Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు (కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, న్యాయ శాఖ)
రాష్ట్రపతి వీటో అధికారం
వీటో అనే పదం లాటిన్ భాష నుంచి గ్రహించారు. ఆంగ్లంలో దానిని ఫర్బిడ్ అంటారు. వీటో అనగా తిరస్కరించే అధికారం. ఏదైనా బిల్లు కాని, ప్రతిపాదన కాని, పార్లమెంటు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, ప్రకరణ 111 ప్రకారం రాష్ట్రపతి ఈ కింది ప్రత్యామ్నాయాలను కలిగి ఉంటారు.
ఎ) బిల్లును ఆమోదించవచ్చు.
బి) బిల్లును ఆమోదించకుండా అట్టిపెట్టవచ్చు
సి) పున:పరిశీలనకు పంపవచ్చు (ద్రవ్యబిల్లు తప్ప మిగతా బిల్లులను)
డి) బిల్లుపై ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండవచ్చు
రాష్ట్రపతి సూచించిన సమయంలో సభలు బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండవ పర్యాయం రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.
ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ క్రింది వీటో అధికారాలు ఉన్నాయి.
1. అబ్సల్యూట్ వీటో
2. క్వాలిఫైడ్ వీటో
3. సస్పెన్సివ్ వీటో
4. పాకెట్ వీటో
చదవండి: Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు
అబ్సల్యూట్ వీటో
ఏదైనా బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే ఎట్టి పరిస్థితులలోను చట్టంగా మారదు. ఆ బిల్లు శాశ్వతంగా రద్దవుతుంది. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భాలలో అబ్సల్యూట్ వీటోను వినియోగించవచ్చు.
- ప్రయివేటు మెంబర్స్ బిల్లుల విషయంలో (మంత్రులుకాని శాసనసభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేటు బిల్లులంటారు)
- క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపించి, రాష్ట్రపతి ఆమోదం తెలపక ముందే మంత్రిమండలి రాజీనామా చేస్తే, కొత్తగా ఏర్పడిన మంత్రిమండలి ఆ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు కొన్ని బిల్లుల విషయంలో భారత రాష్ట్రపతి ఈ అధికారాన్ని వినియోగించవచ్చు. ఉదా. 1954లో రాజేంద్రప్రసాద్, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పీఈపీఎస్‌యూ అనుమతి ఉపక్రమణ బిల్లులో, అలాగే 1991లో ఆర్. వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించిన బిల్లులో అబ్సల్యూట్ వీటోను వినియోగించారు. (రాష్ట్రపతి పూర్వ అనుమతి లేకుండా ప్రవేశపెట్టారు)
- రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ప్రకరణ 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి నివేదించవచ్చు. ఈ సందర్భంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని నిరాకరిస్తే ఆ బిల్లులు ఎప్పటికీ చట్టంగా మారవు.
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
క్వాలిఫైడ్ వీటో
పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే, రెండవ పర్యాయం అదే బిల్లును పార్లమెంటు 2/3వంతు మెజారిటీతో ఆమోదించి పంపితే, రాష్ట్రపతి / అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదాన్ని తెలపాలి. ఈ తరహా వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఈ అధికారం అమెరికా అధ్యక్షునికి ఉంది.
సస్పెన్సివ్ వీటో
పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినపుడు మొదటి పర్యాయం దానిని తిరస్కరిస్తే, రెండవ పర్యాయం అదే బిల్లును పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించి తిరిగి పంపితే భారత రాష్ట్రపతి ఆ బిల్లులను తప్పనిసరిగా ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోయినా, ఆమోదించినట్లుగా భావిస్తారు.
పాకెట్ వీటో
బిల్లులను పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపినప్పుడు ఆ బిల్లులను తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా రాష్ట్రపతి నిరవధికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేస్తారు. దీనినే పాకెట్ వీటో అంటారు. ఉదాహరణకు 1986లో రాజీవ్‌గాం«ధీ ప్రధానమంత్రిగా, జైల్‌సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్లు విషయంలో ఈ వీటో అధికారాన్ని వినియోగించారు. సుమారు 18 నెలలు బిల్లును అట్టిపెట్టారు.
రాష్ట్ర బిల్లులపై వీటో అధికారం
రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులను గవర్నర్ అవసరమనుకుంటే రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. (ప్రకరణ 201). ఆ విధంగా పంపించి బిల్లులపై రాష్ట్రపతి ఈ కింది ఐచ్చికాలు ఉంటాయి.
1. తన ఆమోదాన్ని తెలపవచ్చు.
2. ఆమోదం తెలపకుండా అట్టిపెట్టవచ్చు.
3. సంబంధిత బిల్లును రాష్ట్ర శాసనసభ పునర్ పరిశీలనకు పంపమని (ద్రవ్య బిల్లును మినహాయించి) గవర్నర్‌ను ఆదేశించవచ్చు.
ఆ సంబంధిత బిల్లును శాసనసభ సవరించి లేదా సవరించకుండా మరొకసారి రాష్ట్రపతికి నివేదిస్తే ఈ సందర్భంలో కూడా రాష్ట్రపతి తమ ఆమోదాన్ని తెలపవచ్చు లేదా నిరాకరించవచ్చు. రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అధికారం ఉంటుంది.
- ఒక బిల్లుగాని, ప్రతిపాదనగాని, రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు నిర్ణీత గడువులోగా రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్థిక అధికారాలు – విధులు
- పార్లమెంటులో ప్రవేశపెట్టే ద్రవ్య బిల్లులకు పూర్వానుమతిని ఇవ్వటం – ప్రకరణ 117(1)
- ప్రతి ఐదు సం.రాలకు ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం – ప్రకరణ 280
- రాష్ట్రపతి అనుమతితోనే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయ్యాలి – ప్రకరణ 266
- భారత ఆగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలోనే ఉంటుంది. దానినుంచి పార్లమెంటు ఆమోదం పొందే వరకు వచ్చే అత్యవసర ఖర్చులకు అడ్వాన్స్ మంజూరు చేయడం – ప్రకరణ 267
- ఆర్థిక సంవత్సర ప్రారంభంలో వార్షిక బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను తన పేరుపై పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వటం – ప్రకరణ 112
చదవండి: Indian Polity Notes for Competitive Exams: భారత రాష్ట్రపతి–ఎన్నిక పద్ధతి, అధికార విధులు
న్యాయాధికారాలు – విధులు (ప్రకరణ – 72)
- రాజ్యాంగాధినేతగా ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు లేదా శిక్ష అమలు వాయిదా వేయవచ్చు లేదా ఒక రకమైన శిక్షను మరొక రకంగా మార్చవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం న్యాయస్థానాల పొరపాట్లను సరిదిద్దడం. రాష్ట్రపతి దేశ అధిపతి కనుక, పౌరుల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి.
- ఈ అధికారాలను రాష్ట్రపతి మంత్రి మండలి సలహామేరకు నిర్వర్తిస్తారు. విచక్షణాధికారాలకు ఆస్కారం లేదు.
- క్షమాభిక్ష అధికారాలను వినియోగించే సమయంలో రాష్ట్రపతి ప్రజాభిప్రాయాన్ని, బాధిత కుటుంబాల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
- క్షమాభిక్ష పెట్టడం: శిక్షను రద్దుచేసి క్షమాభిక్షను ప్రసాదించడం. క్షమాభిక్ష ఇచ్చినంత మాత్రాన నేరం నుంచి విముక్తిగా భావించరాదు.
- శిక్షను తగ్గించడం: శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్ష కాలాన్ని తగ్గించడం.
- శిక్షలను మార్పు చేయడం: శిక్ష కాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం. ఉదాహరణకు రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.
- శిక్ష అమలు కాకుండా వాయిదా వేయడం: శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్ ప్రభుత్వ పరిగణనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
- శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం: ముద్దాయి ప్రత్యేక పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ఈ ఉపశమనాన్ని ఇస్తారు. మానసికస్థితి సరిగా లేనప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, వయోభారం ఉన్నప్పుడు, గర్భిణీ విషయంలో ఈ వెసులుబాటు ఉంటుంది.
సలహా అధికారం (ప్రకరణ 143)
- రాజ్యాంగపరమైన చట్టపరమైన, ప్రజాసంబంధమైన వ్యవహారాల్లో సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి తీసుకోవచ్చు(143వ ప్రకరణ).అయితే దీనిని సలహాగా మాత్రమే పరిగణించవచ్చు. రాష్ట్రపతి దీనికి బద్దుడు కావలసిన అవసరం లేదు.
సైనిక అధికారాలు
- 53(2) ప్రకరణ ప్రకారం, రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి. అతడు త్రివిధ దళాలకు అధిపతి.
- యుద్ధం ప్రకటించడానికి, సంధి షరతులు చేసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది.
- రక్షణ శాఖను నిర్వహించే రక్షణ మంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రించడం మొదలగునవి.
చదవండి: Indian Polity Notes for Group 1&2: భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం
దౌత్యాధికార విధులు
- అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రతినిధిగా వ్యవహరించుట
- మిత్ర దేశాలకు రాయబారులను నియమించటం
- భారత దేశానికి, ఇతర దేశాలకు మధ్య సంబంధాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయడం
- ఐక్య రాజ్య సమితికి భారత దేశ ప్రతినిధులను నియమించడం
రాష్ట్రపతి ఇతర అధికారాలు – మినహాయింపులు
- రాష్ట్రపతి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ , సభ్యులు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్స్, సెంట్రల్ ఇన్ ఫర్మేషన్ కమిషన్ సభ్యులను, పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్, ఇతర సభ్యులను, ప్రసార భారతి చైర్మన్, ప్రెస్ ట్రస్ట్ చైర్మన్ తదితరులను నియమిస్తారు.
- రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగిస్తారు.
- ప్రకరణ 361 ప్రకారం, రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు కల్పించారు. అతడు పదవిలో ఉండగా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు. అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఐతే రెండు నెలల ముందస్తు నోటీస్‌తో సివిల్ కేసులు నమోదు చేయవచ్చు.
- రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు ఏ న్యాయస్థానానికి బాధ్యత వహించడు.
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు