Prof G Haragopal: కోచింగ్ సెంటర్లది వ్యాపారమే.. ఇదే మీకు అసలైన ఆయుధం..
పైపైన చదవకుండా, మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసిన వారే పరీక్షల్లో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. విస్తృత భావజాలంతో గ్రూప్–1 సిలబస్‌ను రూపొందించామని.. విశాల ఆలోచనా ధోరణితో అవగాహన చేసుకుంటే అభ్యర్థులు సునాయాసంగా గెలుపు బాట పట్టవచ్చని తెలిపా రు. గ్రూప్స్ పరీక్షల నేపథ్యంలో హరగోపాల్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం..
TSPSC గ్రూప్–1 నోటిఫికేషన్.. శాఖలవారీగా పోస్టులు.. వయోపరిమితి సడలింపు!
ఈ అంశాల నుంచే 50 మార్కులకు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశాల దృక్పథంతో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశలోనే పరీక్ష సిలబస్ విభిన్నంగా ఉండాలని నేను చైర్మన్‌గా 18 మందితో ప్రభుత్వం కమిటీ వేసింది. అందులో కోదండరాం, చుక్కా రామయ్య సహా పలువురు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ నేపథ్యం. భౌగోళిక పరిస్థితులకు ప్రాధాన్యమిచ్చాం. ఈ అంశాల నుంచే 50 మార్కులకు పేపర్ ఉంటుంది. రాష్ట్ర పరిణామాలపై జనరల్ నాలెడ్జ్, ఆంగ్ల భాషా నైపుణ్యం (టెన్త్ స్టాండర్డ్స్)పై కనీస అవగాహన ఉండాలి. మేథ్స్‌ను కూడా సిలబస్‌లో జోడించాలనుకున్నాం. కానీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో చేయలేకపోయాం.
రాతపరీక్షలోనే..
పాలనా సామర్థ్యం, ప్రజలతో డీల్ చేసే విధానం, వ్యక్తిత్వ వికాసం వంటివి ఇంటర్వ్యూ ద్వారానే తెలుస్తాయి. యూపీఎస్సీ కూడా ఇంటర్వ్యూకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇంటర్వ్యూ తీసేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా ఉండాలనే కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు తొలగించారు కాబట్టి రాతపరీక్షలోనే సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి.
TSPSC & APPSC: గ్రూప్స్ పరీక్షల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
ఇలా చేస్తే అభ్యర్థి ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలడు..
భారత రాజ్యాంగాన్ని లోతుల్లోకి వెళ్లి చదవాలి. ఉదాహరణకు ఆర్టికల్–3. నాటి దేశ పరిస్థితులను బట్టి దానిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దేశం సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని అప్పట్లో అంబేడ్కర్ ప్రతిపాదించారు. ఇలా లోతుగా తెలుసుకుంటేనే గ్రూప్స్ రాసే విద్యార్థులకు సమగ్ర అవగాహన ఉంటుంది. సులువుగా విజయం సాధిస్తారు. ఆదేశిక సూత్రాలను సూచించే పార్ట్–4 చాలా ముఖ్యం. ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనేది దీని నుంచే సమగ్రంగా తెలుసుకోవచ్చు. రాజ్యాంగం పార్ట్–3లో పౌరులకు స్వేచ్ఛ ఇస్తే.. పార్ట్–4లో సామాజిక న్యాయం ఉంటుంది.› ఈ రెండింటికీ మధ్య లింక్‌ను తాతి్వక, సామాజిక కోణంలో అవగతం చేసుకున్న విద్యార్థి.. ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలడు. ఇలాంటి వాటిని గైడ్ ద్వారా ఫాలో అవడం కష్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి మాత్రమే కాకుండా.. వాటి నేపథ్యం తెలుసుకుంటే మంచి మార్కులొస్తాయి. జనరల్ ఎస్సే విషయంలో సమకాలీన పరిస్థితులను ఎక్కువ అధ్యయనం చేయాలి. నదీజలాలు, పర్యావరణ సమస్యలు వంటి తాజా పరిణామాలు, గత చరిత్ర తెలుసుకోవాలి.
ఇదే అసలైన ఆయుధం..
ఒక్కో అభ్యర్థి ఒక్కో రకమైన భావజాలంలో ఉంటారు. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ముందుగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అదే అసలైన ఆయుధం. యూనివర్సిటీలు విద్యార్థులకు అందించాల్సింది ఇదే. ఈ మధ్య ప్రత్యేక కోచింగ్ సెంటర్లు పెడుతున్నారు. ఏపీ స్టడీ సర్కిల్, తెలంగాణ స్టడీ సర్కిళ్ల పేరుతో ప్రభుత్వాలే నడుపుతున్నాయి. అక్కడ చేయాల్సిందల్లా అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. ఇంగ్లిష్ భాష అంటే భయపడొద్దు. కనీస పరిజ్ఞానం పొందితే చాలు. గ్రూప్–1 అధికారికి భాష ప్రధానం కాదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే శక్తి ఉండాలి.
పరీక్ష రాసే టైమ్‌లో ఇలా జాగ్రత్తగా ఉండాలి..
పోటీ పరీక్షల్లో ఎప్పుడూ ప్రశ్నలను ట్విస్ట్ చేసి ఇస్తారు. చాలామంది ఈ విషయాన్ని సరిగా గమనించరు. మనకు తెలిసింది రాయాలనే ఉత్సాహం పరీక్షలో సరికాదు. పరీక్షలో అడిగింది రాయడమే ముఖ్యం. ప్రశ్నను రెండు మూడుసార్లు జాగ్రత్తగా చదవాలి. జవాబు రాసేప్పుడూ ప్రశ్నను మరోసారి చదవాలి. అప్పుడే సమాధానం సరిగా రాస్తున్నది లేనిది తెలుస్తుంది. అడిగింది రాసిన అభ్యర్థులు పాసవుతారు. యూపీఎస్సీలో గతంలో వచ్చిన పేపర్లు తెచ్చుకోవాలి. వాటిల్లోంచి కొన్ని ప్రశ్నలు ఎంపిక చేసుకోవాలి. పుస్తకాల నుంచి సమాధానం సంగ్రహించాలి. తర్వాత పుస్తకాలు చూడకుండా సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. వాటిని నిపుణులకు చూపించి ఎలా ఉందో, ఇంకెలా రాయోలో తెలుసుకోవాలి. దీనివల్ల మంచి మార్కులు వచ్చే వీలుంది.
కోచింగ్ సెంటర్లది వ్యాపారమే.. ఏ విధమైన నైపుణ్యం లేని వ్యక్తులతో..
చాలా కోచింగ్ సెంటర్లు వ్యాపార ధోరణిలో వెళ్తున్నాయి. స్టడీ మెటీరియల్స్ లక్షల్లో అమ్ముడుపోతాయి. కానీ వాటిని ఏ విధమైన నైపుణ్యం లేని వ్యక్తులతో రూపొందిస్తున్నారు. ఎలాంటి అవగాహన లేని మెటీరియల్స్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తెలంగాణపై జయశంకర్, అడపా సత్యనారాయణ వంటివారు రాసిన పుస్తకాలు చదవాలి.
కీలక సమయంలో తెలుగు అకాడమీ డీలా పడింది..
గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం, మెటీరియల్‌ను కొనొద్దు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెటీరియల్ అందించే క్రమంలో ఒక్కోసారి తెలుగు అకాడమీ కూడా తప్పులు చేస్తోంది. ఉదాహరణకు ‘అనార్కిజం’అనే పదాన్ని ‘అరాచకవాదం’అని తర్జుమా చేశారు. అనార్కిజం అంటే పరిమితుల్లేని స్వేచ్ఛ. ఇదో ఫిలాసఫీ. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన ఉంటేనే ఇలాంటివన్నీ గుర్తించడం సాధ్యమవుతుంది. గైడ్లు తయారుచేసే వాళ్లకు ఇవి తెలియవు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో తెలుగు అకాడమీ ముందుండాలి. ఓపెన్ యూనివర్సిటీ రంగంలోకి దిగాలి. అనుభవజు్ఞలతో స్టడీ మెటీరియల్ అందించాలి. అకాడమీ గందరగోళంలో ఉంది. పుస్తకాలు ప్రింట్ చేయడం లేదు. కీలక సమయంలో డీలా పడింది. ఇప్పటికైనా విద్యార్థులకు చేయూతగా ఉండాలి.
తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
శాఖల వారీగా గ్రూప్-1 పోస్టుల వివరాలు.. వయోపరిమితి ఇలా .. :
పోస్టు | ఖాళీలు | వయో పరిమితి |
డిప్యూటీ కలెక్టర్ | 42 | 18–44 |
డీఎస్పీ | 91 | 21–31 |
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ | 48 | 18–44 |
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 4 | 21–31 |
జిల్లా పంచాయతీ అధికారి | 5 | 18–44 |
జిల్లా రిజి్రస్టార్ | 5 | 18–44 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్) | 2 | 21–31 |
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 8 | 18–44 |
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 26 | 21–31 |
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2) | 41 | 18–44 |
అసిస్టెంట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమం) | 3 | 18–44 |
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) | 5 | 18–44 |
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) | 2 | 18–44 |
జిల్లా ఉపాధి కల్పనాధికారి | 2 | 18–44 |
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) | 20 | 18–44 |
అసిస్టెంట్ ట్రెజరర్(ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) | 38 | 18–44 |
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సరీ్వస్) | 40 | 18–44 |
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) | 121 | 18–44 |
TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్టడం ఎలా? ఎలాంటి బుక్స్ చదవాలి..?
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |
చదవండి:
TSPSC గ్రూప్–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!
TSPSC గ్రూప్–3 పరీక్షా విధానం ఇదే!
TSPSC గ్రూప్–4 సర్వీసెస్ ఇవే... పరీక్ష విధానం కోసం చూడండి