Polity Material for Groups Exams : ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు?
సమాజం ద్వారానే వ్యక్తి అన్ని లక్షణాలను, స్వభావాలను అలవర్చుకుంటాడు. అదేవిధంగా సమాజం నుంచి అనేక ప్రయోజనాలు పొందుతాడు. దీనికి ప్రతిగా సమాజానికి సేవ, సహాయాన్ని అందించాల్సిన కనీస బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉంది.
ప్రాథమిక విధులు
విధి అంటే ఒక వ్యక్తి ఇతరుల కోసం నిర్వర్తించాల్సిన పని లేదా బాధ్యత అని అర్థం. విధులు సమాజ వికాసానికి, దేశాభివృద్ధికి, సామాజిక స్పృహ కల్పించడానికి దోహదం చేస్తాయి. ఇవి దేశ ఐక్యత, సమగ్రతను పెంపొందిస్తాయి. ప్రాథమిక హక్కులనే ఫలాలు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సమాజ జీవనం సాఫల్యం అవుతుంది.
విధులు – రకాలు: సాధారణంగా విధులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి:
ఎ) నైతిక విధులు బి) చట్టబద్ధమైన విధులు
నైతిక విధులు అనేవి ప్రజల నైతిక విలువలు, సామాజిక స్పృహపై ఆధారపడి ఉంటాయి.
ఉదా: పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించడం; అభాగ్యులను, విధివంచితులను ఆదుకోవడం.
చట్టబద్ధమైన విధులు సమాజంతో ఆమోదం పొంది, ప్రభుత్వం గుర్తించిన బాధ్యతలు. వీటిని ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారు.
ఉదా: ట్రాఫిక్ నియమాలు పాటించడం, పన్నులు సక్రమంగా చెల్లించడం.
భారత రాజ్యాంగం – ప్రాథమిక విధులు
ప్రతి పౌరుడు దేశం పట్ల, తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. అందువల్ల వీటిని ప్రాథమిక విధులు అంటారు. వీటిని రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపర్చారు. ప్రారంభంలో పది ప్రాథమిక విధులు ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని రాజ్యాంగంలో చేర్చడంతో వీటి సంఖ్య పదకొండుకు పెరిగింది. ప్రాథమిక విధులు 1977జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. అందువల్ల ఈ రోజును ప్రాథమిక విధుల దినోత్సవంగా పరిగణిస్తారు.
ప్రాథమిక విధులు – లక్షణాలు
ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. అవి..
ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ఇవి నేరుగా అమల్లోకి రావు. వీటి అమలుకోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాలి.
ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు, మరికొన్ని పౌర బాధ్యతలు.
కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సంప్రదాయాలు, మత విలువలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు.
ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని 4–ఎ భాగంలో నిబంధన 51–ఎలో పొందుపర్చారు.
51–ఎ:
ఎ) రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
బి) జాతీయ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఉన్నత ఆదర్శాలను పాటించాలి.
సి) భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించాలి.
డి) దేశ రక్షణకు, జాతీయ సేవకు సదా సన్నద్ధంగా ఉండాలి.
ఇ) భారత ప్రజల మధ్య మత, భాష ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించాలి. స్త్రీల గౌరవాన్ని భంగపరిచేవాటిని త్యజించాలి.
ఎఫ్) భారత మిశ్రమ సంస్కృతి, ఔన్నత్యం, సంప్రదాయాలను గౌరవించి, పరిరక్షించాలి.
జి) అడవులు, సరస్సులు, నదులు, వన్య ప్రాణులు సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడాలి, అభివృద్ధి చేయాలి, జీవులపట్ల కారుణ్యాన్ని కలిగి ఉండాలి.
హెచ్) శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసను, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి.
ఐ) ప్రజల ఆస్తిని సంరక్షించాలి, హింసను ప్రేరేపించే చర్యల్లో పాల్గొనకూడదు.
జె) వ్యక్తిగత, సమష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయాలి. తద్వారా దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడాలి.
కె) 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్యావకాశాలను కల్పించే బాధ్యతను తల్లి/ తండ్రి లేదా సంరక్షకుడు నిర్వర్తించాలి.
ప్రాథమిక విధులు – సుప్రీంకోర్టు తీర్పులు
శ్యాం నారాయణ్ చాక్సీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
ఈ కేసులో జాతీయ పతాకాన్ని ప్రైవేట్ వ్యక్తుల ప్రచారం కోసం వినియోగించరాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
బిజో మాన్యూవల్ Vs కేరళ (1986)
ఈ కేసులో సుప్రీం కోర్టు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జాతీయ గీతాలాపన అనేది మత విశ్వాసాలకు విరుద్ధమైతే ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు మాత్రం అందరూ గౌరవ సూచకంగా నిలబడాలని పేర్కొంది.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ Vs స్టూడెంట్ యూనియన్ (2002)
ప్రాథమిక విధులను విస్మరించరాదని, అవి దేశ సమగ్రతకు, సామాజిక జీవనానికి ఆదర్శంగా ఉంటాయని ఈ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.
డాక్టర్ దాశరథి Vటఆంధ్రప్రదేశ్
ఈ కేసులో ఆస్థాన కవుల హోదా చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
గ్రామీణ వ్యాజ్యాల హక్కుల కేంద్రం Vట ఉత్తరప్రదేశ్ (1986)
పర్యావరణ పరిరక్షణలో ప్రాథమిక విధులను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
నవీన్ జిందాల్ Vట యూనియన్ ఆఫ్ ఇండియా(2004)
జాతీయ జెండాను ఎగురవేయడం భావ వ్యక్తీకరణ కిందకి వస్తుందని, పౌరులకు స్వేచ్ఛగా జెండా ఎగురవేసే హక్కు ఉంటుందని పేర్కొంది
.
ప్రాథమిక విధులు – జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ సూచనలు
1999లో నియమించిన వర్మ కమిటీ ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది. అవి..
జాతీయ పతాకం, జాతీయ గీతం, భారత రాజ్యాంగ పరిరక్షణకు, గౌరవానికి సంబంధించి 1971లో చేసిన చట్టం సరిపోతుందని పేర్కొంది. అదేవిధంగా భారత శిక్షాస్మృతిలో ఉన్న చట్టాల ద్వారా కొన్ని విధులను అమలు చేయవచ్చని చెప్పింది. ఉదాహరణకు..
పౌర హక్కుల పరిరక్షణ చట్టం – 1955,
ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951,
చట్టవ్యతిరేక కార్యకలా΄ాల చట్టం–1967,
వన్య్రపాణి సంరక్షక చట్టం – 1972,
అడవుల పరిరక్షణ చట్టం – 1980,
ఏటా జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి.
అన్ని విద్యా ప్రణాళికల్లో ప్రాథమిక విధులను పాఠ్యాంశంగా చేర్చాలి.
అన్ని విద్యా సంస్థల్లో ఎన్‌సీసీలను తప్పక ప్రవేశ పెట్టాలి.
ప్రసార మాధ్యమాల ద్వారా ప్రాథమిక విధుల గురించి విస్తృత ప్రచారం కల్పించాలి.
ప్రముఖుల వ్యాఖ్యానాలు
ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉన్న విధంగానే ప్రాథమిక విధుల అమలు అనేది వ్యక్తుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది – దుర్గాదాస్ బసు
ప్రాథమిక విధులు కేవలం అలంకార పూర్వకమైనవి – జస్టిస్ కె.పి. ముఖర్జీ
హక్కులు, విధులనేవి ఒకే నాణేనికి ఉన్న పార్శ్వాలు (Two sides of a same coin)
– హెచ్.జె. లాస్కే
ప్రాథమిక విధులు అసంబద్ధంగా, గందరగోళంగా ఉన్నాయి – నానీ పాల్కివాలా
విమర్శనాత్మక పరిశీలన
ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడంపై అనేక విమర్శలున్నాయి.
దేశంలో భారత పౌరులు సహజంగా చట్ట విధేయులు, క్రమశిక్షణ ఉన్నవారు అయినప్పుడు వారి బాధ్యతలను ప్రత్యేకంగా గుర్తు చేయడం సమంజసం కాదని కొంతమంది అభిప్రాయం.
అత్యంత ముఖ్యమైన విధులైన సక్రమంగా పన్నులు చెల్లించడం, కుటుంబ నియంత్రణ, ఎన్నికల్లో ఓటు వేయడం లాంటి వాటిని ప్రాథమిక విధుల్లో పొందుపరచలేదు.
ఈ విధులు కేవలం నైతికపరమైన నియమావళిపైనే ఆధారపడి ఉన్నాయి. వీటిని పాటించకపోతే శిక్షించే ఆస్కారం లేదు.
ప్రాథమిక విధుల్లో పేర్కొన్న కొన్ని పదాలకు స్పష్టత లేదు. ఉదా:శాస్త్రీయ దృక్పథం,మిశ్రమ సంస్కృతి,పరిశోధనా స్ఫూర్తి అనే పదాలకు నిర్దిష్ట అర్థాలు లేవు. వీటిని నాలుగో భాగంలో కాకుండా మూడో భాగంలోనే చేర్చి ఉండాల్సింది.
సాధారణంగా ప్రాథమిక విధులు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉండవు. నియంతృత్వ దేశాల రాజ్యాంగంలో మాత్రమే ఇవి ఉంటాయి.
ఇవి చట్ట నిర్దేశానికి, ఆత్మ ప్రబోధానికి మధ్య వైవిధ్యాన్ని కలిగించవచ్చు.
ప్రాథమిక విధుల ప్రయోజనాలు
ప్రాథమిక విధులకు న్యాయసంరక్షణ లేకపోయినా, కొన్ని లోపాలున్నా.. వీటిని రాజ్యాంగంలో చేర్చడం సమంజసమే. ఎందుకంటే విధులు లేకుండా హక్కులను మాత్రమే గుర్తిస్తే అది బాధ్యతారాహిత్యానికి దారితీస్తుంది. అదేవిధంగా హక్కులు లేని బాధ్యతలు బానిసత్వానికి ప్రతీక అవుతాయి. కాబట్టి హక్కులు, విధులు, పరస్పర ΄ోషకాలు. అవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల లాంటివి.
ప్రాథమిక విధులు కూడా ఆదేశిక సూత్రాల్లా ప్రభుత్వ విధానాలు, కార్యాచరణను ప్రభావితం చేస్తాయి.
ఆచరణాత్మకమైనవి కాకపోయినా నిరంతరం పౌరుల నైతిక బాధ్యతలను గుర్తు చేస్తాయి.
అనేక వైవిధ్యాలున్న భారతదేశంలో పౌరులు చిత్తశుద్ధితో విశాల దృక్పథంతో బాధ్యతాయుత పౌరులుగా దేశ ఐక్యతకు, సమగ్రతకు, కృషి చేసేలా దోహద పడతాయి.
ప్రాథమిక విధులను, ప్రాథమిక హక్కులపై ఉన్న హేతుబద్ధమైన పరిమితులుగా పరిగణించవచ్చని 1992లో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులెన్ని?
1) 8 2) 9 3) 10 4) 11
2. ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు?
1) రాజమన్నార్
2) సర్కారియా
3) స్వరణ్ సింగ్ కమిటీ
4) బల్వంత్ రాయ్ కమిటీ
3. ప్రాథమిక విధులకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1) ప్రాథమిక హక్కులతోపాటే వీటిని
ప్రవేశ పెట్టారు
2) ఆదేశిక సూత్రాల స్థానంలో వీటిని
ప్రవేశ పెట్టారు
3) వీటిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు
4) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో కలిపి ప్రవేశ పెట్టారు
సమాధానాలు: 1) 4 2) 3 3) 3
Tags
- appsc and tspsc groups material
- Competitive Exams
- Government Jobs
- competitive groups exams
- previous and preparatory questions for groups exams
- police jobs group exams
- Education News
- Sakshi Education News
- polity material and model questions
- appsc polity material
- tspsc polity material
- polity material and model questions for group exams
- group exams and model questions for polity
- appsc and tspsc polity material
- gkbitbanks
- competitive exams bitbanks