Skip to main content

Team India Fitness Test: మళ్లీ తెరపైకి యోయో... యోయోలో టాప్‌ స్కోరర్‌ ఎవరో తెలుసా..?

భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటగాళ్లు మళ్లీ యోయో ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసవ్వాల్సిందే. టీమ్‌ఇండియా సెలక్షన్‌ కు అర్హత ప్రమాణాల జాబితాలో తిరిగి యోయో చేర్చాలని జనవరి 1న నిర్వహించిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.
Indian Cricket Team

బోర్డు కార్యదర్శి జై షా, అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కెప్టెన్‌  రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, ఎన్‌సీఏ అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్, సెలక్టర్‌ చేతన్‌  శర్మ సమక్షంలో ఆదివారం సమావేశం జరిగింది. యోయో పరీక్షతో పాటు డెక్సా (బోన్‌  స్కాన్‌  టెస్ట్‌)ను కూడా తప్పనిసరి చేశారు. 

చ‌ద‌వండి: రెండేళ్లు టెంట్లలో పడుకుని ఏడు కోట్లు సాధించాడు... అతని వయసు కేవలం పదేళ్లే
యోయో ఫిట్‌నెస్‌ పరీక్షలో ఆటగాళ్లు 20 మీటర్ల దూరంలో ఉన్న మార్కర్ల మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది. వాళ్లు వేగాన్ని పెంచుతూ ఉరకాలి. విరాట్‌ కోహ్లి కెప్టెన్‌ గా ఉన్నప్పుడు ఈ యోయో పరీక్షను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షలో మొదట పాస్‌ స్కోరును 16.5గా నిర్ణయించారు. తర్వాత ఆ స్కోరును 16.1కి తగ్గించారు. విరాట్‌ కెప్టెన్‌గా దిగిపోయాక ఈ పరీక్షకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చి మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌ ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

చ‌ద‌వండి: ఈపీఎఫ్‌వో న్యూ గైడ్‌లైన్స్‌ ఇవే...
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సహా కేఎల్‌ రాహుల్, దీపక్‌ చహర్‌ తదితర టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫిట్‌నెస్‌ సమస్యలతో రోహిత్‌ అందుబాటులో లేకపోవడంతో... గతేడాది జట్టు కెప్టెన్లగా దాదాపు ఏడుగురు ఆటగాళ్లు వ్యవహరించారు.
ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో పేస్‌ దళ నాయకుడు బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా సైతం గాయం కారణంగా ఐసీసీ ఈవెంట్‌కు దూరం కావడం ప్రభావం చూపింది. వెరసి కీలక ఈవెంట్లలో టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ చర్చనీయాంశమైంది. 2023లో సొంతగడ్డపై జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో లోపాలు సవరించుకుని బరిలోకి దిగాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వ్యూహాలు రచిస్తోంది.

చ‌ద‌వండి: అదానీకి జాక్‌పాట్‌ ఇయర్‌... ఆయన ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా.. ముకేశ్‌ డౌన్‌
రెండు కోన్‌ల (ప్లాస్టిక్‌ స్థంభాలు) మధ్య బీప్‌ సౌండ్‌తో పరిగెత్తించే పరీక్షే యోయో టెస్టు. రెండు కోన్‌ ల మధ్య 20 మీటర్ల దూరం ఉంటుంది. మూడు బీప్‌ సౌండ్‌లు మోగేలోపు ఈ దూరాన్ని పూర్తి చేయాలి. అంటే మొదటి బీప్‌నకు ఇక్కడి కోన్‌ నుంచి పరుగు ప్రారంభించి... రెండో బీప్‌ సౌండ్‌లోపు అవతలి కోన్‌ కు చేరాలి.
మూడో బీప్‌ మోగే సరికి ఇవతలి కోన్‌ చేరాలి. దీనికి స్కోరు ఉంటుంది. అంటే నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తే మెరుగైన స్కోరు, ఆ తర్వాత సగటు స్కోరు ఇస్తారు. అసాధారణ ఫిట్‌నెస్‌తో ఉండే కోహ్లి యోయో టెస్టు పాసైనప్పటికీ టాప్‌–5 స్కోరర్స్‌లో లేడు. అతను 19 స్కోరు చేసి 8వ స్థానంలో ఉన్నాడు. గతంలో షమీ, సంజూ సామ్సన్, రాయుడు, రైనా, పృథ్వీ షా, వాషింగ్టన్‌ సుందర్‌ యోయో టెస్టులో ఫెయిలయ్యారు.

చ‌ద‌వండి: ఐదువేల స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

టాప్‌5 యోయో స్కోర్లు
1. షాన్‌ మసూద్‌ (పాక్‌)         – 22.1
2. బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌)        – 21.8
3. మయాంక్‌ డాగర్‌ (భారత్‌)  – 19.3
4. బెత్‌ లాంగస్టన్‌ (ఇంగ్లండ్‌)   – 19.2
5. రిజ్వాన్‌ (పాక్‌)                 – 19.2

Published date : 02 Jan 2023 01:31PM

Photo Stories