Skip to main content

TGPSC Group 1 Topper Success Story: ఒకటే లక్ష్యం.. అది సాధించే వరకు ప్రయత్నం: హరవర్ధన్‌ రెడ్డి

‘జీవితంలో స్పష్టంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాని నుంచి దృష్టి మరల్చకుండా కృషి చేస్తే తప్పక విజయం లభిస్తుందని, ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో ముఖ్యమని’ అంటున్నారు టీజీపీఎస్సీ గ్రూప్‌–2 టాపర్‌.. నారు వెంకట హరవర్ధన్‌ రెడ్డి. టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన.. గ్రూప్‌–2 ఫలితాల్లో 447 మార్కులతో టాపర్‌గా నిలిచిన హరవర్ధన్‌ రెడ్డి సక్సెస్‌ స్పీక్స్‌..
TGPSC Group 1 Topper Harsha Vardhan Reddy Sucess Story

ఏపీ నుంచి టీఎస్‌కు

మా స్వస్థలం ప్రకాశం జిల్లా కంభం. అయితే మా నాన్న రమణా రెడ్డి వృత్తి రీత్యా తెలంగాణలోనే విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కోదాడ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నా విద్యాభ్యాసం 1 నుంచి 7వ తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్మీడియెట్‌ విజయవాడలో.. ఆ తర్వాత బీటెక్‌(సీఎస్‌ఈ)ను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)– తాడేపల్లిగూడెంలో పూర్తి చేశాను.

నాన్న స్ఫూర్తితో

గ్రూప్‌–2ను ఎంచుకోవడానికి మా నాన్ననే నాకు స్ఫూర్తిగా చెబుతాను. ఆయన ప్రభుత్వ సర్వీసులో ఉండడంతో.. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. సామాజిక సేవ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇదే స్ఫూర్తితో గ్రూప్స్‌ వైపు అడుగులు వేశాను.

2021 నుంచి ప్రిపరేషన్‌

గ్రూప్స్‌ లక్ష్యంగా చేసుకున్నాక.. 2021 నుంచి గ్రూప్స్‌ ప్రిపరేషన్‌కే సమయం కేటాయించాను. బీటెక్‌ పూర్తయ్యాక ఎలాంటి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌కు కూడా ప్రయత్నించలేదు. తొలుత సివిల్స్‌కు ఆన్‌లైన్‌లో కొంత కోచింగ్‌ తీసుకున్నాను. ఆ తర్వాత గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు వెలువడడంతో దృష్టి గ్రూప్స్‌ వైపు పెట్టాను.

చదవండి: Priyanka Group-1 Topper : మొదటి ప్రయత్నంలోనే టాప‌ర్‌...నా ల‌క్ష్యం ఇదే

రోజుకు పది గంటలు

ప్రిపరేషన్‌ క్రమంలో రోజుకు పది గంటల సమయం కేటాయించాను. గ్రూప్‌–1, గ్రూప్‌–2 రెండిటికీ ప్రిపరేషన్‌ సాగించినప్పటికీ.. గ్రూప్‌–2కు ఎక్కువ దృష్టిపెటాను. గ్రూప్‌–2లో విజయానికి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలపై పట్టు సాధించడం ఎంతో ముఖ్యం. ఆ బలం నాలో ఉందని గ్రహించి గ్రూప్‌–2కు మాత్రమే సమయం కేటాయించాను. 

ప్రామాణిక పుస్తకాలు

ప్రిపరేషన్‌ కోసం ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఇండియన్‌ హిస్టరీకి నిధి సింఘానియా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వి ప్రకాశ్‌ పుస్తకం, అదే విధంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అనుసరించాను. ప్రతి పుస్తకంలోనూ గ్రూప్స్‌ సిలబస్‌కు సరితూగే అంశాలను ఎంచుకుని వాటిని మాత్రమే చదివేలా ఫోకస్‌ పెట్టాను.

ఆన్‌లైన్‌ టూల్స్, న్యూస్‌ పేపర్స్‌

కరెంట్‌ అఫైర్స్‌ కోసం కాంపిటీటివ్‌ వెబ్‌సైట్స్‌ను, అదే విధంగా హిందూ పత్రికను చదివాను. వాటిలోని అంశాలను కోర్‌ అంశాలతో పోల్చుకుంటూ.. ముఖ్యమైన గణాంకాలను పుస్తకంలో పొందుపర్చుకున్నాను. గత ప్రశ్న పత్రాలను పోల్చుకుంటూ న్యూస్‌ పేపర్స్‌ చదవడం ఫలితంగా కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ప్రశ్నల తీరు, ముఖ్యమైన అంశాలను గుర్తించడం వంటి నైపుణ్యం లభిస్తుంది. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

గ్రూప్‌–2 నోట్స్‌.. ప్రత్యేకంగా

సాధారణంగా పోటీ పరీక్షలకు సొంత నోట్స్‌ రూపొందించుకోవడం ఎంతో ముఖ్యమనేది వాస్తవం. అయితే ఈ విషయంలో గ్రూప్‌–2కు సంబంధించి మరింత ప్రత్యేకంగా వ్యవహరించాలి. గ్రూప్‌–2 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.. కాబట్టి.. ఆయా అంశాలకు సంబంధించి నోట్స్‌లో ఎక్కువ శాతం గణాంకాలు ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. దీనివల్ల రివిజన్‌ సమయంలో ఎంతో సమయం ఆదా అవుతుంది. ఆయా అంశాలకు సంబంధించి సదరు గణాంకాలను చదవగానే వాటి పూర్వాపరాలు సైతం జ్ఞప్తికి వస్తాయి.

లక్ష్యం ఒకటే నిర్దేశించుకుంటే

నా అభిప్రాయంలో పోటీ పరీక్షల కోణంలో ఒకేసారి అన్ని పరీక్షలకు సంసిద్ధమవ్వాలనే తపనకంటే.. నిర్దిష్టంగా ఒక పరీక్షను లక్ష్యంగా ఎంచుకుని దాన్ని సాధించే దిశగా కృషి చేస్తే.. సత్ఫలితం వస్తుంది. అందుకే నేను గ్రూప్‌–2నే లక్ష్యంగా చేసుకుని ఇతర ఏ పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించలేదు. ఫలితంగా టాపర్‌గా నిలిచానని భావిస్తున్నాను.

అసహనానికి గురవ్వద్దు

పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోణంలో ఎలాంటి అసహనానికి గురి కాకూడదు. ముఖ్యంగా పరీక్షలు వాయిదా పడిప్పుడు లేదా సుదీర్ఘ కాలం కొనసాగే పరీక్షల విషయంలో సహనం ఎంతో అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా అడుగులు వేసే మానసిక సంసిద్ధత లభిస్తుంది.

డీటీ లేదా ఏఎస్‌ఓ

భవిష్యత్తులో డిప్యూటీ తహశీల్దార్‌ లేదా సెక్రటేరియట్‌లో ఏఎస్‌ఓ ఉద్యోగాన్ని ఎంచుకుంటాను. నా పరిధిలో వీలైనంత మేరకు సర్వీస్‌ చేసేందుకు కృషి చేస్తాను. అదే విధంగా రానున్న రోజుల్లో గ్రూప్‌–1, సివిల్స్‌కు కూడా ప్రిపరేషన్‌ సాగించాలనుకుంటున్నాను.

నారు వెంకట హరవర్ధన్‌ రెడ్డి గ్రూప్‌–2 మార్కులు

  • పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ): 111
  • పేపర్‌–2 (హిస్టరీ, పాలిటీ, సొసైటీ): 109
  • పేపర్‌–3 (ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌): 111
  • పేపర్‌–4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం): 115

అకడమిక్‌ ప్రొఫైల్‌

  • పదో తరగతి: 10 సీజీపీఏ
  • ఇంటర్మీడియెట్‌: 972 మార్కులు
  • బీటెక్‌ (సీఎస్‌ఈ): 68 శాతం 
Published date : 13 Mar 2025 02:24PM

Photo Stories