Skip to main content

GATE 2023 Details : ‘గేట్‌’–2023 కొట్టండిలా.. ‘పీఎస్‌యూ’లో ఉద్యోగం పట్టండిలా..

గేట్‌–2023కు దరఖాస్తు చేశారా.. ఈ స్కోర్‌తో ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఎంటెక్‌లో చేరడం టార్గెట్‌గా పెట్టుకున్నారా..ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవడమే మీ లక్ష్యమా..!! అయితే లక్షల మందితో పోటీ పడేలా ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. గేట్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది.

గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మందికిపైగా ఈ పరీక్షకు హాజరయ్యారు. టాప్‌ స్కోర్‌ కోసం సీరియస్‌ అభ్యర్థులంతా ఇప్పటికే తమ కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు గేట్‌ స్కోర్‌ ఆధారంగా నియామకాలు చేపట్టే పీఎస్‌యూలు సైతం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి!! ఈ నేపథ్యంలో.. గేట్‌–2023లో రాణించేందుకు మార్గాలు, పీఎస్‌యూల నియామక ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

GATE Exam Preparation Tips: గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

గత కొన్నేళ్లుగా గేట్‌ స్కోర్‌ ఉన్నత విద్య కోసమే కాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ, లేదా ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ వంటి ఉద్యోగాలకు కూడా మార్గంగా మారుతోంది. దీంతో అభ్యర్థులు గేట్‌లో మెరుగైన స్కోర్‌ సాధించడానికి విస్తృత అధ్యయనం చేయాలి అంటున్నారు నిపుణులు.

గేట్‌–2023 పరీక్షా విధానం ఇలా..

GATE

➤ గేట్‌–2023 పరీక్షను మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. 
➤ రెండు విభాగాల్లో మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. 
➤ పార్ట్‌–1లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. 
➤ ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌కు 13 మార్కులు కేటాయించారు. 
➤ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో పార్ట్‌–బిని నిర్వహిస్తారు. ఈ విభాగంలో 72 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. 
➤ ఇలా మొత్తం 100 మార్కులకు గేట్‌ పరీక్ష జరుగుతుంది.

చ‌ద‌వండి: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు

ప్రశ్నలు.. మూడు రకాలు :
☛ గేట్‌ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌(ఎంసీక్యూ), మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ) ప్రశ్నలు.
☛ ఎంసీక్యూ విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది.
☛ మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉండే ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. దానికి సంబంధించిన టాపిక్‌పై పూర్తి స్థాయి అవగాహన కలిగుండాలి. 
☛ న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి.

చ‌ద‌వండి: గేటు దాటకుండానే జాక్‌పాట్‌..|| ముగ్గురికి రూ.32 లక్షల జీతం..|| IT Jobs

పీఎస్‌యూలకూ గేట్‌ స్కోరే ఆధారం.. కానీ

PSC jobs

గత కొన్నేళ్లుగా నవరత్న, మహారత్న, మినీరత్న వంటి హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ స్కోర్‌ ఆధారంగానే ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ వంటి పోస్ట్‌లను భర్తీ చేస్తున్నాయి. ఈ కంపెనీలు ముందుగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. నిర్దిష్ట అకడమిక్‌ అర్హతలతోపాటు, గేట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆ తర్వాత ఆయా సంస్థలు మలి దశ ప్రక్రియ పేరుతో తమ స్వీయ ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నాయి.

వెయిటేజీల వివరాలు ఇలా..
చాలా వరకు పీఎస్‌యూలు గేట్‌ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ; తర్వాత మలి దశలో నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్‌లకు గరిష్టంగా పది శాతం; పర్సనల్‌ ఇంటర్వ్యూకు పదిహేను శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్‌ స్కోర్‌కు 60 నుంచి 65 శాతం వెయిటేజీ ఇస్తూ.. మిగతా మొత్తాన్ని జీడీ/పీఐలకు కేటాయిస్తున్నాయి. ఇలా మొత్తం వంద మార్కులకు అభ్యర్థులు సాధించిన స్కోర్‌ ఆధారంగా తుది ఎంపిక చేపడుతున్నాయి.

GATE 2023 నోటిఫికేషన్‌.. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాస్టర్స్‌... ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సైతం

మలి దశలో ఇలా..
గేట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మలిదశలో.. గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

గ్రూప్‌ డిస్కషన్‌ :

GD

గ్రూప్‌ డిస్కషన్‌లో నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులను వేర్వేరు బృందాలు(టీమ్స్‌)గా ఏర్పాటుచేస్తారు. ఒక్కో టీమ్‌లో అయిదు నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. ప్రతి బృందానికి ఏదైనా ఒక అంశం ఇచ్చి.. మాట్లాడాలని సూచిస్తున్నారు. 

ఈ గ్రూప్‌ డిస్కషన్‌ ఇరవై నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. అంటే.. ప్రతి అభ్యర్థికి సగటున అయిదు నుంచి ఆరు నిమిషాల సమయం లభిస్తుంది. ఈ సమయంలోనే అభ్యర్థులు సదరు టాపిక్‌పై తమ అభిప్రాయాలను, ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌ పోస్టులు.. నెలకు రూ.1,80,000 వ‌ర‌కు వేతనం..

గ్రూప్‌ టాస్క్‌ : 
పలు పీఎస్‌యూలు గ్రూప్‌ డిస్కషన్‌కు బదులు గ్రూప్‌ టాస్క్‌ను నిర్వహిస్తున్నాయి. గ్రూప్‌ టాస్క్‌ అంటే.. నిర్దిష్టంగా ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందు ఉంచి.. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని పేర్కొంటున్నాయి. ఇందులో అభ్యర్థులు చదువుకున్న కోర్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలే ఉంటున్నాయి. వీటిని కూడా అభ్యర్థులు బృందాలుగా ఏర్పడి పరిష్కరించాల్సి ఉంటుంది.

పర్సనల్‌ ఇంటర్వ్యూ ఇలా.. : 

PI

గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్‌ నాలెడ్జ్‌లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. బీటెక్‌లో చేసిన ప్రాజెక్ట్‌ వర్క్, మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్, వాటిద్వారా సదరు అభ్యర్థులకు లభించిన నైపుణ్యాలు, అదే విధంగా సమస్యకు చూపిన పరిష్కారం వంటి విషయాలు తెలుసుకునే యత్నం చేస్తారు. దీంతోపాటు సదరు ఉద్యోగానికి సరిపడే దృక్పథం అభ్యర్థిలో ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తారు.

పెరుగుతున్న కటాఫ్‌..
మలిదశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పీఎస్‌యూలు గేట్‌లో నిర్దిష్ట కటాఫ్‌లను పేర్కొంటున్నాయి. గత రెండేళ్లుగా పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే గేట్‌ స్కోర్‌ కటాఫ్‌ కూడా పెరుగుతూ వస్తోంది.

Graduate Trainee Jobs: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 871 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

పీఎస్‌యూలకు దరఖాస్తు ఇలా..

gate application

● పీఎస్‌యూలు.. గేట్‌ ఫలితాలు విడుదలైన తర్వాత దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. కాని సంబంధిత నియామక ప్రక్రియ షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తున్నాయి. 
● కొన్ని పీఎస్‌యూలు సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో నోటిఫికేషన్లను విడుదల చేసి.. షెడ్యూల్, ఎంపిక ప్రక్రియ వివరాలను వెల్లడిస్తున్నాయి. 
● 2023 సంవత్సరానికి సంబంధించి ఓఎన్‌జీసీ, గెయిల్, ఐఓసీఎల్, కోల్‌ ఇండియా వంటి సంస్థలు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేశాయి. 

ఐఐటీల్లోనూ.. మలి దశ :
ఐఐటీల్లో ఎంటెక్,ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ వంటి ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నప్పటికీ.. మలి దశలో ఆయా ఐఐటీలు.. పర్సనల్‌ టాస్క్, గ్రూప్‌ డిస్కషన్స్‌ పేరిట రెండు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు ఎస్సే ద్వారా ప్రతిభను అంచనావేస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్లు ఖరారు చేస్తున్నాయి.

సన్నద్ధత పొందండిలా..

GATE Preparation

గేట్‌ అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వ్యూహాత్మక ప్రిపరేషన్‌ సాగించాలి. ఇందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ వరకు పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్ట్‌ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్హమైన టాపిక్స్‌ను గుర్తించాలి. వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ఒక టాపిక్‌ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో పరిశీలించాలి. అందుకు అనుగుణంగా మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

అనుసంధానం :
గేట్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో అనుసంధాన విధానాన్ని అలవర్చుకోవాలి. గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగించాలి. వీక్లీ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ అప్రోచ్‌ విజయ సాధనలో ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది.

వెయిటేజీకి అనుగుణంగానే..
అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లోని టాపిక్స్, వాటికి గత అయిదారేళ్లుగా గేట్‌లో లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్‌గా ఉన్న వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. పరీక్షలో మంచి స్కోర్‌ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

గేట్‌–2023 ముఖ్య సమాచారం ఇలా :
● మొత్తం 29 పేపర్లలో గేట్‌ పరీక్ష. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 7.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ : జనవరి 3, 2023
గేట్‌–2023 పరీక్ష తేదీలు: 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో (ప్రతి రోజు రెండు స్లాట్లలో).
ఫలితాల వెల్లడి: మార్చి 16, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://gate.iitk.ac.in

Published date : 06 Oct 2022 07:09PM

Photo Stories