పొందాలి. పార్ట్-2లో వ్యాపార గణాంక శాస్త్రానికి సంబంధించి ట్రేడింగ్, కన్‌సైన్‌మెంట్, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తదితర అంశాలపై పట్టుసాధించాలి.

ఎకనామిక్స్ :
 • అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదవడం వల్ల సులభంగా అర్థమవుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలు-వాటి నిర్వచనాలు, పట్టికలు, రేఖాపటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలను నిత్యం చదవాలి. వీటితోపాటు బ్యాంకింగ్-ద్రవ్యోల్బణం, జాతీయాదాయం కీలక అంశాలు. వీటి విషయంలో గ్రాఫికల్ అవేర్‌నెస్ కూడా మెరుగైన మార్కులకు ఆస్కారం కల్పిస్తుంది.
 • ద్వితీయ సంవత్సరం వారు ఆర్థిక సమస్యలు-కారణాలు-నివారణ చర్యలు, గణాంక వివరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూనత ఆర్థిక సంస్కరణలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. ప్రతి అంశాన్ని మూల భావనలు, సదరు అంశంలో సమకాలీన సమస్యలు-నివారణ మార్గాలపై అవగాహన పొందుతూ సినాప్సిస్ రూపంలో షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి. తద్వారా స్వల్ప సమాధాన ప్రశ్నలను కూడా ఎంతో సులువుగా రాయగలిగే సామర్థ్యం లభిస్తుంది.

ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు...
 • జనవరి చివరి వారానికి సిలబస్ పూర్తి చేసుకోవాలి.
 • ఫిబ్రవరి నుంచి పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి.
 • ప్రాక్టికల్స్ ఉండే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు జనవరి మూడో వారానికే సిలబస్ పూర్తి చేసుకుని తర్వాత సమయాన్ని ప్రాక్టికల్స్‌పై దృష్టిపెట్టడం మంచిది.
 • ఏ సబ్జెక్ట్ అయినా షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చేలా సంసిద్ధత పొందాలి.
 • జేఈఈ, ఎంసెట్‌లకు కూడా పోటీ పడుతున్నవారు వాటి ప్రిపరేషన్‌ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి.. తర్వాత సమయం మొత్తం ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
 • ప్రతి రోజు ఆరేడు గంటలు స్వీయ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
 • మెమొరీ టిప్స్ పాటించడం మేలు.
 • రీడింగ్‌కే పరిమితం కాకుండా కచ్చితంగా పెన్/పేపర్ ప్రాక్టీస్ అవసరం.
 • ఫిబ్రవరి మొదటి వారంలోపు కనీసం రెండు ప్రీ-ఫైనల్స్‌కు హాజరు కావాలి.
Published date : 20 Nov 2017 04:42PM

Photo Stories