JNVST 2022: చదువుతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ రాణించాలని ఆశిస్తున్నారా..
- నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
- ఆరు, తొమ్మిది తరగతుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్
- జేఎన్‌వీఎస్‌టీ–2022 పరీక్ష ద్వారా సీట్లు ఖరారు
- నవోదయ విద్యకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు
- సీబీఎస్‌ఈ కరిక్యులంతో బోధన, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్
పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు వినూత్న విద్యా విధానం, బోధన ఉండాలని కోరుకుంటున్నారా..
చదువుతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ రాణించాలని ఆశిస్తున్నారా..
పాఠ్యాంశాల పరిజ్ఞానంతోపాటు సామాజిక విలువలపై అవగాహన కల్పించే పాఠశాలల గురించి అన్వేషిస్తున్నారా..
–వీటన్నింటికీ కేరాఫ్.. జవహర్ నవోదయ విద్యాలయాలు!!
ఆహ్లాదకరమైన వాతావరణంలో, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌తో విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై ఆసక్తి పెంచడమే కాకుండా.. సామాజిక అంశాలపైనా అవగాహన పెంచే పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. పాఠశాల విద్యలో వినూత్న విధానాలు అమలు చేయాలని.. అందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో 1986 విద్యావిధానంలో భాగంగా ఏర్పాటైనవే జవహర్ నవోదయ విద్యాలయాలు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జవహర్ నవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే జేఎన్‌వీల ప్రధాన లక్ష్యంగా ఉంది.
రెసిడెన్షియల్ విధానం
జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలోనే ఉంటాయి. అంటే.. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులు సదరు పాఠశాలల వసతి గృహాల్లోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. తరగతి గది బోధనతోపాటు.. హాస్టల్స్‌లో మెంటార్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఫలితంగా తరగతి గది బోధన తర్వాత కూడా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు పాఠ్యాంశాల అధ్యయనం కొనసాగిస్తారు.
ఉచిత విద్య
జవహర్ నవోదయ విద్యాలయాల మరో ప్రత్యేకత.. ఉచిత విద్య. జేఎన్‌వీలో చేరిన విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు.. ఇలా అన్నీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పా టు చేసిన నిధికి మాత్రం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు నుంచి ఎస్సీ/ఎస్టీ వర్గాలు/బాలికలు/బీపీఎల్ వర్గాల(దారిద్య్రరేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపు లభిస్తుంది.
జాతీయ స్థాయిలో 661 జేఎన్‌వీలు
- జవహర్ నవోదయ విద్యాలయ పథకం ప్రకారం–ప్రస్తుతం జాతీయ స్థాయిలో 661 జేఎన్‌వీలను ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా కేటాయించారు.
- తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 15 జేఎన్‌వీలు, తెలంగాణలో 9 జేఎన్‌వీలను నెలకొల్పారు.
- ప్రతి జేఎన్‌వీలో ఆరో తరగతిలో 60 సీట్లు చొప్పున అందుబాటులో ఉంటాయి.
- నవోదయ విద్యాలయాలు ప్రస్తుతం ఆరు, తొమ్మిదో తరగతుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయిలో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(జేఎన్‌వీఎస్‌టీ) ను నిర్వహిస్తున్నారు.
ఆరో తరగతి ప్రవేశ పరీక్ష విధానం
ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జేఎన్‌వీఎస్‌టీ మూడు విభాగాల్లో జరుగుతుంది. పూర్తిగా పెన్, పేపర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలను గుర్తించాలి. మొత్తం 80 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము పరీక్ష రాయదలచుకున్న మాధ్యమాన్ని పేర్కొనాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా మాధ్యమంలోనూ పరీక్షకు హాజరయ్యే వీలుంది.
విభాగం | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ | 40 | 50 | 60 ని. |
అర్థమెటిక్ టెస్ట్ | 20 | 25 | 30 ని. |
లాంగ్వేజ్ టెస్ట్ | 20 | 25 | 30 ని. |
మొత్తం | 80 | 100 | 2 గం. |
తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష
తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు మాత్రమే పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. తొమ్మిదో తరగతిలో ఖాళీల భర్తీకి(లేటరల్ ఎంట్రీ) నిర్వహించే పరీక్షలో మూడు సబ్జెక్టులు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్–15 మార్కులు, హిందీ–35 మార్కులు, మ్యాథమెటిక్స్–35 మార్కులు, సైన్స్–35 మార్కులు.. మొత్తంగా వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోనే నిర్వహిస్తారు. హిందీ లేదా ఇంగ్లిష్ మీడియంల్లోనే రాసే వీలుంది.
తుది జాబితా ఇలా
జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో సాధించిన మార్కులు.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న జిల్లా.. సదరు జిల్లాలో ఉన్న జేఎన్‌వీలో సీట్ల సంఖ్య.. రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
జిల్లా స్థాయిలో ఎంపిక
అన్ని రాష్ట్రాల్లోనూ జేఎన్‌వీలను ఏర్పాటు చేశారు. ప్రవేశ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న జెఎన్‌వీల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు సదరు జేఎన్‌వీ ఏర్పాటైన జిల్లాకు చెంది ఉండాలి.
పల్లే విద్యార్థులకు ప్రాధాన్యం
జేఎన్‌వీలలోని సీట్ల భర్తీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మహిళా విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మొత్తం సీట్లలో 75 శాతం, మిగతా సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. మొత్తం సీట్లలో అమ్మాయిలకు 33 శాతం(1/3 వంతు) సీట్లను కేటాయిస్తున్నారు.
ప్రిపరేషన్
జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించేందుకు విద్యార్థులు.. తాము దరఖాస్తు చేసుకుంటున్న తరగతి ఆధారంగా అంతకుముందు తరగతులకు సంబంధించిన అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష విద్యార్థులు నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ పుస్తకాలను చదవాలి. తొమ్మిదో తరగతి అభ్యర్థులు అయిదు నుంచి ఎనిమిది తరగతుల పుస్తకాలను ముఖ్యంగా మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
జేఎన్‌వీఎస్‌టీ–2022 ముఖ్య సమాచారం
ఆరో తరగతి
- అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతుండాలి.
- గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించిన 75 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా..గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే మూడు, నాలుగు, అయిదో తరగతి చదవాలి.
- వయో పరిమితి: మే 1, 2009–ఏప్రిల్ 30, 2013 మధ్యలో జన్మించి ఉండాలి.
- ఏ జిల్లా జేఎన్‌వీకి దరఖాస్తు చేయదలచుకున్నారో.. ఆ జిల్లా స్థానిక అభ్యర్థులై ఉండాలి.
- ఆరో తరగతికి జేఎన్‌వీఎస్‌టీ –2022 పరీక్ష తేదీ: ఏప్రిల్ 30, 2022(ఉదయం 9:30 నుంచి 11:30 వరకు).
తొమ్మిదో తరగతి
- అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతుండాలి.
- ఏ జిల్లాలోని జేఎన్‌వీకి దరఖాస్తు చేయదలచుకున్నారో.. ఆ జిల్లాలోని పాఠశాలల్లోనే చదువుతుండాలి.
- వయో పరిమితి: మే 1, 2006–ఏప్రిల్ 30, 2010 మధ్యలో జన్మించి ఉండాలి.
- తొమ్మిదో తరగతికి జేఎన్‌వీఎస్‌టీ–2022 పరీక్ష తేదీ: ఏప్రిల్ 9, 2022.
- పరీక్ష కేంద్రం: సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం
- విద్యార్థులు https://navodaya.gov.in వెబ్‌సైట్‌లోని అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు ఫోటోగ్రాఫ్, ఇతర నిర్దేశిత సర్టిఫికెట్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు/సంరక్షకుల సంతకాలను అప్‌లోడ్ చేయాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు, ఇతర రిజర్వేషన్లకు అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్‌లను మార్చి 30, 2022లోపు పొందాలి.
- గ్రామీణ ప్రాంత విద్యార్థులు తాము మూడు, నాలుగు, అయిదు తరగతులను గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివినట్లు స్టడీ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలి.
- ఆరో తరగతికి దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30, 2021
- తొమ్మిదో తరగతికి దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 31, 2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://navodaya.gov.in
వినూత్న బోధన–నిరంతర పర్యవేక్షణ
నవోదయ విద్యాలయాల్లో వినూత్న బోధన విధానాలను అనుసరిస్తున్నాం. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల్లో ఆలోచన పరిధి పెరిగేలా చూస్తున్నాం. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌తో క్రీడలు, ఇతర అంశాల్లోనూ పాల్పంచుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల బాగోగుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
–ఎం.ద్రవిడమణి, అసిస్టెంట్ కమిషనర్ (ట్రైనింగ్), జవహర్ నవోదయ విద్యాలయ సమితి.