TSPSC & APPSC: గ్రూప్స్ పరీక్షల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
అందుకే ప్రతి అధికారికీ, ఉద్యోగికీ దానిపై అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా 20-30 ఏళ్ల పాటు సేవలందించాల్సిన అధికారులు పలు రంగాలు, వాటిలోని రోజువారీ మార్పులు, అభివృద్ధి తదితరాలను లోతుగా విశ్లేషించగలగాలి. అందుకే గ్రూప్-1లో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకంగా ఐదో పేపరుగా పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రెండు యూనిట్లు దీనిపైనే ఉన్నాయి. వాటికే 100 మార్కులున్నాయి. డాటా ఇంటర్‌ప్రిటేషన్‌కు మరో 50 మార్కులుంటాయి. కాబట్టి అభ్యర్థులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే’’ అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
గ్రూప్-1,2,3,4లోపాటు ఇతర పోటీ పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్‌లో భాగంగానూ సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయని గుర్తు చేశారు. కాబట్టి ఇందులో ఏయే అంశాలపై అవగాహన పెంచుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏయే పుస్తకాలు చదవాలన్న అంశాలపై ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..
☛ దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తున్న కృషి, ప్రధాన ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నమోదవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవాలి. తాజా ఉపగ్రహ ప్రయోగాలు, వాటి ఫలితాలు,సామాజికాభివృద్ధికి వాటి దోహదం తదితరాలపై దృష్టి పెట్టాలి. రోజువారీ జీవితంలో అవి ఉపయోగపడే తీరును తెలుసుకోవాలి.
☛ ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై అవగాహన ఉండాలి. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో వాటి పాత్రను వివరించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కీలకమైన కంప్యూటర్ వినియోగం, రోబోటిక్స్, నానో టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి.
☛ భారత అంతరిక్ష విధానంలో దేశంలో జరుగుతున్న కొత్త ఉపగ్రహ ప్రయోగాలు, కొత్త కార్యక్రమాలపై (చంద్రయాన్, ఎడ్యూశాట్ తదితర) అవగాహన పెంచుకోవాలి.
☛ స్పేస్ టెక్నాలజీ సమాజాభివృద్ధికి దోహద పడుతున్న తీరుపై అధ్యయనం అవసరం. విద్య, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, వరదలు, తుఫాను, సునామీ, వాతావరణ మార్పులు తదితరాలను తెలుసుకోవాలి.
● వ్యవసాయ రంగంలో ఎలాంటి నూతన విధానాలు తీసుకు రాగలుగుతున్నామన్నది చదువుకోవాలి. ఉపగ్రహ ప్రయోగాలతో రైతులకు ఉపయోగాలేమున్నాయి? తెలంగాణలో వాతావరణ పరిస్థితులేమిటి? ఇక్కడ ఏ టెక్నాలజీ ఉపయోగించాలి? ఎలాంటి పంటలు వే యొచ్చు? ఆధునిక వ్యవసాయ విధానాలేమిటి? ఏ పంటలు వేయాలి, ఏ పురుగు మందులు వినియోగించాలి వంటివాటిపై అవగాహన ఉండాలి.
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..
● మరో ప్రధానాంశం నీటి విధానం. తెలంగాణలో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సైన్స్ టెక్నాలజీ వల్ల మేలు చేయవచ్చన్నది విశ్లేషించాలి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటన్నది చెప్పాలి.
● తుపానులు, సైక్లోన్లు, వరదలు ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మార్పులేమిటి? వర్షాలు కురవాల్సిన సమయంలో ఎందుకు కురవడం లేదు? కారణాలేమిటి? సునామీ ప్రభావమేమిటి? ఎందుకొస్తోంది? ముందస్తు జాగ్రత్తలేం తీసుకోవచ్చు? ఇలాంటివి తెలుసుకోవాలి. వాతావరణ మార్పుల సమయంలో పంటల విధానం ఎలా ఉండాలన్నది చదువుకోవాలి.
Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!
☛ జల, అణు శక్తి, వాటి వినయోగం, ప్రభుత్వ చర్యలను తెలుసుకోవాలి. బయో మాస్, వ్యర్థాల ఆధారిత ఇంధన వనరుల ఉత్పత్తి, సౌర, పవన విద్యుత్‌లపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా వ్యవసాయ రంగ ఉప ఉత్పత్తులేమిటి? గ్యాస్ ఆధారిత పరిశ్రమల పరిస్థితేమిటి? గోబర్ గ్యాస్, వర్మి కంపోస్ట్ ఎరువులను ఎలా వాడుకోవాలి, వాటి ప్రయోజనాలేమిటన్నది తెలుసుకోవాలి.
వనరుల విషయానికి వస్తే.. పెట్రోల్ పరిస్థితేమిటి? పెట్రో వనరులు అయిపోతే ప్రత్యామ్నాయమేమిటి? సమస్యను ఎలా అధిగమించాలి? నైట్రోజన్ గ్యాస్ వస్తున్నందున దాని వినియోగమెలా? కంప్రెస్డ్ గ్యాస్ పరిస్థితేమిటన్న అంశాలపై దృష్టి పెట్టాలి. విద్యుత్తు వాడకం తగ్గించడానికి వాడుతున్న నియాన్ బల్బుల ప్రత్యేకతేమిటో తెలిసుండాలి. సౌర, పవన విద్యుత్‌పై పెట్టాల్సిన పెట్టుబడులు, ప్రయోజనాలేమిటన్నది విశ్లేషించాలి.
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేరకే ఉద్యోగాల భర్తీ
నూతన మార్పులు ఇలా..
1. సైన్స్‌లో ప్రాథమికాంశాల నుంచి తాజా పరిణామాల వరకు అవగాహన పెంచుకోవాలి. వ్యాధులు, టీకాలు, సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణలు తెలుసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్‌ల స్వభావం తెలియాలి. నివారణ చర్యలపైనా అవగాహన ఉండాలి మొక్కలు, అటవీ కీటకాలు, ఔషధ మొక్కల వినియోగాన్ని విశ్లేషించాలి. ఔషధ మొక్కల ఉపయోగం, వాటి పెంపకం, అందులో జాగ్రత్తలను విశ్లేషించాలి.
2. బయో టెక్నాలజీకి సంబంధించి ఆహార భద్రత, ఆ దిశగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు, వాటి అమలు తీరు, డీ-ఫ్లోరినేషన్ వంటివాటిని తెలుసుకోవాలి. తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య, కారణాలు, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఎందుకుంది వంటివాటిపై అవగాహన ఉండాలి. రాక్, సాయిల్ స్ట్రక్చర్ వల్ల ఇది వస్తుందన్న విషయం తెలియాలి. సమస్య నివారణకు ఏం చేయాలో సూచించగలగాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇందుకెలా దోహదపడుతుందో విశ్లేషించాలి. రెజిన్స్ (ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఇనార్గానిక్ మాలిక్యూల్స్) ద్వారా ఫ్లోరోసిస్‌ను కాస్త తగ్గించవచ్చని, ఫ్లోరైడ్, హార్డ్ వాటర్‌ను తగ్గించవచ్చని అవగాహన పెంచుకోవాలి. సముద్ర జలాల్లో ఏముంటుంది, బావి నీటిలో, మినరల్ వాటర్‌లో ఏముంటాయన్న కనీస విషయాలు తెలియాలి.
3. బయో టెక్నాలజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేయాలి. హ్యూమన్, ప్లాంట్, ఫార్మ్ బయో టెక్నాలజీల్లోని ముఖ్యాంశాలు, పూర్వాపరాలు తెలుసుకోవాలి. వ్యవసాయ రంగ అభివృద్ధిలో బయో టెక్నాలజీ పాత్రపై అధ్యయనం చేయాలి. బయో ఫెర్టిలైజర్ అంటే ఏమిటి, అదెలా పని చేస్తుంది. వ్యవసాయ అధికారుల సాయం ఎలా పొందాలన్న అంశాలను విశ్లేషించాలి.
4. నిత్యం జీవితంలో సైన్స్: వ్యాధులను తీసుకుంటే... డెంగీ జ్వరం ఎందుకొస్తోంది, దానిపై పరిశోధనలు ఏమున్నాయి, ఎలా నియంత్రించాలన్నది తెలియాలి. స్వైన్ ఫ్లూ, హెచ్ ఐవీ, రేబిస్, టీబీ, మలేరియా తదితరాల మౌలికాంశాలు కచ్చితంగా తెలిసుండాలి.
గ్రూపు-2లో ఇలా..
గ్రూపు-2లో మొత్తం పది యూనిట్లున్నాయి. వాటిలో రెండు సైన్స్ టెక్నాలజీకి సంబంధించినవి. కాకపోతే గ్రూప్ 1 తరహాలో లోతైన విశ్లేషణ గ్రూప్-2, 3లకు అవసరం లేదు.
ఏఏ పుస్తకాలు చదవాలంటే..?
ఎన్ని రంగాలున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం. దీన్ని విస్మరిస్తే పురోగతి ఉండదు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోవాలి. కానీ ఇది ఏవో నాలుగు పుస్తకాలు చదివితే రాదు. క్రమం తప్పకుండా పత్రికలు చదువుతుండాలి. 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ పుస్తకాలు చదవాలి. అంతేగాక పదజాలంపైనా పట్టు సాధించాలి. పరీక్షలో సాంకేతిక పదాలనే రాయాలి. లేదంటే మార్కులు సాధించడం కష్టం. వాటిని కచ్చితంగా చూస్తారు.